ఎంతో మంది సీరియల్ కిల్లర్స్ చరిత్రలు చూసే ఉంటాం. ఒళ్లుగగుర్పొడిచే సైకో కిల్లర్స్ కథనాలూ చదివే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పుకునే కథలో కిల్లర్ మనిషి కాదు, ఒక కుర్చీ. అవును.. ఆ కుర్చీలో ముచ్చటపడి కూర్చున్నా.. పంతం పట్టి కూర్చున్నా మరణం మాత్రం తప్పదు. ఎంతటి వీరుడైనా ఆ కుర్చీలో కూర్చుంటే కోరి గండం తెచ్చుకున్నట్లే. ప్రమాదం ఎటునుంచైనా వస్తుంది. కబళించే తీరుతుంది. అందులో కుర్చున్నవారికి ఆ రోజు గడవదు. మరో రోజు ఉండదు. వందలమంది ప్రాణాలు తీసిన ‘బస్బే స్టూప్ చైర్’ చరిత్రను వణికించిన ఓ మిస్టరీ..
17వ శతాబ్దంలో థామస్ బస్బే అనే ఓ చిల్లర దొంగ అమితంగా ఇష్టపడిన ఈ కుర్చి.. అతడి మరణానంతరం అందులో కూర్చున్నవారి ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఈ కుర్చీ చరిత్ర తెలియాలంటే.. ముందుగా థామస్ బస్బే కథ తెలుసుకోవాలి. ఇంగ్లాండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లోని త్రిస్క్ అనే ప్రాంతంలో నివాసముండే డానియల్ ఔటీ కుమార్తె ఎలిజిబెత్ ఔటీని పెళ్లి చేసుకున్నాడు థామస్ బస్బే. డానియల్ ఔటీ.. ఓ దొంగ కావడంతో అల్లుడు థామస్ కూడా దొంగతనాలకు అలవాటుపడ్డాడు.
కొంతకాలం సాఫీగా సాగిన బస్బే కాపురంలో విభేదాలు తలెత్తాయి. విషయం తెలుసుకున్న డానియల్ కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చేయాలని.. బస్బే ఇంటికొచ్చాడు. మామగారు వచ్చిన కాసేపటికి ఇంటికి చేరుకున్న బస్బే.. తన మామ తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చోవడం చూసి ఆవేశంతో రగిలిపోయాడు. ఆ కోపంతోనే డానియల్‌ని చంపేశాడు బస్బే. నేరనిర్ధారణతో 1706లో అతనికి ఉరిశిక్ష ఖరారైంది. దాంతో ఎలిజబెత్.. థామస్ బస్బే ఇంటిని ఖాళీ చేసి.. ఫర్నీచర్ మొత్తం ఓ హోటల్‌కు అమ్మేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది.
ఉరి శిక్షపడిన థామస్ బస్బే చివరి కోరికగా తను ఎంతో ఇష్టపడే కుర్చీలో కూర్చుంటానని కోరాడు. దాంతో ఉరి తీయడానికి ముందు పోలీసులు బస్బేని ఆ హోటల్‌కి తీసుకెళ్లారు. ఆ కుర్చీలో కాసేపు కూర్చుని చాలా భావోద్వేగానికి గురయ్యాడట థామస్ బస్బే. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అతడిని ఉరి తీశారు. కథ అక్కడే ఆరంభమైంది. బస్బే చివరి కోరిక తెలుసుకున్న జనం.. ఆ కుర్చీని చూడటానికి హోటల్‌కి ఎగబడటం మొదలుపెట్టారు. ఆ క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని భావించిన హోటల్ యాజమాన్యం.. హోటల్‌కి ‘ద బస్బే స్టూప్ ఇన్’ అని పేరు మార్చింది. దాంతో హోటల్‌కి జనాలు క్యూకట్టారు.
ఆ కుర్చీలో కూర్చుని బస చేసి.. గొప్పగా చెప్పుకునేవారు. అయితే అలా కూర్చున్నవారంతా ఏదో కారణంతో చనిపోసాగారు. తొలుత ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొందరు సైనికులు ఆ హోటల్‌లోనే తలదాచుకున్నారు. వారంతా బస్బే కుర్చీలో కుర్చొన్నవారే. ఆ మరునాడే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని కొందరు భావిస్తే.. కొందరు మాత్రం ఇదంతా కుర్చీ పనే అంటూ వాదించారు. అది కుర్చీ కాదు బస్బే ఆత్మ అంటూ నమ్మడం మొదలుపెట్టారు. 1894లో వరుస మరణాలు వారి వాదనను బలపరచాయి.
హోటల్ లాభార్జనవైపు నడవడంతో అందులో పబ్ కూడా పెట్టింది యాజమాన్యం. కుర్చీని హోటల్ నుంచి పబ్‌లోకి మార్చారు. ఆ కుర్చీలో కుర్చుని మద్యం తాగిన ఓ వ్యక్తి మరునాడు హోటల్ వెనుకవైపు స్తంభానికి శవమై వేలాడాడు. అది ఆత్మహత్యని భావించేవారికంటే.. కుర్చీ చంపేసిందనే వారి సంఖ్య రెట్టింపయ్యింది. ఆ ప్రచారం కూడా హోటల్‌కు లాభాలనే తెచ్చిపెట్టింది. కొందరు ఔత్సాహికులు ఆ కుర్చీతో ‘డేర్’ గేమ్’ ఆడటం మొదలుపెట్టారు. సాహసవీరులు అందులో కూర్చోవడానికి పోటీపడేవారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు పందెం కాసి మరీ ఆ కుర్చీలో కూర్చున్నారు. చివరికి వారిద్దరూ కారు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత నుంచి హోటల్‌కి చెడ్డపేరు రావడం మొదలైంది.
దాంతో హోటల్ యజమాని టోనీ ఎర్న్‌షా ఇకపై అందులో ఎవరూ కుర్చోకూడదని కుర్చీని హోటల్ సెల్లార్‌లోకి మార్పించాడు. అయితే, ఓ రోజు హోటల్‌కు సామాన్లు తీసుకొచ్చిన ఓ డ్రైవర్.. సెల్లార్‌లో ఉన్న ఆ కుర్చీలో కుర్చున్నాడు. కొన్ని గంటల వ్యవధిలో అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎర్న్‌షా ఆ కుర్చీని స్థానిక త్రిస్క్ మ్యూజియానికి అప్పగించేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుర్చీలో కూర్చోకూడదనే ఉద్దేశంతో కుర్చీని నేలపైన ఉంచకుండా గోడకు వేలాడదీశారు. దాని కింద ఆ కుర్చీ ఎంత ప్రమాదకరమో తెలుపుతూ మొత్తం హిస్టరీ వివరంగా రాశారు కూడా. అందులో ‘కుర్చీని కనీసం ముట్టుకొనే సాహసం కూడా చెయ్యొద్ద’నే హెచ్చరికా ఉంటుంది.
మ్యూజియంలో ఉన్నది అసలు కుర్చీ కాదా?
అయితే మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీ బెస్బే ఉరి సమయంలో కుర్చున్న అసలు కుర్చీ కాదని, ఈ డమ్మీ కుర్చీ కేవలం 138 ఏళ్ల కిందటిదేనని, 1840లో తయారుచేసినదని చెప్పుకొచ్చాడు ఫర్నీచర్ హిస్టోరియన్ ఆడమ్ బావెట్. అతను చెప్పిందే నిజమైతే.. ఎందరో ప్రాణాలు తీసేసిన బెస్బే అసలు కుర్చీ ఏమైనట్లు? హోటల్ నిర్వాహకులు అసలు కుర్చీని దాచిపెట్టారా? అనేది నేటికీ తేలలేదు.
చదవండి: ముఖం తేటగా కనిపించాలంటే.. ఈ కొద్దిపాటి మార్పులు అవసరం..!
Comments
Please login to add a commentAdd a comment