ఉన్నత ఆశయానికీ.. ఒట్టి మోసానికీ పోలికేంటీ? గొప్ప ప్రేరణకు.. స్వార్థ గుణానికి పొంతనేంటీ? కానీ ఆమె జీవితంలో.. వాటన్నింటికీ చోటుంది. అవును.. ఆమె బతుకు, చావు రెండూ మిస్టరీనే. నార్వే చరిత్రలో ఎన్నో అనుమానాలతో లిఖించిన ‘ఇస్డాల్ ఉమన్ ’ స్టోరీ పూర్తిగా చదివితే అది నిజమే అనిపిస్తుంది.
1970 నవంబర్ 29, ఆదివారం మిట్ట మధ్యాహ్నం మొదలైందీ కథ. నార్వేలోని బర్గన్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఇస్డాలెన్ వ్యాలీ సమీపంలోని కొండ మీదకు ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో హైకింగ్ ట్రయల్‌కి వెళ్లాడు. ఉన్నట్టుండి కాలిన వాసన గుప్పుమంటూ.. ఆ తండ్రీకూతుళ్లను ఆ చుట్టూ వెతికేలా చేసింది. కాసేపటికి.. వెనుకవైపు ఏటవాలుగా ఉన్న లోయలో సగం కాలిన ఓ అమ్మాయి శవం.. వాళ్లని గజగజా వణికించింది. వెంటనే ముగ్గురూ బర్గన్ పోలీస్ స్టేషన్‌కి పరుగుతీశారు. దట్టమైన చెట్లతో.. చెత్తాచెదారంతో కాస్త భయంకరంగా ఉండే ఆ చోటు.. చాలామందికి పర్యాటక ప్రదేశం. నిరంతరం ఆత్మహత్యలు, అనుకోని ప్రమాదాలతో అప్పటికే ఇస్డాలెన్ లోయకి ‘ది డెత్ వ్యాలీ’ అనే పేరు పుట్టుకొచ్చింది.
నిటారుగా, అగమ్యగోచరంగా ఉన్న క్రైమ్ స్పాట్‌కి చేరుకోవడం పోలీసులకు చాలా కష్టమైంది. శవం సగంపైనే కాలిపోయింది. రూపం చెదిరిపోయింది. రెండు పిడికిళ్లు బిగించి.. బాక్సర్ పొజిషన్ లో ‘ఫైట్ చేయడానికి సిద్ధమే’ అన్నట్లుంది ఆమె శవం. ఆ పక్కనే సగం కాలిన గొడుగు, రెండు ప్లాస్టిక్ సీసాలు, లిక్కర్ బాటిల్ ఇలా చాలా పడి ఉన్నాయి. నిజానికి అక్కడ ప్రతి గుర్తింపుని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లనిపించింది. డ్రెస్ లేబుల్స్, బాటిల్ లేబుల్స్ ఏవీ లేవు. పైగా ఆమె నగలు, వాచ్ ఓ పక్కన పొందిగ్గా కనిపించాయి.
వైద్యపరీక్షల్లో ఆమె కడుపులో 50 నుంచి 70 దాకా నిద్రమాత్రలున్నాయని.. తేలింది. కొన్ని రోజులకి బర్గన్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో 2 సూట్‌కేసులు దొరికాయి. వాటిపై చనిపోయిన అమ్మాయి వేలిముద్రలు ఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఓపెన్ చేశారు. అందులో 2 కళ్లద్దాలు.. రంగురంగుల డ్రెస్‌లతో పాటు చాలా విగ్గులు.. జర్మనీ, నార్వే, బెల్జియం వంటి దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు.. కోడింగ్‌లో రాసిన ఒక పేపర్, షూ షాప్ కవర్ ఉన్నాయి. అన్నింటిలో కోడింగ్ పేపర్, షూ కవర్.. కేస్‌ను ఛేదించే క్లూస్‌గా కనిపించాయి.
షూ కవర్.. నార్వేలోని స్టవంగర్‌లో రార్ట్‌వెట్ షూ షాప్‌కి చెందిందని గుర్తించి.. అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం ఒక యువతి తమ దగ్గర జత బూట్లు కొన్నదని.. సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుందని.. తను చాలా వినయంగా, అందంగా ఉందని.. కళ్లు, జుట్టు గోధుమ రంగులో ఉన్నాయని.. ఆ షాప్ యజమాని కొడుకు చెప్పాడు. మృతదేహం దగ్గర దొరికిన షూస్ అవేనని అతడు గుర్తించాడు. దాంతో పోలీసులు వెంటనే ఆమె ఊహాచిత్రాన్ని గీయించారు. ఇంతలో కోడింగ్ పేపర్‌లో ఉన్నదాన్ని కనిపెట్టి.. ఆమె బస చేసిన ఓ హోటల్‌కి వెళ్లారు.
ఊహాచిత్రం ఆధారంగా ఆ హోటల్లో ఆరా తియ్యగా.. ఆమె ‘ఫనెలా లార్ష్’ అనే పేరుతో చెక్ ఇన్ అయ్యిందని, కొన్ని రోజుల అక్కడే ఉందని తేలింది. ఆల్విల్డా రంగ్‌నెసా అనే వెయిట్రెస్.. ఆమెని వెంటనే గుర్తుపట్టింది. ‘ఆమె చాలా అందంగా ఉంది. ఆమె అందానికి ముగ్ధురాలినయ్యానని ఆమె గ్రహించి.. నన్ను చూసి కొంటెగా నవ్వేది. అందుకే తను నాకు బాగా గుర్తుండిపోయింది’ అని చెప్పింది. అలాగే ఆమె మరో కీలక సమాచారాన్నీ ఇచ్చింది. ‘ఒకరోజు ఆమె.. డైనింగ్ హాల్లో ఇద్దరు జర్మనీ నేవీ అధికారుల పక్కనే చాలాసేపు కూర్చుంది. అయితే తను వాళ్లతో మాట్లాడటం నేను చూడలేదు’ అనీ చెప్పింది.
దాంతో కోడ్ లాంగ్వేజ్ రాతలను సరిపోల్చుకుంటూ.. ‘ఆమె ఒక గూఢాచారి’ అన్న అభిప్రాయం ఏర్పడింది. కొన్నిరోజులకు ఆమె చాలా మారుపేర్లతో, మారువేషాలతో.. పలు హోటల్స్‌లో ఉందనే సమాచారం వచ్చింది. 1960లో నార్వేజియన్ పెంగ్విన్ క్షిపణి ట్రయల్స్‌తో ఒక స్త్రీ కదలికలు చురుగ్గా ఉండేవని, ఆమె ఈమే కావచ్చనే నివేదికలూ బయటికొచ్చాయి. ఈ క్రమంలోనే.. ‘ఆమె మోసగత్తె అయ్యి ఉంటుంది, డబ్బు కోసం వేషాలు మారుస్తూ ఉండేదేమో?’ అని కొందరు.. ‘లేదు లేదు తనో వేశ్య కావచ్చు’ అని మరికొందరు సొంత కథనాలు అల్లడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా.. కనీసం ఆమె పేరు కూడా తెలుసుకోలేకపోయారు. ఆమె శవం ఇస్డాలెన్‌లో దొరికింది కాబట్టి కాలక్రమంలో ‘ఇస్డాల్ ఉమన్’ అంటూ వార్తాపత్రికలే నామకరణం చేశాయి. అయితే సడెన్‌గా 1971లో పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు.
సరిగ్గా 46 ఏళ్ల తర్వాత.. 2016లో తీవ్ర ఒత్తిళ్ల మధ్య.. ఈ కేసుని రీ–ఓపెన్ చేశారు. ఆమె అవశేషాలకు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఊపిరితిత్తుల్లో పొగ రేణువులు ఉన్నాయని.. మంటల్లో కాలుతున్నప్పుడు ఆమె బతికే ఉందని.. శరీరం పెట్రోల్‌తో కాలిందని, కడుపులోని నిద్రమాత్రలతో పాటు.. మంటలతో ఏర్పడిన కార్బ¯Œ మోనాక్సైడ్ కూడా ఆమె మరణానికి కారణమైందని వైద్యులు తేల్చారు.
ఇక రీ ఓపెన్‌లోనూ సేమ్ సీన్. ఆమె చావుపై కాస్త క్లారిటీ వచ్చినా.. ఆమె ఎవరన్నది ఎవరికీ తెలియలేదు. 2019లో ఫ్రాన్స్‌లోని ఫర్బాష్ నివాసి ఒకరు ‘లే రిపబ్లికేన్ లోరేన్ ’ అనే న్యూస్ పేపర్‌లో వచ్చిన ఈమె కథనాన్ని చదివి.. ఆ సంస్థ రిపోర్టర్స్‌ని కలిశాడు. ‘1970 వేసవిలో.. నేను సుమారు 26 ఏళ్ల వయసున్న ఓ యువతితో కలసి జీవించాను. తను చాలా భాషల్లో మాట్లాడగల సమర్థురాలు. యూరప్‌లోని బాల్కన్ యాసలో మాట్లాడేది. వ్యక్తిగత వివరాలు పంచుకోవడానికి ఇష్టపడేది కాదు. తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చేవి. తన దగ్గర చాలా విగ్గులు, రంగురంగుల దుస్తులు ఉండేవి. ఆమె అచ్చం ఇస్డాల్ ఉమన్ ఊహాచిత్రంలానే ఉంది’ అని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం కథను రసవత్తరంగా మార్చింది తప్ప.. ముందుకు మాత్రం తీసుకెళ్లలేదు.
ఇక ఈ కేసుని శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు. డీఎన్‌ఏ ప్రొఫైల్ ఆధారంగా.. ఆమె యూరప్ సంతతికి చెందని మహిళ అంటూ.. ఆమె బంధువుల్ని వెతికే పనిలో పడ్డారు. నిజానికి వాళ్ల ప్రయత్నం ఫలిస్తే.. ఏదో ఒకరోజు ఆమె ఎవరు అన్నది ప్రపంచానికి తెలుస్తుంది. కానీ అది హత్యా? ఆత్మహత్యా? హత్య అయితే ఎవరు చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం మాత్రం కష్టమే. ఏదేమైనా చివరికి ఆమె సృష్టించుకున్న మారుపేర్లు, మారు రూపాలే.. ఆమె ఉనికిని కాలగర్భంలో కలిపేశాయి. ఆమె ఒక స్పై(గూఢచారి)గా తన దేశానికి గొప్ప సేవ అందించి యోధగా శత్రువు చేతిలో మరణించిందా? లేక మోసగత్తెగా ఎవరి ప్రతికారానికైనా బలయ్యిందా? జీవితంపై విరక్తితో నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అన్న ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాల్లేవు.
- సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment