- చంపి పూడ్చిపెట్టి ఉంటారని పోలీసుల అనుమానం
- భిన్న ఆధారాలతో మిస్టరీగా మారిన కేసు
కాకినాడ క్రైం: గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్యచేసి గోతిలో పూడ్చి పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగి రెండు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు గురువారం సమయం లేకపోవడంతో శుక్రవారం తహశీల్దార్ సమక్షంలో బయటకు తీయించాలని పోలీసులు నిర్ణయించారు. వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని భావనారాయణ పురం శివారు పోస్టల్ కాలనీ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో రక్తంతో తడిసిన బట్టలను గురువారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
కాకినాడ రూరల్ సీఐ వి.పవన్ కిశోర్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. రక్తంతో తడిసిన చొక్కా, లుంగీని పరిశీలించారు. అక్కడికి కొద్ది దూరంలో నేల తవ్వి ఉండడాన్ని గమనించారు. దానిని పరిశీలించగా, అందులో మృతదేహాన్ని పాతిపెట్టారని రూఢీ అయింది. దీంతో పరిసరాలను గాలించారు. కొద్ది దూరంలో రోడ్డు పక్కగా ఒక బ్యాగ్ పడి ఉంది. దాని పక్కనే ప్లాస్టిక్ కవర్‌లో ఓ పూలదండ, తుప్పల్లో మరో పూలదండ ఉన్నాయి. బ్యాగ్‌ను పోలీసులు తెరిచి చూడగా చొక్కాలు, ఫ్యాంట్లు, కుట్టేందుకు సిద్ధంగా ఉన్న కొన్ని బట్టలు, ప్లాస్టిక్ కవర్లలో కొత్త ధోవతి ఉన్నాయి. చొక్కా కాలర్‌పై ఉన్న స్టిక్కర్లను పరిశీలిస్తే అన్నిటిపైనా సందీప్ టైలర్స్ అని ఉంది. దానిపై ఉన్న సెల్ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా అవతలి వ్యక్తి తమది నల్గొండ జిల్లా భువనగిరి అని చెప్పాడు. అతడినుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఒక బృందాన్ని భువనగిరి పంపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి.
మిస్టరీగా సంఘటనా స్థలం
నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో దుండగులు ఓ వ్యక్తిని హతమార్చి అతడిని పూడ్చిపెట్టారని అనుమానిస్తున్నారు. ఈ స్థలంలో ఒక్కో చోట ఒక్కోవిధమైన ఆధారాలు పోలీసులకు దొరికాయి. అయితే చనిపోయింది ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదు. బ్యాగ్‌లోని చొక్కాలపై భువనగిరి టైలర్ చిరునామా ఉన్నప్పటికీ ప్లాస్టిక్ కవర్లు కాకినాడలోని దుస్తుల దుకాణానికి చెందినవి కావడం మిస్టరీగా మారింది.
కాకినాడ వాసినే హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఒక నిర్ధారణకు వచ్చారు. మృతుడు 60 ఏళ్ల వృద్ధుడని పోలీసులు భావిస్తున్నారు. కాగా పరిసరాల్లో లభ్యమైన పూల దండలు, కొత్త దుస్తులను చూసిన స్థానికుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. స్థానిక యువతిని ప్రేమించిన వ్యక్తి ఇక్కడికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు వచ్చి ఉండవచ్చని, కాకినాడలోనే దుస్తులు కొనుగోలు చేసి ఉంటాడని వారంటన్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఈ మారుమూల ప్రాంతానికి తీసుకువచ్చి యువతి బంధువులు హతమార్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని శుక్రవారం వెలికి తీసిన తర్వాతే ఏదైనా నిర్ధారణకు వీలవుతుందని పోలీసులు అంటున్నారు. సర్పవరం ఎస్సై ప్రశాంత్ కుమార్, ట్రైనీ ఎస్సై బుజ్జిబాబు, పోలీసు సిబ్బంది ఆధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. సంఘటనా స్థలంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.