మిస్టరీగా మహిళ మృతి.. హత్యా.. ఆత్మహత్యా..? | Woman Deceased Mystery Police Lodged Complaint Nalgonda | Sakshi

మిస్టరీగా మహిళ మృతి.. హత్యా.. ఆత్మహత్యా..?

Nov 21 2021 10:32 AM | Updated on Nov 21 2021 10:35 AM

Woman Deceased Mystery Police Lodged Complaint Nalgonda - Sakshi

సాక్షి,మిర్యాలగూడ అర్బన్‌(నల్గొండ): పట్టణంలోని అశోక్‌నగర్‌లో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మహిళ(45)ది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సంఘటనా స్థలంలో ఆధార్‌ కార్డు లభించిందని, అందులో జి. రాజ్యలక్ష్మి, భర్త జగదీశ్వర్‌రావు, బంజారాహిల్స్, భువనగిరి అని ఉన్నట్లు టూటౌన్‌ సీఐ నిగిడాల సురేష్‌ తెలిపారు.

మృతురాలి ఫోన్‌ డేటా కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి ఫొటోను సైతం పోలీసులు విడుదల చేశారు. కాగా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కాంతారావుతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. 40 రోజుల క్రితం.. కాంతారావు, ప్రస్తుతం చనిపోయిన మహిళతో కలిసి అశోక్‌నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యాభర్తలమని చెప్పి తమ వివరాలను స్థానికులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. కాగా ఈ నెల 15వ తేదీన ఇంటికి కాంతారావు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మూడు రోజుల తర్వాత వారు ఉంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మహిళ మృదేహం కుళ్లినస్థితిలో మంచంపై పడి ఉన్న విషయం విదితమే. ఇంటి యజమాని రామచంద్రయ్య ఇచ్చిన వివరాలతో కాంతారావు నంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వస్తుందని పోలీసులు తెలిపారు. మహిళ మృతిచెందిన సమాచారం టీవీల్లో, పేపర్‌లో చూసిన కాంతారావు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతురాలి ప్రాథమిక ఆధారాలు గుర్తించామని పూర్తి వివరాలు ఆమె కుటుంబ సభ్యులు వస్తే తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు.

చదవండి: విషాదం: ఆడుకుంటూ.. అనంతలోకాలకు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement