పురుగులు మందు తాగిన ప్రియుడు, ప్రియురాలు
ఆస్పత్రిలో ప్రియుడు మృతి
చికిత్స పొందుతున్న ప్రియురాలు
గజపతినగరం : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పింది. ఇందులో ప్రియుడు ప్రాణం కొల్పోగా... ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శీర పైడిరాజు(31)కు కొత్తవలస మండలానికి చెందిన బొబ్బిలి ఆదిలక్ష్మితో మూడేళ్ల కిందట వివాహమైంది.
వీరి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహిత సబుకు రామలక్ష్మితో పైడిరాజుకు ఎనిమిది నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పైడిరాజు పురిటిపెంట సమీపంలో ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పురిటిపెంట రైల్వే గేటు వద్ద వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగాని ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పురుగుల మందు సేవించి అక్కడి పడిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ విజయనగరం మహారాజ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పైడిరాజు శనివారం మృతి చెందినట్టు తెలిపారు. రామలక్ష్మి వైద్య సేవలు పొందుతున్నట్టు చెప్పారు. మృతుడి తండ్రి శీర అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment