సాక్షి, గుంటూరు : వ్యాపారంలో ఒడిదొడుకులు అతన్ని మార్చేశాయి. నష్టం నుంచి బయటపడాలనే ఆరాటం దుర్భుద్ధిని తట్టిలేపింది. బ్యాంకుల రుణం ఎగ్గొట్టాలని పథకం వేశాడు. తన నష్టాన్ని పూడ్చుకొనే క్రమంలో ఇతరుల కష్టాన్ని బూడిదపాలు చేశాడు. చివరికి కటకటాలపాలై ఊచలు లెక్కిస్తున్నాడు.
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలెనికి చెందిన జగన్నాథం వ్యాపారి. రైతుల నుంచి పంట కొనుగోలు చేసి.. ధర పలికినప్పుడు పెద్దపెద్ద వ్యాపారస్తులకు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో గతేడాది కూడా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేశాడు. కాని సరైన ధర లేకపోవడంతో సరుకంతటిని బొప్పూడి కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచాడు. సరుకును చూపి బ్యాంకుల నుంచి ఏడు కోట్లు రుణం తీసుకున్నాడు. కాని గడువు పూర్తైనా అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్ అధికారులు కొంత సరుకు వేలం వేశారు.
కాలిపోయిన కోల్డ్ స్టోరేజ్ (ఇన్‌సెట్‌లో) పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి జగన్నాథం
మిగతా అప్పు తీర్చాలని, లేదంటే.. మళ్లీ వేలం వేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో దిక్కుతోచని జగన్నాధం కోల్డ్ స్టోరేజికు నిప్పు పెట్టే పథకం వేశాడు. గత నెల 14న అర్థరాత్రి కిరాయిగూండాలతో కలిసి కోల్డ్ స్టోరేజికి నిప్పుపెట్టాడు. జగన్నాధం స్వార్థపు ఆలోచన రైతుల కష్టాన్ని బూడిదపాలు చేసింది. 7 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి 20 కోట్ల సరుకుకు నిప్పుపెట్టాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రైతులకు న్యాయం చేయడానికి జగన్నాధం ఆస్తిని విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకోసం లీగల్‌గా అన్ని చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒకరి నష్టం.. మరొకరికి భారంగా మారి 20 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. వ్యాపారంలో నష్టం వస్తే దాన్ని సరైన మార్గంలో అధిగమించే మార్గం వెతకాలి కానీ.. అడ్డదారుల్లోకి వెళ్తే జీవితమే నష్టపోతుందని జగన్నాధం కథ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment