కాలి బూడిదైన రైతుల ఆశలు | Farmers Worried About Cold Storage Fire Accident Case | Sakshi
Sakshi News home page

కాలి బూడిదైన రైతుల ఆశలు

Published Mon, Sep 17 2018 12:36 PM | Last Updated on Mon, Sep 17 2018 12:36 PM

Farmers Worried About Cold Storage Fire Accident Case - Sakshi

2014 అక్టోబర్‌ 15న దగ్ధమైన పల్నాడు కోల్డ్‌ స్టోరేజ్‌(ఫైల్‌)

రెంటచింతల: పల్నాడు కోల్డ్‌ స్టోరేజ్‌ దగ్ధమైన ఘటనలో నష్టపోయిన 293మంది రైతులకు నేటికీ చిల్లిగవ్వ కూడా నష్టపరిహారం అందలేదు. సంవత్సరాలు గడుస్తున్నా కోల్డ్‌స్టోరేజ్‌ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. నిన్నా మొన్నటి వరకు బీమా కంపెనీ చెల్లిస్తుండంటూ నమ్మిస్తూ వచ్చింది. రైతులు కూడా ఎంతో ఆశతో ఎదురుచూశారు. అయితే, తీసుకున్న రుణాలకు నగదు చెల్లంచాలంటూ ఆంధ్రాబ్యాంక్‌ నోటీసులు పంపండంతో వారికి దిక్కుతోచడం లేదు. మనోవేదనకు గురవుతున్నారు. న్యాయం చేయాలంటూ జిల్లా గ్రీవెన్స్‌ సెల్‌లో అనేకమార్లు అర్జీలిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాంక్‌లో బంగారం పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఖరీఫ్‌లో సాగుకోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు చేస్తున్నారు.

నోటీసులపై బ్యాంక్‌ మేనేజర్‌తో చర్చలు
ఇటీవల పలువురు రైతులు జెడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డితో కలసి బ్యాంక్‌ మేనేజర్‌ చిలక శ్రీనివాసరావుతో నోటీసుల విషయమై చర్చించారు. తమకు 293 మంది రైతులు వడ్డీతో కలుపుకుని రూ.11.71 కోట్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. 2016 మేలో ఒక కంపెనీ, జూన్‌ నెలలో మరో కంపెనీ నష్టపరిహారం చెల్లించేందుకు తిరస్కరించాయని, రైతులు రుణాలను కట్టాల్సిందేనని మేనేజర్‌ తెలిపారు.

మాయమాటలు చెప్పిన కోల్ట్‌ స్టోరేజ్‌ యాజమాన్యం
అగ్ని ప్రమాదంలో 70వేల టిక్కీల మిర్చి, 4వేల టిక్కీల పసుపు, 300 బస్తాల శెనగలు కాలిపోయినట్లు అప్పట్లో కోల్డ్‌స్టోరేజ్‌ యాజమాన్యం ప్రకటించింది. ఆస్తులు అమ్మి అయినాసరే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని నమ్మబలికింది. ఐదేళ్లు గడుస్తున్నా రైతులకు ఒరిగిందేమీలేదు. సుమారు 25శాతం మంది రైతులు పైసా కూడా బ్యాంక్, కోల్డ్‌స్టోరేజ్‌ వద్ద రుణం తీసుకోలేదని తెలుస్తోంది. గత నెల 29న కొందరు రైతులు న్యాయం చేయకపోతే తమకు మరణమే శరణ్యమని పురుగు మం దు డబ్బా తీసుకుని బ్యాక్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 1985 యాక్ట్‌ ప్రకారం కోల్డ్‌ స్టోరేజ్‌కు సమీపంలో ఫైర్‌ నిబంధనల ప్రకారం లక్ష లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ ట్యాంక్, సేఫ్టీ సిలెండర్ల స్పింకర్లు లేనికారణంగానే ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు.

ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు
ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని లక్షలు పెట్టుబడి పెట్టి పండించి కోల్డ్‌స్టోరేజ్‌లో 130 క్వింటాళ్ల మిర్చిని దాచుకున్నా. ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు. బీమా వస్తుందని నమ్మబలికిన కోల్డ్‌స్టోరేజ్‌ యాజమాన్యం మొహంకూడా చూపించడం లేదు. బ్యాంక్‌ వారు అప్పు చెల్లించాలని నోటీసులు పంపిస్తున్నారు. బ్యాంక్‌ కొత్తగా రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
– మోరం జయరాజారెడ్డి, కౌలురైతు, రెంటచింతల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement