కోల్డ్ స్టోరేజిలో అగ్నిప్రమాదం
కోల్డ్ స్టోరేజిలో అగ్నిప్రమాదం
Published Mon, Oct 24 2016 8:28 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
- 8 వేల క్వింటాళ్ల మిర్చి దగ్ధం
- నష్టం అంచనా రూ.10 కోట్లు
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా లాల్‌పురం పంచాయతీ పరిధిలోని లక్ష్మీలావణ్య కోల్డ్ స్టోరేజిలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏ-బ్లాక్లో అగ్నిప్రమాదం సంభవించిదని, దాదాపు 8వేల క్వింటాళ్ల మిర్చి కాలిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టం రూ.10 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. తెల్లవారు జామున ఉదయం 5 గంటలకు మిర్చి శాంపిల్స్ తీసేందుకు వెళ్లిన కూలీలు కోల్డ్ స్టోరేజీలో మంటలను గమనించి ఫైర్ అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఫైర్ అధికారులు బి-బ్లాక్ గోడలను జేసీబీతో పడగొట్టి ఏ-బ్లాక్లోని మిర్చిని బయటకు తీసుకొచ్చారు.
కోల్డ్ స్టోరేజిలో రైతులు, వ్యాపారులకు సంబంధించిన సరుకు ఉన్నట్లు తెలిసింది. ఈ కోల్డ్ స్టోరేజ్ ప్రమాణాలు సరిగా పాటించకపోవడమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే, మార్కెటింగ్ ఏడీ వరలక్ష్మి, మిర్చి యార్డు సెక్రటరీ దివాకర్, గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు పరిశీలించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తొమ్మిది ఫైర్ ఇంజన్‌లను వినియోగించామని జిల్లా ఫైర్ అధికారి జిలాని తెలిపారు. కోల్డ్ స్టోరేజిలో మిర్చితోపాటు, కొద్దిమేర శనగలు, జొన్నలు కూడా ఉన్నట్లు సమాచారం.
Advertisement