వివరాలు వెల్లడిస్తున్న రూరల్ ఎస్పీవెంకటప్పల నాయుడు, వెనుక ముసుగులో నిందితులు
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలోని బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో జరిగిన అగ్నిప్రమాదం మిస్టరీని పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ వెంకటప్పలనాయుడు సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం కుందూరువారిపాలెం గ్రామానికి చెందిన కె.జగన్నాథం సమీప గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి నిల్వ ఉంచి ధర పెరిగిన తర్వాత విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో 2014లో కొనుగోలు చేసిన సరుకును బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ చేశాడు. అనంతరం దాన్ని హామీగా పెట్టి నరసరావుపేట, గుంటూరులోని బ్యాంకుల్లో రూ.7.30 కోట్ల రుణంగా తీసుకున్నాడు. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఇటీవల నరసరావుపేటకు చెందిన బ్యాంకర్లు కొంత స్టాకును వేలం కూడా వేశారు. ఈ నేపథ్యంలో నష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలని అగ్నిప్రమాద కుట్ర పన్నాడు.
పథకం వేసిందిలా...
తన సమస్యను అనంతపురం జిల్లాకు చెందిన స్నేహితుడు కాకర్ల రామచంద్ర నాయుడుకు వివరించి సలహా కోరాడు. కోల్ట్ స్టోరేజీని తగలబెట్టడమే మార్గమని సలహా ఇవ్వడమే కాకుండా ఆ పని తానే చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే జిల్లా పెద్దపప్పూరుకు చెందిన కొదమల వేణుగోపాల్, మల్లెల రాము, రవ్వగుండ్ల నారాయణ స్వామి, కొదమల లక్ష్మిమూర్తితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరికి జగన్నాథం రూ.5 లక్షలు ఇచ్చారు. పథకం ప్రకారం వారు గత నెల 15వ తేదీ తెల్లవారుజామున కోల్డ్ స్టోరేజీ వాచ్‌మన్‌ను గదిలో బంధించి బి–బ్లాక్‌కి పెట్రోలు పోసి నిప్పంటించారు. తిరిగి కారులో అనంతపురం వెళుతున్న క్రమంలో పెద్దపప్పూరు వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అదే సమయంలో కారులో కాలిన గాయాలతో ఉన్న నారాయణస్వామిని ఎస్‌ఐ అనుమానంతో ప్రశించగా అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి వెళ్లిపోయారు. కోల్ట్ స్టోరేజీ దగ్ధం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏ బ్లాకు ఉన్న సుమారు రూ.9 కోట్ల విలువైన స్టాకును అక్కడ నుంచి తరలించారు. బీ–బ్లాకులోని రూ.20 కోట్ల విలువైన సరుకు అగ్నికి ఆహుతయింది. కోల్ట్‌స్టోరేజీ యజమాని రామినేని వెంకట సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేసును ఛేదించిందిలా...
కోల్డ్ స్టోరేజీ దగ్ధం విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పెద్దపప్పూరు ఎస్‌ఐకు తన తనఖీల్లో పట్టుపడిన కారులోని నిందితులపై అనుమానం వచ్చింది. వెంటనే చిలకలూరిపేట రూరల్ సీఐ యు.శోభన్‌బాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. విషయం తెలుసుకున్న నిందితులు ఈ నెల ఒకటో తేదీన చిలకలూరిపేటలోని న్యాయవాదిని కలిసేందుకు రాగా జగన్నాథంతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కొదమల కృష్ణమూర్తి పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు జగన్నాథం ఆస్తులను ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. సుమారు 500 మంది రైతులకు న్యాయం జరిగే వరకు ఆస్తులు ఫ్రీజ్‌లోనే కొనసాగుతాయన్నారు. సమావేశంలో డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐ యు.శోభన్‌బాబు, ఎస్‌ఐ ఉదయ్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment