కోల్డ్ స్టోరేజ్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
చిలకలూరిపేట రూరల్: కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులు రోడ్డెక్కారు. మండలంలోని బొప్పూడి గ్రామ శివారు, జాతీయ రహదారి సమీపంలో గత నెల 15న బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో ఒక వ్యక్తి స్వార్థం కోసం వందలాది మంది రైతులు నిల్వ చేసుకున్న పంటకు నిప్పు అంటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన వ్యక్తుల్ని ఇటీవల రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. స్టోరేజ్‌లో పంటను నిల్వ చేసుకుని వాటిపై బ్యాంక్ రుణం పొందని రైతులకు యాజమాన్యం న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. నేటికీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో బుధవారం స్టోరేజ్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించటంతో రెండు గంటల పాటు వాహనాలు నిలచిపోయాయి.
ఆందోళన నేపథ్యం ఇది...
కోల్డ్ స్టోరేజ్‌లో కర్షకులు వివిధ పంటలను గిట్టుబాటు ధరల కోసం నిల్వ చేసుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో కొందరు నిప్పుపెట్టడంతో 1.10 లక్షల టిక్కీలలో 60వేల టిక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంతో రూ. 30 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. నష్టపోయిన రైతులలో అధికశాతం మంది పలు జాతీయ బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందారు. సంబంధిత బ్యాంక్‌లు బీమా సౌకర్యాలను కల్పించడంతో ధీమా వెసులుబాటు ఉంది. వీరిలో 120 మంది రైతులు రూ. 4.60 కోట్ల పంటను నిల్వ చేసి ఎటువంటి బ్యాంక్‌ల నుంచి రుణాన్ని తీసుకోలేదు. ప్రమాదం సంభవించిన సమయంలోనూ వీరికి యాజమాన్యం బాండ్‌లు పంపిణీ చేయలేదు. అదే సమయంలో ఆందోళన చేశారు. యాజమాన్యం దిగివచ్చి పోలీసుల సమక్షంలో బాండ్‌లను పంపిణీ చేసింది.
మంత్రి మధ్యవర్తిత్వం
ప్రమాదం సంభవించిన వారం రోజుల అనంతరం బ్యాంక్‌ల ద్వారా రుణాలు పొందని వందలాది మంది రైతులు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో చర్చలు జరిపారు. అందరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో రైతులు మిన్నకుండిపోయారు. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇటీవల నిందితులను జిల్లా ఎస్పీకార్యాలయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటని మరో విడత స్టోరేజ్ యాజమాన్యాన్ని రైతులు ప్రశ్నించారు. తమ పరిధిలో ఏమీ లేదని పేర్కొనడంతో స్టోరేజ్ ఆవరణలో ఆందోళన చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించటంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ త్వరలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆందోళన నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment