కాలిపోయిన కోల్డ్ స్టోరేజ్ (ఇన్‌సెట్‌లో) పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి జగన్నాథం
చిలకలూరిపేటరూరల్: కోల్డ్ స్టోరేజ్ దగ్ధం కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చూపేందుకు రంగం సిద్ధమైంది. మండలంలోని బొప్పూడి గ్రామ శివారు, జాతీయ రహదారి సమీపంలో ఉన్న బొప్పూడి కోల్డ్ స్టోరేజ్‌లో ఈనెల 15వ తేదీన గుర్తు తెలియని దుండగులు బీ చాంబర్‌కు నిప్పుపెట్టారు. మంటలకు స్టోరేజ్‌లో రైతులు నిల్వ ఉంచుకున్న 60వేల వివిధ పంటలకు చెందిన టిక్కీలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 30 కోట్ల నష్టం సంభవించింది. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం కందూరివారిపాలెం గ్రామానికి చెందిన జగన్నాథాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి తరహాలో విచారించినట్లు తెలిసింది.
ఇందులో అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి ఒక ముఠా నాయకుడు, మరో నలుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేసినట్లు సమాచారం. అనంతరం పురం జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు క్రియాశీలకంగా వ్యహరించి పాత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాలోని సంచలనం కలిగించిన కేసుపై రూరల్ సర్కిల్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ ఫుటేజి సహాయంతో సంబంధిత కారు నంబర్, అనుమానితుడైన జగన్నాథాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా అధికారుల సమక్షంలో నిందితుల్ని అరెస్ట్ చూపించే పనిలో రూరల్ పోలీసులు నిమగ్నమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment