ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది..
48 ఏళ్ల క్రితం..
పిక్నిక్‌కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్‌లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్‌గ్రౌండ్‌కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్‌గ్రౌండ్‌కి నడిచేసింది.
అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లి, తనవాళ్ల టెంట్‌ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది.
పైగా ఆ టెంట్‌లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్‌లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్‌పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది.
పాలడబ్బా సాక్ష్యం
సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్‌లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్‌లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం.
చరిత్రలోనే..
కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది.
హైకర్స్ వల్ల..
స్థానిక వాలంటీర్లు, ఎక్స్‌ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది.
రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్‌సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్‌లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు.
అతనే..
సెప్టెంబర్ 1న క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్‌లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్‌కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్‌లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్‌లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్‌కి 3 జీవిత ఖైదులను విధించింది.
అంగీకరించలేదు
విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్‌లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్‌లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు.
మరోవైపు లిటిల్‌తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment