కొందరు మోసగాళ్లకి నమ్మకమే పెట్టబడి. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. కనీసం మోసపోయామనే విషయం కూడా తెలియకుండానే జీవితం ముగిసిపోతుందనడానికి ఈ కథ ఓ ఉదాహరణ.
అది 1893 డిసెంబర్ 3.. మినీయపోలిస్ (మిన్నెసొటా, అమెరికా).. కనిచీకటి పడుతున్న వేళ.. 29 ఏళ్ల క్యాథరిన్ జింగ్.. గూస్మాన్ లివెరీ స్టేబుల్‌కి వెళ్లి క్లాస్ బ్లిక్ట్స్ అనే పేరు మీద ఓ గుర్రం, ఓ బగ్గీ (గుర్రబ్బండి)ని అద్దెకు తీసుకుంది. సరిగ్గా రాత్రి ఏడున్నర అయ్యేసరికి ఆ బగ్గీపై వెస్ట్ హోటల్ వైపు వెళ్లి.. అక్కడ క్లాస్ బ్లిక్ట్స్ అనే వ్యక్తిని కలిసింది. తన దగ్గరున్న నకిలీ నోట్లు అతడికి ఇచ్చి.. అతడి దగ్గరున్న ఒరిజినల్ కరెన్సీని తను తీసుకోవాలి. కానీ అలా జరగలేదు.
ఆమె రాకకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న బ్లిక్ట్స్.. ఆమె రాగానే తుపాకీతో కాల్చాడు. క్షణాల్లో నేలకొరిగిన క్యాథరిన్ తలపై పెద్ద రాయితో కొట్టి, ఆమె దగ్గరున్న అన్నింటినీ లాక్కుని ఉడాయించాడు. గుర్రాన్ని, గుర్రబ్బండినీ గూస్మాన్ లివెరీ స్టేబుల్‌కి అప్పగించేశాడు. ఎలాగో బ్లిక్ట్స్ పేరుమీదే వాటిని క్యాథరిన్ అద్దెకు తీసుకుంది కాబట్టి వాటిని తిరిగి ఇవ్వడానికి అతడు పెద్దగా కష్టపడలేదు.
ఎనిమిదిన్నర.. తొమ్మిది మధ్యలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విలియం ఎర్హార్డ్ అనే వ్యక్తి రోడ్డు మీద జింగ్ మృతదేహాన్ని గుర్తించాడు. కాసేపటికే అజ్ఞాత యువతి యాక్సిడెంట్ అని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత అది హత్య అని ఆమె తలలోని బుల్లెట్ తేల్చింది. ఆ తర్వాత.. ఆమె ఎవరో కాదు క్యాథరిన్ జింగ్ అనే డ్రెస్ మేకర్ అనీ తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
క్యాథరిన్ జింగ్... చాలా అందగత్తె. ఆమె సన్నిహితులంతా ఆమెని కిట్టీ అని ముద్దుగా పిలుచుకునేవారు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ నుంచి మిన్నెసొటాకి వచ్చి, బట్టలు తయారుచేసే సంస్థలో డ్రెస్ మేకర్‌గా చేరింది. మరో డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో క్లర్కుగా పనిచేస్తున్న ఫ్రెడెరిక్‌తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఏవో కొన్ని గొడవలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
అయితే ఫ్రెడెరిక్ తొడిగిన నిశ్చితార్థపు ఉంగారాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ తన మెడలో వేసుకుని తిరిగేది. ఏళ్లు గడిచే కొలదీ ఆమె జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులతో పాటు డబ్బూ జమకూడింది. అయితే జింగ్ మరణం తర్వాత మరింత లోతుగా ఆరాలు తీసిన పోలీసులు.. హత్య జరిగిన మూడురోజుల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు.
వారిలో క్యాథరిన్ మాజీ ప్రేమికుడు ఫ్రెడెరిక్‌తో పాటు ధనిక కుటుంబానికి చెందిన హ్యారీ హేవార్డ్, హ్యారీ సోదరుడు ఆండ్రీ, సెక్యూరిటీ గార్డ్ బ్లిక్ట్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఫ్రెడెరిక్ అమాయకుడని నిర్ధారించి విడిచిపెట్టేశారు.
‘క్యాథరిన్ నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు కోసమే ఆమెని చంపి, డబ్బు ఎత్తుకెళ్లి ఉంటారు’ చెప్పాడు హ్యారీ. తను క్యాథరిన్‌కు డబ్బు ఇచ్చేప్పుడు సాక్షిగా ఉన్న పనిమనిషినీ స్టేషన్‌కు పిలిపించాడు. దాంతో పోలీసులు హ్యారీది కూడా తప్పు లేదని నమ్మారు. ఆండ్రీ, బ్లిక్ట్స్ కూడా తమకు ఈ కేసుతో ఏ సంబంధం లేదనడంతో పోలీసుల దృష్టి హ్యారీ గర్ల్‌ఫ్రెండ్ లిలియన్ అలెన్ మీద పడింది.
గతంలో హ్యారీతో క్యాథరిన్ క్లోజ్‌గా ఉండటం తట్టుకోలేకపోయిన అలెన్ .. రెండుమూడు సార్లు క్యాథరిన్‌తో గొడవపడిందట. కానీ విచారణలో ఆమె కూడా నిర్దోషిగానే తేలింది. అయితే పోలీసుల దెబ్బలు రుచి చూసిన ఆండ్రీ నోరు విప్పాడు. ‘హ్యారీ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి.. క్యాథరిన్‌ను చంపేందుకు సాయం చేయాలని కోరాడు. కానీ నేను భయపడి నో చెప్పాను. మా ఫ్యామిలీ లాయర్ లెవీ స్టూవర్ట్‌కి అప్పుడే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. కావాలంటే స్టూవర్ట్‌ని ప్రశ్నించండి’ అంటూ కేసుని హ్యారీ వైపు తిప్పాడు ఆండ్రీ.
స్టూవర్ట్.. ఆండ్రీకి అనుకూలంగా నిలబడటంతో హ్యారీ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఒజార్క్ ఫ్లాట్స్‌లోని క్యాథరిన్ అద్దెకుండే అపార్ట్‌మెంట్ ఓనర్ హ్యారీ తండ్రిదని.. హ్యారీకి, క్యాథరిన్‌కి చాలా సన్నిహిత సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో బయటపడింది.
హ్యారీ మంచి జూదగాడు. ఇన్సూరెన్స్ మోసాలు, డబ్బు కోసం భారీ చోరీలు, నకిలీ కరెన్సీ తయారీ వంటి పనుల్లో ఆరితేరిన మనిషి. చాలా అపరిష్కృత హత్య కేసుల్లో అతడి పేరుంది. అతడి గురించి తెలిసినవాళ్లంతా అతన్ని శాపనార్థాలు పెట్టేవారు.
ఫ్రెడెరిక్‌తో విడిపోయిన బాధలో ఉన్న క్యాథరిన్‌కి.. హ్యారీ స్నేహం ఊరటనిచ్చింది. క్యాథరిన్‌కు డబ్బు ఆశ చూపిస్తూ తను చేసే ప్రతి దుశ్చర్యలో ఆమెను భాగంచేసేవాడు.. కొంత సొమ్ము ముట్టజెప్పేవాడు. ఆ క్రమంలోనే వారి మధ్య బంధం బలపడింది. హ్యారీ ప్రోత్సాహంతో క్యాథరిన్.. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంది. దానికి నామినీగా అతడి పేరు రాయించుకున్నాడు. క్యాథరిన్ చనిపోతే ఆ పాలసీ డబ్బులు తనకే వస్తాయని ఇదంతా చేశాడు హ్యారీ.
మొత్తం కథలో బ్లిక్ట్స్ ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. క్యాథరిన్ నన్ను కలవడానికి ప్లాన్ చేసిందే హ్యారీ. నకలీ డబ్బుల మార్పిడి కోసం క్యాథరిన్ నా దగ్గరకు వచ్చిందని చెప్పాడు. అంతే కాదు హ్యారీ ఈ హత్య ప్లాన్ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, అతడు నా కళ్లలోకి కళ్లు పెట్టి తదేకంగా చూశాడు. ఆ తర్వాత అతడు ఏం చెప్పినా నేను నో అనలేకపోయాను. ఆ చూపులో ఏదో మాయ ఉంది. అందుకే క్యాథరిన్‌ని హత్య చేశాను’ అంటూ హ్యారీ తనపై హిప్నాటిజం చేశాడని చెప్పుకొచ్చాడు బ్లిక్ట్స్.
అయితే అప్పటికే స్థానికులు హ్యారీ హిప్నాటిజం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అతడికి ఏదో శక్తి ఉందని, అతడి కళ్లల్లో ఏదో మాయ ఉందని.. వశీకరణ చేసి చాలా మందిని మట్టుబెట్టాడని ఇలా హ్యారీపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
బ్లిక్ట్స్ ప్రత్యక్షసాక్షి కావడంతో వశీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి.. న్యాయపరంగానే విచారణ సాగించారు. కొన్ని వాయిదాల తర్వాత హ్యారీకి ఉరిశిక్ష, బ్లిక్ట్స్‌కి జీవితఖైదు పడింది. ఆండ్రీ నిర్దోషిగా బటయపడ్డాడు. 1895 డిసెంబర్ 11న తెల్లవారు జామున 2.12కి హ్యారీని ఉరి తీశారు. అయితే హ్యారీ 2.25 ని.ల వరకూ బతికేవున్నాడనీ రికార్డుల్లో నామోదు చేసుకున్నారు అధికారులు. దాంతో నిజంగానే హ్యారీ చాలా శక్తిమంతుడని.. అతడికి క్షుద్రపూజలు కూడా తెలుసని.. చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. అతడు తిరిగి లేచి, బతికొస్తాడనీ కొందరు భావించేవారు.
హ్యారీకి ఉరి తీసే కొన్ని రోజుల ముందు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తను చేసిన కొన్ని హత్యల గురించి నోరు విప్పాడు హ్యారీ. అప్పుడు కూడా వశీకరణ గురించి చెప్పలేదు. దాంతో బ్లిక్ట్స్‌ని నిజంగానే వశీకరణ చేసి క్యాథరిన్‌ని చంపించాడా? లేక బ్లిక్ట్స్ కావాలనే అబద్ధం చెప్పాడా? అనేది తేలలేదు. కేసు ముగిసినా నేరస్తుడికి శిక్షపడినా.. ఈ కథలోని వశీకరణ కోణం నేటికీ మిస్టరీనే.
-సంహిత నిమ్మన
చదవండి: Mystery Room No 1046 Story: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్!
Comments
Please login to add a commentAdd a comment