నిజాలను అబద్ధాలుగా.. అబద్ధాలను నిజాలుగా మార్చేయడం నేరగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటివాళ్ల గారడీలో చిక్కిన అమాయకుల కథ ప్రపంచానికి తెలియకుండానే ముగిసిపోతుంది. చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతుంది. కాథీ ఫోర్డ్ వ్యథ అలాంటిదే.
వెస్ట్ వర్జీనియాలోని గోర్మానియా, మేరీల్యాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్‌మిల్ రెస్టారెంట్ అది. 1988 ఫిబ్రవరి 17 మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ ఫోన్ మోగింది. అందులో వెయిట్రెస్‌గా పని చేస్తున్న కాథీ ఫోర్డ్ అనే 19 ఏళ్ల అమ్మాయి ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆ రెస్టారెంట్ ఆమె తల్లిదండ్రులదే. అందులో తను పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ ఉండేది. ఫోన్ పెట్టెయ్యగానే ఆమె చాలా కంగారుగా, అందులో పనిచేసే మరో ఉద్యోగినితో ‘కాల్ చేసింది ఓ మేజిస్ట్రేట్ అట, మైనర్‌లకు మద్యం అమ్ముతున్న బార్‌లు, రెస్టారెంట్లపై పోలీస్ విభాగం కఠినంగా వ్యవహరిస్తోందని అతడు హెచ్చరించాడు’ అని ఇతర వివరాలేమీ చెప్పకుండా అక్కడి నుంచి పరుగుతీసింది.
ఆమె అదే కంగారుతో ఇంటికి వెళ్లి స్నానం చేసి, డ్రెస్ మార్చుకుని.. సరిగ్గా గంటకి రెస్టారెంట్‌కి తిరిగి వచ్చింది. అంతే వేగంగా తన పర్స్ అందుకుని, తన తండ్రి కారులో బయలుదేరింది. అదే ఆమె కనిపించిన ఆఖరి దృశ్యం. సాయంత్రం దాకా ఆమె కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులు.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. మరునాడు కాథీ బాయ్‌ఫ్రెండ్ డార్విన్ పోలీసుల్ని కలసి.. గోర్మానియాకు చెందిన డిప్యూటీ షెరీఫ్ పాల్ ఫెర్రెల్‌పై తనకు అనుమానం ఉందని, కాథీకి అతడితో పరిచయం ఉందని చెప్పాడు. పైగా గతరాత్రి కాథీని ఫెర్రెల్ నివాస గృహానికి సమీపంలో చూశానని సాక్ష్యమిచ్చాడు. దాంతో అదేరోజు ఫెర్రెల్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు.
‘కాథీ నాకు ప్రియురాలి కంటే ముందు గొప్ప స్నేహితురాలు.. గత రాత్రి ఎనిమిదిన్నర సమయంలో స్థానిక క్లబ్‌హౌస్‌కి నా కోసం కాథీ కాల్ చేసి, కలుద్దాం అంటూ ఏడ్చింది. హైస్కూల్ పార్కింగ్ స్థలంలో ఎదురుచూస్తా త్వరగా రా అన్నాను. సుమారు 20 నిమిషాలు ఎదురు చూసినా తను రాలేదు’ అంటూ ఫెర్రెల్ బదులిచ్చాడు. ఫెర్రెల్ అప్పటికే బెర్నార్డ్ అనే మహిళతో రిలేషన్‌లో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 1988 జనవరిలోనే ఫెర్రెల్ వెస్ట్ వర్జీనియాలోని గ్రాంట్ కౌంటీలో డిప్యూటీ షెరీఫ్‌గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా నెలకు కాథీ మిస్ అయ్యింది. ‘1987 నుంచే మా మధ్య పరిచయం ఉంది.
మా కలయిక చాలా రహస్యంగా నడిచేది. ఇటు బెర్నార్డ్‌కి కానీ, అటు కాథీ బాయ్ ఫ్రెండ్‌కి కానీ తెలియకుండా జాగ్రత్తపడేవాళ్లం. జాబ్ వచ్చిన తర్వాత కాథీకి సమీపంలో బిస్మార్క్ రోడ్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉండేవాడ్ని. అప్పుడప్పుడు కాథీ నా దగ్గరకు వచ్చేది’ అని ఫెర్రెల్ చెప్పాడు. ఆధారాలు లేక అతడ్ని వదిలిపెట్టేశారు. సరిగ్గా వారానికి ఓల్డ్‌మిల్ రెస్టారెంట్‌కి ఓ లేఖ వచ్చింది. అందులో ‘నేను క్షేమంగానే ఉన్నాను.. నా కోసం వెతకొద్దు’ అని కాథీ రాసినట్లుంది. అయినా డార్విన్.. కాథీ కోసం వెతకడం ఆపలేదు. మరో రెండు వారాలకు ఫెర్రెల్ నివాసం ఉండే ఇంటికి కిలోమీటర్‌లోపే, అడవిలో కాథీ తీసుకెళ్లిన కారు కాలి బూడిదై కనిపించింది.
ఎక్కడా కాథీ ఆనవాళ్లు కానీ, మృతదేహం కానీ కనిపించలేదు. వెంటనే.. రెస్టారెంట్‌కి వచ్చిన లేఖలోని చేతిరాతపై నిఘా పెట్టారు అధికారులు. అది ఫెర్రెల్ చేతిరాతేనని తేలడంతో కేసు బిగుసుకుంది. అయితే ఫెర్రెల్ ఇంకో షాకిచ్చాడు.. ‘ఆ కారు అక్కడున్న విషయం నాకు ముందే తెలుసు. కాథీ కేసు విషయంలో నన్ను విచారించి, వదిలిపెట్టిన మరునాడే కాథీ కోసం వెతుకుతుంటే.. ఆ కారు అక్కడ కనిపించింది. కాథీ శవం కారులో ఉందేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. ఎవరో నన్ను ఇరికిస్తున్నారని అర్థమై ఆ లేఖ రాసి తప్పించుకోవాలని అనుకున్నా’ అన్నాడు. మరోవైపు ఫెర్రెల్ బెడ్‌రూమ్‌లో గోడ మీద రక్తం మరకలు ఉండటంతో ఆ శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించారు పోలీసులు.
అది ఓ మహిళ రక్తమని తేలింది కానీ కాథీదో కాదో తేల్చలేకపోయారు. దాని గురించి ఫెర్రెల్‌ని అడిగితే.. ఆ మరకలు తాను అద్దెకు రాకముందు నుంచే ఆ గోడ మీద ఉన్నాయని చెప్పాడు. ఇక ఫెర్రెల్ నివాసానికి పొరుగున ఉండే కిమ్ నెల్సన్ అనే మహిళ.. ఫిబ్రవరి 17 రాత్రి తనకు సమీపంలో ఓ అమ్మాయి అరుపులు, తుపాకీ శబ్దాలు వినిపించాయని సాక్ష్యమిచ్చింది. దాంతో కాథీని చంపి మృతదేహాన్ని ఫెర్రెల్ ఎక్కడో దాచేశాడని నమ్మేవాళ్లు పెరిగిపోయారు. అలా సుమారు పదిహేనేళ్లు జైల్లోనే ఉండిపోయాడు ఫెర్రెల్. మరోవైపు అతడు.. పరిచయస్తులైన ఆడవారికి అజ్ఞాత ఫోన్ కాల్స్ చేసి.. అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాడని తేలింది. తను చెప్పిన చోటుకు రావాలని బెదిరించేవాడని కొందరు మహిళలు సాక్ష్యమిచ్చారు.
ఆ ఆరోపణలను ఫెర్రెల్ అంగీకరించినప్పటికీ.. ఈ ఫోన్ కాల్స్‌కి, కాథీ మిస్సింగ్‌కి సంబంధం లేదని వాదించాడు. అయితే కాథీకి ఆ రోజు కాల్ చేసింది ఫెర్రెలే అయ్యుంటాడని, ఏదో చెప్పి బెదిరించడంతోనే ఆమె వెళ్లి ఉంటుందని.. గతంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన సంబంధాన్ని అతడు కావాలనే తప్పుగా క్రియేట్ చేసి చెబుతున్నాడని కొందరు అధికారులు భావించారు. అయితే అతడు నిర్దోషి అనేందుకు మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఓ జంటను సాక్ష్యంగా తీసుకొచ్చాడు. కాథీ కనిపించకుండా పోయిన ఏడాదికి.. టెన్నెసీ గుండా వెళుతుంటే మార్గంమధ్యలో ఓ రెస్టారెంట్‌లో కాథీ.. వెయిట్రెస్‌గా పనిచేయడం చూశామని ఆ జంట చెప్పుకొచ్చింది.
‘మీరు కాథీనే కదా?’ అని అడ గటానికి ప్రయత్నించినప్పుడు ఆమె కిచెన్‌లోకి పారిపోయిందని వాళ్లు చెప్పారు. మరోవైపు తనతో ఆ రోజు పోలీసులు బలవంతపు సాక్ష్యం చెప్పించారని కిమ్ వెల్లడించింది. దాంతో ఫెర్రెల్ పట్ల సానుభూతిపరులు పెరిగారు. 2002లో అతడికి పెరోల్ లభించింది. అయితే కాథీ తమని వదిలి ఉండాలనుకునే మనిషి కాదని.. తనను ఎవరో చంపేసి ఉంటారని ఆమె కుటుంబం నమ్మింది. ఈ కేసులో కాథీ స్నేహితులు కొందరు అసలు నేరస్థుడు డార్విన్ కావచ్చన్నారు. ఎందుకంటే కాథీ నిత్యం డార్విన్‌కే భయపడుతూ బతికేదని వాళ్లు గుర్తుచేసుకున్నారు. ఈ ఉదంతంలో కాథీ చనిపోయిందా? లేక పారిపోయిందా? డార్విన్ చంపేసి.. కేసు ఫెర్రెల్‌ని చుట్టుకునేలా ప్లాన్ చేశాడా? లేక ఫెర్రెలే చంపేసి.. అమాయకంగా నాటకం ఆడాడా? కాథీకి ఆ రోజు మధ్యాహ్నాం కాల్ చేసింది ఎవరు? ఇలా అన్నీ మిస్టరీగానే మిగిలాయి.
--సంహిత నిమ్మన
(చదవండి: కూతుర్నే పెళ్లాడిన ఓ నీచపు తండ్రి కథ..ఆఖరికి ఆమె కొడుకుని సైతం..)
Comments
Please login to add a commentAdd a comment