భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్‌.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్‌ | 10000 Dollars Reward For Info On Missing Indian On FBI Worst Kidnappings List | Sakshi
Sakshi News home page

భారతీయ విద్యార్థి నాలుగేళ్లుగా మిస్సింగ్‌.. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డ్‌

Published Fri, Dec 22 2023 2:16 PM | Last Updated on Fri, Dec 22 2023 3:07 PM

10000 Dollars Reward For Info On Missing Indian On FBI Worst Kidnappings List - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూజెర్సీలో భార‌తీయ విద్యార్థి నాలుగేళ్ల క్రితం అదృశ్య‌మైంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు. అయితే ఆ యువతి జాడ తెలిపిన వారికి 10 వేల డాల‌ర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 8.32 లక్షలు) ఇవ్వ‌నున్న‌ట్లు యూఎస్‌ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ప్ర‌క‌టించింది.

వివరాలు.. 29 ఏళ్ల మ‌యూషీ భ‌గ‌త్‌.. 2019, ఏప్రిల్ 29వ తేదీన జెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి  క‌నిపించ‌కుండాపోయింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తేమో స్విచ్చాఫ్ వచ్చింది. ఆమె స్నేహితుల్ని సంప్రదించినా ఎలాంటి సమాచారం లభించలేదు.దీంతో కూతురు అదృశ్యంపై ఆమె కుటుంబ సభ్యులు మే 1వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మయూషీ ఇంటి నుంచి వెళ్లిన‌ సమయంలో క‌ల‌ర్ పైజామా, బ్లాక్ టీ ష‌ర్ట్ ధ‌రించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

యువతి మిస్సింగ్‌పై న్యూజెర్సీలోని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్‌, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం గత నాలుగేళ్లుగా కోసం వెతుకుతూనే ఉంది. పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినా.. ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే మయూషీ ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ ఓ ప్రకటన చేసింది. యువతి స‌మాచారం ఇచ్చిన వారికి ప‌దివేల డాల‌ర్ల రివార్డు  ఇవ్వ‌నున్న‌ట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.
చదవండి: జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!

ఎవరీ మయూషీ భగత్‌
మయూషీ భగత్.. భారతీయ విద్యార్థి. 1994లో వడోదరాలో జన్మించింది. 2016లో ఎఫ్‌ 1 స్టూడెంట్‌ వీసాపై అమెరికా వెళ్లిన ఆమె అక్కడ న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎంఎస్‌ చేస్తోంది. మయూషి భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. గోధుమ రంగు కళ్ళు, నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వివరాలు వెల్లడించారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది. FBI గత ఏడాది జూలైలో తన వెబ్‌సైట్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’ పేజీలో మయూషీ ‘తప్పిపోయిన వ్యక్తుల’ పోస్టర్‌ను ప్రదర్శించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement