ఆత్మల మధ్య అనుసంధానమనేది మనిషి చావుపుట్టుకలకు అతీతమైనది. జ్ఞాననేత్రంతో దివ్యదృష్టిని (సిక్త్ సెన్ ్స) సాధించడం, ఎలాంటి ప్రసార సాధనం లేకుండా మనిషి నుంచి మనిషికి సమాచారాన్ని చేరవేయడం (టెలిపతీ) వంటివన్నీ మనిషి జీవితంలో ఎప్పటికీ అబ్బురాలే! అలాంటి ఊహాతీతమైన మిస్టరీ ఈవారం మీకోసం. ఇది రెండు వేరు వేరు చోట్ల, రెండు వేరు వేరు సందర్భాలను కలిపి చెప్పే సినిమా కథలాంటిది.
అది 1978 అక్టోబర్ 31. అంతా హాలోవీన్ సెలబ్రేషన్ ్సలో ఉన్నారు. సాయంత్రం ఆరు తర్వాత, 19 ఏళ్ల కర్రన్, కాథీ అనే కవలలు.. తమ అక్క షారోన్, కాథీ బాయ్‌ఫ్రెండ్ లూకాస్‌తో కలసి స్థానిక క్లబ్‌కి వెళ్లారు. అక్కడ కొందరు స్నేహితుల్ని కలసి ఎంజాయ్ చేశారు. సరిగ్గా 8 అయ్యేసరికి లూకాస్‌తో కలసి కాథీ ఇంటికి బయలుదేరింది. కర్రన్ తన అక్క షారో తో ఇంకాసేపు క్లబ్‌లోనే గడపాలని నిర్ణయించుకుంది. అయితే కాథీ, లూకాస్‌లు ఇంటికి సమీపిస్తుండగా, ఇద్దరు ముసుగు దుండగులు వాళ్లను అడ్డుకున్నారు.
తుపాకీ చూపించి.. వారి దగ్గరున్న విలువైన వస్తువులను, డబ్బును లాక్కున్నారు. అదే సమయానికి క్లబ్‌లో ఉన్న కర్రన్ ఉన్నట్టుండి తనకు తెలియకుండానే భయంతో వణికిపోయింది. కారణం లేకుండానే బాగా ఏడ్చింది. వెంటనే ఇంటికి వెళ్లాలని పట్టుబట్టింది. పక్కనే ఉన్న షారోన్‌కి ఏం అర్థం కాలేదు. కాథీ ఏదో ప్రమాదంలో పడిందని కర్ర మనసుకు తెలుస్తూనే ఉంది. తీరా ఇంటికి చేరేసరికి దగ్గర్లో లూకాస్ గాయాలతో కనిపించాడు. ఆ పరిసరాల్లో ఎక్కడా కాథీ కనిపించలేదు.
కాథీని చంపేస్తామని బెదిరించి, దాడికి తెగబడిన దుండగులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని పోయారని లూకాస్ చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కాసేపటికి కాథీ నుంచి కర్రన్‌కి డైరెక్ట్ సందేశాలు రావడం మొదలయ్యాయి. టెలిపతీ మాదిరి.. ప్రమాదం తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘కాథీ ఓ కారులో బందీగా వెళుతోందని, ఆ కారు సీట్ కలర్‌తో పాటు కారులో ఉన్న కార్పెట్ కలర్ కూడా చెప్పింది కర్రన్. మొదట ఎవ్వరూ ఆమె మాటలు నమ్మలేదు. పోలీసులైతే ఆమెకి పిచ్చి అనుకున్నారు. కానీ కర్ర ఎంతో తీక్షణంగా కనురెప్పలు వాల్చకుండా, కళ్లతో చూస్తున్నట్లుగా కాథీ పరిస్థితి గురించి ప్రతి అంశాన్నీ వివరంగా చెబుతూనే ఉంది. కాథీని తీసుకెళ్తున్న కారు సమీపంలోని ఎయిర్‌వేస్ బూలవాడ్ వైపు వెళుతోందని చెప్పింది కర్రన్.
అయితే కాథీ తలపై ఆ దుండగులు గట్టిగా కొడుతున్నారని కర్ర ఆ నొప్పిని అనుభవిస్తూ చెప్పింది. కాథీకి దెబ్బలు తీవ్రంగా తగలడంతో కర్రన్ తట్టుకోలేక విలవిల్లాడింది. తన అక్కను చంపేస్తున్నారనే భయం ఆమెను క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఆమె బాధ చూసి పోలీసులు కూడా కరిగిపోయారు. ఆమె చెప్పిన చోటికి ఆమె వెంటే పయనమయ్యారు. అయితే కాసేపటికి కాథీ నుంచి కర్రన్‌కి పరోక్ష సందేశాలు ఆగిపోయాయి.
పుట్టినప్పటి నుంచి అదే బంధం..
కాథీ– కర్రన్‌లు 1959 ఏప్రిల్ 25న అమెరికా, టెనసీలోని మెంఫిస్‌లో జన్మించారు. సాధారణంగా కవలల్లో ఒకరికి జ్వరం వస్తే మరొకరికి జ్వరం రావడం.. ఒకరికి ఆకలేస్తే మరొకరికి ఆకలేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ కాథీ, కర్రన్ లకు ఎంత దూరంలో ఉన్నా మొదటి నుంచి ఒకరి భావోద్వేగాలు మరొకరికి అనుభవంలోకి వచ్చేవి. ఒకసారి కాథీ తన బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ పడుతుంటే.. చాలా దూరంలో ఉన్న కర్రన్‌కి విపరీతమైన కోపం పొంగుకొచ్చింది. కాథీ ప్రసవవేదనను కర్రన్ కూడా అనుభవించి, అల్లాడిపోయింది. అవన్నీ సాధారణమే అనుకున్న కాథీ, కర్రన్‌ల జీవితంలో కాథీ కిడ్నాప్ ఘటన.. ఆ కవలల మధ్యనున్న అతీంద్రియ అనుబంధాన్ని బయటపెట్టింది.
ఆ సమయంలో ఓ చోట అకస్మాత్తుగా కాథీ వెళ్తున్న కారులో ఇంధనం అయిపోయింది. కారు ఆగిపోయింది. దాంతో దుండగులు భయపడి, కారును ఓ పక్కకు నెట్టారు. ఆ దారిలో పార్క్ చేసి ఉన్న మరో కారు నుంచి ఒక దుండగుడు ఆయిల్ దొంగలిస్తుంటే, మరో దుండగుడు కాథీని అదుపుచేసే పనిలో ఉన్నాడు. ఆ గందరగోళాన్ని పసిగట్టిన కొన్ని కుక్కలు భీకరంగా మొరగడం మొదలుపెట్టాయి. ఆ అలికిడికి పక్కనే ఉన్న ఇంట్లోంచి దంపతులు బయటికి వచ్చి ‘ఎవరది’ అంటూ గద్దించారు. వెంటనే ఆ దుండగులు వారి మీద కూడా కాల్పులు జరిపి పెద్ద హంగామా సృష్టించారు. ఆ అరుపులకి ఇంకొంత మంది రావడంతో దుండగులు భయపడి.. కారు వదిలిపెట్టి, కాథీని తీసుకుని అక్కడి నుంచి పరుగుతీశారు.
కాసేపటికి కర్రన్‌కి మళ్లీ కాథీ నుంచి సందేశాలు రావడం మొదలయ్యాయి. కాథీ ఎక్కడో ఓ రోడ్డు మీద పరుగు తీస్తున్నట్లుగా కర్రన్ మెదడుకు సందేశాలు వచ్చాయి. దాంతో కాథీ బతికే ఉందనే ఆనందం కర్రన్‌లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. అయితే కాథీ ఒళ్లంతా చల్లగా ఉందని, ప్రాణాపాయ స్థితిలోనే ఉందని మనోనేత్రంతోనే గుర్తించి తనతో ఉన్నవాళ్లకు చెప్పింది. దాంతో కాథీ కోసం కర్రన్, షారో లతో కలసి ఆ పోలీస్ బృందం వెతుకుతూనే ఉంది.
సీన్ కట్ చేస్తే.. దుండగుల కాల్పుల హంగామా, దంపతుల ఫిర్యాదుతో మరో పోలీస్ బృందం ఆ పరిసరాలను జల్లెడపట్టే పనిలో పడింది. పోలీస్ సైరన్‌లకు బెంబేలెత్తిన ఆ దుండగులు కాథీని వదిలి పారిపోవడం.. చావుబతుకుల మధ్య ఉన్న కాథీ ఆ పోలీస్ బృందానికి దొరకడం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడం అంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. కాసేపటికి కర్రన్, షారోన్‌లకు, వారితో ఉన్న పోలీస్ బృందానికి ఈ సమాచారం అందింది.
ప్రమాదం తర్వాత ఆ ఆసుపత్రిలోనే కాథీ, కర్రన్ కలుసుకున్నారు. కాథీ కోలుకున్నాక కర్రన్ చెప్పిన ప్రతి అంశం నిజమేనని కాథీ నిర్ధారించింది. దుండగులు దాడి చేయగానే భయంతో ఏడవడం దగ్గర నుంచి కారు సీట్ కలర్, కార్పెట్ కలర్ వరకూ అన్నీ.. కర్రన్ చెప్పినట్లే ఉన్నాయని తేలింది. దాంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు.
ఏదేమైనా ఈ అద్భుతం గురించి మీడియాలో పెద్దగా కథనాలేమీ రాలేదు. కాథీ, కర్రన్‌ల మధ్య ఉన్న బంధం శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. వారికి చెందిన మరే ఇతర వివరాలు ప్రపంచానికి తెలియలేదు. అలాగే కాథీని కిడ్నాప్ చేసిన దుండగులు ఎవరూ ఇప్పటికీ పట్టుబడలేదు. దాంతో ఈ ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది.
గాంట్స్ కవలల అన్వేషణ
లీసా గాంట్స్, డెబ్బీ గాంట్స్ అనే ట్విన్స్.. కవలల జీవితాల్లోని రహస్యాలను అర్థం చేసుకునేందుకు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కవలలను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలోనే కాథీ, కర్రన్‌ల అనుబంధం గురించి వారికి తెలిసింది. గాంట్స్ సిస్టర్స్ రాసిన ‘ద బుక్ ఆఫ్ ట్విన్స్’ అనే ఈ పుస్తకంలో ఆ వివరాలున్నాయి. కవలల మధ్య టెలిపతిక్ కమ్యూనికేషన్ ఉంటుందని చెబుతూ కాథీ, కర్రన్‌ల కథను ఆధారంగా చూపించారు. మొదటి నుంచి కర్రన్, కాథీలు మానసికంగా అనుబంధాన్ని కలిగి ఉన్నారని, ఒకరి బాధను మరొకరు అనుభవించగలరని గాంట్స్ సిస్టర్స్ పేర్కొన్నారు.
సంహిత నిమ్మన
(చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు)
Comments
Please login to add a commentAdd a comment