నిస్సహాయతను, నిర్వేదాన్ని నింపుకున్న గుండెలో.. ఓ వెర్రి నవ్వు నిస్తేజంగా తొణికిసలాడుతుంది. ఆ నవ్వులో.. సమాజాన్ని నిలువునా కాల్చి బూడిద చేయగలిగేంత ఆవేశం ఉంటుంది. 43 ఏళ్ల వెనెస్సా బెన్నెట్‌ని కదిలిస్తే అచ్చం అలాంటి నవ్వే నవ్వుతుంది. ఎందుకంటే.. తనకు ఊహ తెలియక మునుపే.. క్రూరమైన చావు పరిచయం అయ్యింది.
ఊహ తెలిసేసరికి.. ఆ చావే శరణమనిపించింది. చెల్లాచెదురైన తన బతుకుని చక్కదిద్దుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. బతుకుపోరాటంలో ఇప్పటికీ తన మనసుతో తాను యుద్ధం చేస్తూనే ఉంది. ఇంతకీ ఎవరీ వెనెస్సా? అసలు తన జీవితంలో ఏం జరిగింది?
వెనెస్సా గురించి ఒక మాటలో చెప్పాలంటే.. దురదృష్టానికి, అదృష్టానికి మధ్య నలిగిన ఒక జీవితం. తనకు అసలేం జరిగిందో తెలియని వయసులోనే.. తోటివాళ్ల రూపంలో.. వెకిలినవ్వులు, ఎగతాళి చూపులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. ఆ పరిస్థితికి కారణం ఎవరో తెలియక, తను ఎందుకలా ఉందో తెలియక తల్లడిల్లింది. ఊహ తెలిశాక తన కథ తనకే కన్నీళ్లు తెప్పించింది.1984 జనవరి 16 అర్ధరాత్రి ఓ రాక్షసుడు సుత్తి చేత పట్టుకుని.. అమెరికా, కొలరాడోలోని అరోరాలో.. వెనెస్సా ఇంట్లో అడుగుపెట్టాడు. ఆమెకప్పుడు మూడేళ్ల వయసు. వాడు లోపలికి అడుగుపెట్టగానే.. వెనెస్సా తండ్రి బ్రూస్ బెన్నెట్(27)ని అత్యంత క్రూరంగా సుత్తితో కొట్టి చంపేశాడు.
మూడేళ్ల చిన్నారిపై లైంగికంగా..
తర్వాత తల్లి డెబ్రా(26), అక్క మెలిస్సా(7)లపై లైంగికంగా దాడి చేసి.. అదే సుత్తితో వాళ్లనూ హత్య చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఇంటిని శ్మశానంగా మార్చాడు. అసలేం జరుగుతోందో తెలియని స్థితిలో వెనెస్సా ఒంటరిగా ఆ కిల్లర్ చేతికి చిక్కింది. కనికరంలేని ఆ క్రూరుడు మూడేళ్ల వెనెస్సాపై కూడా లైంగికదాడి చేసి.. సుత్తితో తీవ్రంగా కొట్టాడు. అందరిలానే ఆ పాపా చనిపోయిందనుకుని తెల్లారేసరికి పారిపోయాడు. ఉదయం పది దాటేసరికి వెనెస్సా నాన్నమ్మ కొన్నే బెన్నెట్.. ఆ ఘోరాన్ని చూసి గుండెలవిసేలా ఏడ్చింది. కాసేపటికే పోలీసులు, వైద్యులు అంతా అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న వెనెస్సా కొన ఊపిరితో ఉందని గుర్తించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
16ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాడుపడి..
కిల్లర్ దాడికి.. వెనెస్సా దవడ, పుర్రె పగిలిపోయాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. శరీరం మొత్తం ఛిద్రమై.. ప్రాణం మాత్రమే మిగిలింది. రెండేళ్లకు కోలుకున్న వెనెస్సా.. తీవ్రమైన ఒత్తిడి, కోపం, అసహనం లాంటి ఎన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతూ నాన్నమ్మ దగ్గరే పెరిగింది. అయితే ఇంతటి ఘోరం చేసిన కిల్లర్ ఎవరో.. ఎవరికీ తెలియలేదు. దర్యాప్తు జరుగుతున్నా.. సరైన సాక్ష్యాధారాల్లేక.. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. కాలక్రమేణా తన కథను తెలుసుకున్న వెనెస్సా.. సమాజంపై ద్వేషాన్ని పెంచుకుంది. చెడుదారుల్లో నడిచింది. 16 ఏళ్లకే డ్రగ్స్‌కు అలవాటుపడింది. 17 ఏళ్ల వయసులో.. జీవితం మీద విరక్తి పుట్టి.. చనిపోవాలని మణికట్టుని కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
జీవితం విలువ తెలిసొచ్చింది
ఏళ్లుగా కిల్లర్ కోసం.. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగినా.. ఆ అగంతుకుడు ఎవరో తేలలేదు.18 ఏళ్ల వయసులో తన ఇష్టపూర్వకంగానే గర్భవతి అయిన వెనెస్సా.. కొడుకు పుట్టిన 3 నెలలకు ‘తల్లిగా ఎలా ఉండాలో తెలియట్లేదు’ అంటూ చిల్డ్రన్స్ వెల్ఫేర్ అధికారులకు బాబుని అప్పగించేసింది. రోజురోజుకీ మానసిక ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. తను, తన బాయ్‌ఫ్రెండ్ కలసి వంతెన కింద జీవించడం మొదలుపెట్టారు. తలస్నానం చెయ్యాలన్నా.. దగ్గరల్లోని ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంది. దొంగతనాలు, మాదకద్రవ్యాల కేసుల్లో జైలుకి కూడా వెళ్లింది. 30 ఏళ్లు వచ్చేసరికి.. ఆమెలో మార్పు మొదలైంది. జీవితం అంటే ఇది కాదు అనే ఆలోచన వచ్చింది.
మనిషిగా బతకడానికి.. గతంతో సంబంధం లేదనిపించింది. దాంతో మాట, తీరు అన్నీ మార్చింది. ఫ్రాంకీ విల్లార్డ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఆలోచనతో తన కథను ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టింది. డ్రగ్ కౌన్సెలర్ అయేందుకు డిగ్రీ కళాశాలలో చేరింది. 2018లో సుమారు 20 ఏళ్ల వయసున్న తన కొడుకుని కూడా కలుసుకుంది. ఆ రోజు వెనెస్సా మనస్పూర్తిగా నవ్వింది. ‘నేను ఒకరికి ప్రాణం పోశాననే ఆనందం.. నేనో తల్లిననే అనుభూతి చాలా గొప్పగా ఉంది’ అంటూ పొంగిపోయింది. 2018 వరకూ ఈ కేసు మిస్టరీగానే ఉంది. సరిగ్గా 34 ఏళ్ల తర్వాత.. డీఎన్‌ఏ ఆధారంగా కిల్లర్ ఎవరనేదానిపై ఓ స్పష్టత వచ్చింది.
డీఎన్‌ఏతో హంతకుడు ఎవరో తేలింది
షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ కిల్లర్.. పరారీలో ఉన్న నిందితుడు కాదని.. 1984 ఆగస్ట్ 9 నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న నేరగాడని తేలింది. అతడు సీరియల్ కిల్లర్ అలెక్స్ క్రిస్టోఫర్ ఎవింగ్ అని అందరితో పాటు వెనెస్సా అప్పుడే తెలుసుకుంది. 1984లో అతడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో బెన్నెట్ ఫ్యామిలీ విషాదగాథ కూడా ఒకటని.. ముందు నుంచి అనుమానాలున్నా.. డీఎన్‌ఏతో 2018లో క్లారిటీ వచ్చింది. 1984 జనవరి 10న లేక్‌వుడ్‌లో ప్యాట్రీషియా స్మిత్ అనే మహిళపై హింసాత్మకంగా లైంగిక దాడి చేసి, హత్య చేశాడు. అదే ఏడాది ఆగస్టు 9న నెవాడా, హేండర్సన్‌లో గొడ్డలితో నాన్సీ, క్రిస్ బ్యారీలపై దాడిచేసి పారిపోయాడు.
ఆ కేసులోనే అతడు అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నాడు. అతడికి హ్యామర్ కిల్లర్ అనే పేరు కూడా పెట్టాయి అప్పటి వార్తా పత్రికలు. మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజలపై దాడి చేసినట్లు ఆధారాలు ఉండటంతో అతడికి పెరోల్ కూడా లభించలేదు. 2021 నాటికి అతడు బెన్నెట్ కేసులో దోషిగా రుజువు కావడంతో కోర్టు.. మూడు జీవితకాలాల కారాగార శిక్షను విధించింది. దాంతో అతడు జీవితంలో బయటికి వచ్చే అవకాశాన్నే కోల్పోయాడు. ఈ కథ తెలిసిన వాళ్లంతా న్యాయం జరిగింది అన్నారు. కానీ వెనెస్సా మాత్రం.. తనకు జరిగిన అన్యాయం పూడ్చలేనిదని, అతడిలో నేను పశ్చాత్తాపం చూడలేదని చెప్పింది.
సమాజంపై గౌరవం కోల్పోయింది
‘అతడి కారణంగా నేను నా వాళ్లని మాత్రమే కాదు.. సమాజంపై నమ్మకాన్నీ, గౌరవాన్నీ కోల్పోయాను. నా వ్యక్తిత్వాన్నీ కోల్పోయాను. ఇప్పటికీ నేను ప్రతిరోజూ అద్దంలో చూసుకుని.. తట్టుకోలేని వేదనను అనుభవిస్తున్నాను. తెలియని కోపం, ద్వేషం, మానసిక వేదన ఇలా అన్నీ నన్ను కుంగదీస్తూనే ఉన్నాయి. నా జీవితం నాశనమైపోయింది. దానికి ఏ పరిష్కారం లేదు’ అంటూ ఎందరో మనసుల్ని మెలిపెట్టింది. సరైన సాక్షులు లేని ఈ కథలో కిల్లర్ కేవలం డీఎన్‌ఏ ఆధారంగానే దొరికాడు. లేదంటే ఇప్పటికీ ఈ కథ మిస్టరీగానే ఉండిపోయేది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment