అంతు చిక్కని మిస్టరీ..మార్లిన్‌ శాంటానా మూడు రోజుల పాప కథ.. | The Mystery Of Marlene Santana 1985 Unsolved Case | Sakshi
Sakshi News home page

పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్‌..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!

Published Sun, Jul 9 2023 1:21 PM | Last Updated on Fri, Jul 14 2023 3:24 PM

The Mystery Of Marlene Santana 1985 Unsolved Case - Sakshi

కొన్నిసార్లు ఆకస్మిక ప్రమాదాల నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జీవితమే ఒక పీడకలగా మిగిలిపోతుంది. శాంటానా కుటుంబానికి ఆనందం, విషాదం రెండూ ఒకదాని వెంట ఒకటి కవలపిల్లల్లా వచ్చాయి. కేవలం ఆనందమే మిగులుంటే ఈ రోజు ఈ కథ మిస్టరీ అయ్యేదే కాదు. అసలు మార్లీన్‌ శాంటానా ఎవరు? తనకేమైంది? మార్లీన్‌ శాంటానా కేవలం మూడు రోజుల పాప. కడుపులో ఉన్నప్పుడే తనకు మార్లీన్‌ అనే పేరుపెట్టాలని ఆ తల్లిదండ్రులు కలలుగన్నారు. కానీ అలా జరగలేదు.

అది 1985 అక్టోబర్‌ 21. రాత్రి తొమ్మిది దాటింది. అమెరికా, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని బ్రూక్‌డేల్‌ హాస్పిటల్‌ ముందు జనాలంతా ఒక్కొక్కరుగా పలుచబడుతున్నారు. పేషెంట్స్‌ రద్దీ తగ్గి.. డాక్టర్లు, నర్సులు అంతా సేదతీరుతున్నారు. అప్పుడే ఫ్రాన్సిస్కా శాంటానా అనే మూడురోజుల బాలింత డిశ్చార్జ్‌ అయ్యి.. తన పాపను ఎత్తుకుని ఆసుపత్రి రూమ్‌ నుంచి బయటికొచ్చింది. భార్యతో పాటు తన బుల్లి ప్రిన్సెస్‌ని ఇంటికి తీసుకుని వెళ్లడానికి ఫ్రాన్సిస్కా భర్త థామస్‌ చాలా సంబరంగా ఎదురుచూస్తున్నాడు. సాయం కోసం ఇంటి నుంచి.. ఫ్రాన్సిస్కా వాళ్ల ఇద్దరు అత్తలూ ఆసుపత్రికి వచ్చారు.

నలుగురూ కలసి.. పాపను,  లగేజ్‌ని తీసుకుని.. ఆసుపత్రి ప్రాంగణం నుంచి కొంచెం ముందుకు వెళ్లారు. సరిగ్గా అప్పుడే సుమారు పాతికేళ్ల అపరిచితురాలు వాళ్ల దగ్గరకు వచ్చి.. ‘ఎక్కడికి వెళ్తున్నారు’ అంటూ మాట కలిపింది. ‘ఇప్పుడే డిశ్చార్జ్‌ చేశారు. ఇంటికి వెళ్తున్నాం’ అని చెప్పింది ఫ్రాన్సిస్కా. ఆమె ప్రశ్నలైతే వేస్తుంది కానీ.. చూపులు మాత్రం వాళ్లవైపు లేవు. పరిసరాలను గమనిస్తున్న కంగారు.. ఆమె కళ్లల్లో తొణికిసలాడుతోంది. స్ట్రీట్‌లైట్‌ వెలుగుల్లో అది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ థామస్‌ ఫ్యామిలీ మాత్రం అదంతా పట్టించుకునే స్థితిలో లేదు.

వాళ్ల హడావుడిలో వాళ్లున్నారు. అప్పుడే సడెన్‌గా ‘నేను మీ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా’ అంది ఆమె. ఆ మాటలకు ఫ్రాన్సిస్కా అర్థం కానట్లుగా ఆమెవైపు అయోమయంగా చూసింది. ఆమె భయాన్ని పసిగట్టేసిన ఆ మహిళ.. వెంటనే తుపాకీ బయటికి తీసింది. క్షణాల్లో పసిపాప తలకు గురిపెట్టి ‘అరిస్తే చంపేస్తా, నేను చెప్పిందే చెయ్యాలి’ అంది. థామస్‌ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. ఆమె కళ్లు పెద్దవి చేస్తూ.. గద్దిస్తూ వాళ్లను చాలా దూరం నడిపించింది. గుండె లోతుల్లోంచి దుఃఖం తన్నుకొస్తున్నా.. పాప కోసం చెప్పింది చెప్పినట్లే చేయడానికి వాళ్లు సిద్ధపడ్డారు.

ఊహించని ఆ ప్రమాదానికి ఎలా స్పందించాలో, ఎలా తప్పించుకోవాలో థామస్‌కి అర్థం కాలేదు. దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగానే ఉన్నాయి. అరకొర అలికిడి ఉన్నా, సమీపంలో ఎవ్వరూ లేరు. కాస్త దూరంలో జంక్‌ యార్డ్‌ దగ్గర ‘ఆగండి’ అంటూ గదమాయించింది.  ‘ప్లీజ్‌ మమ్మల్ని వదిలిపెట్టు.. మేము పాప పుట్టిన ఆనందంలో ఉన్నాం. మా దగ్గర విలువైనవి కూడా ఏం లేవు’ అంటూ ఫ్రాన్సిస్కాతో పాటు అంతా ఆ స్త్రీని వేడుకుంటూనే ఉన్నారు. కానీ ఆమె వినిపించుకోలేదు. అప్పటి దాకా ఆమె ఒక దోపిడీదారని, డబ్బు లేదా విలువైన వస్తువులు లాక్కోవడానికే దాడి చేసిందని అనుకున్నారు.

కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ.. పసిపాపను తన చేతికి ఇవ్వాలని.. గన్‌ ట్రిగ్గర్‌ మీద వేలును ప్రెస్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టింది. ‘నా బిడ్డను ఏం చేయొద్దు ప్లీజ్‌’ అని ఏడుస్తూ నిస్సహాయంగా పాపను ఆ స్త్రీ చేతుల్లో పెట్టింది ఫాన్సిస్కా. అలా పెట్టగానే ఒక్క ఉదుటున అందరినీ తోసిపడేసిన ఆ మహిళ.. పాపతో సహా పరుగందుకుంది. క్షణాల్లో అక్కడ దగ్గర్లో స్టార్ట్‌ చేసి ఉన్న కారు ఎక్కి ‘పోనీ త్వరగా’ అంది. శాంటానా ఫ్యామిలీ ఆ షాక్‌లోంచి తేరుకునే లోపే కారు వేగం అందుకుంది. ‘నా పాప.. ప్లీజ్‌ నా పాపను నాకు ఇచ్చేయండి, కారు ఆపండి’ అంటూ బాలింత ఫ్రాన్సిస్కా కారు వెనుకే పరుగు తీసిన దృశ్యం.. ఆ కుటుంబాన్ని ఎంతగానో కలచివేసింది.

వెంటనే వారంతా పోలీస్‌స్టేషన్‌కి పరుగుతీసి, జరిగిందంతా చెప్పారు. పోలీసుల విచారణలో ఓ సీసీ ఫుటేజ్‌ దొరికింది. దానిలో పాపను తీసుకుని ఆమె పారిపోయే సీన్‌ దూరం నుంచి కనిపించింది. కానీ స్పష్టత లేదు. కాలక్రమంలో పత్రికలే పాపకు మార్లీన్‌ అని నామకరణం చేశాయి. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. పాప కిడ్నాప్‌కి ముందు ఆ మహిళను ఫ్రాన్సిస్కా.. ఆసుపత్రిలోని పిల్లల వార్డ్‌లో కలుసుకుంది.  అక్టోబర్‌ 19 మధ్యాహ్నసమయంలో ఆ స్త్రీ.. ఫ్రాన్సిస్కాతో మాట్లాడిందట. ‘నేను వేరే పాప కోసం వచ్చాను. కానీ మీ పాప చాలా అందంగా ఉంది.

అసలు ఏడవకుండా ఎంత ముద్దుగా ఉందో.. నాకు మీ పాప బాగా నచ్చింది’ అని పొగిడిందట. ఆ రోజు ఆ పొగడ్తలకు సంతోషించిందే తప్ప అనుమానించలేదు. అదే అపరాధభావం ఫ్రాన్సిస్కాను వేధించింది. ఈ ఘటనకు ముందు న్యూయార్క్‌లోని మరో ఆసుపత్రిలో క్రిస్టోఫర్‌ మోర్గాన్‌  అనే రెండు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. కొన్ని నెలల తర్వాత ఒకరి ఇంట్లో సజీవంగా దొరికాడు. వారు తాము పోగొట్టుకున్న బిడ్డ స్థానంలో క్రిస్టోఫర్‌ని చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారని తేలింది. దాంతో మార్లీన్‌ని ఎత్తుకెళ్లిన స్త్రీ వృత్తిరీత్యా నేరస్థురాలు కాకపోవచ్చని.. బహుశా ఆమె బిడ్డను పోగొట్టుకుని, తన పాప స్థానంలో మార్లీన్‌ని పెంచుకుంటుంది కాబోలని చాలామంది భావించారు.

అదే అనుమానంతో  పోలీసులు చుట్టుపక్కల ఆసుపత్రులన్నీ జల్లెడపట్టి.. గర్భస్రావాలు లేదా ప్రసవాలు జరిగిన చాలామంది మహిళలను విచారించారు. కానీ ఏ ఆచూకీ రాబట్టలేకపోయారు. నేటికీ మార్లీన్‌ ఆచూకీ తేలలేదు. కేవలం రోజుల పాపే కావడం, రియల్‌ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడంతో గత 38 ఏళ్లుగా.. మార్లీన్‌ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప ఫలితం లేదు. మార్లీన్‌ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ప్రతి పుట్టిన రోజునూ జరుపుకుంటున్నారు. ఆమె రాక కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. 
--సంహిత

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్‌..ఇందులో చేరాలంటే.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement