సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది డెత్ మిస్టరీలపై క్షణానికో కథనం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా మోక్షం కేసమే ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు బలంగా నెలకొన్నాయి. ఇదే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులుకూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆ ఇంట్లో దొరికిన ఓ లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ లేఖ డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే మరో కొత్తకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటికి గోడకున్న 11గొట్టాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద 11 పైపులు, అసాధారణ పద్ధతిలో అమర్చి ఉండటంతోపాటు ఆ పైపులు అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన వైనం ఒకేలా ఉండటం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఈ పైపులకు, భాటియా కుటుంబం మరణాలకు కచ్చితంగా సంబంధముందని భాటియా స్నేహితుడు నితిన్ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు.
కాగా మోక్షం మంత్ర, తంత్ర పూజల్లో ఆ కుటుంబీకులు పాల్గొన్నారా లేదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. (చనిపోయిన11 మందిలో 10మందికి ముఖానికి, చేతులకు కట్టిన గుడ్డ ఒకే దుప్పటికి చెందిన ముక్కలు కాగా, మరో పెద్దావిడ వేరే గదిలో గొంతు నులిమి చంపినట్టుగా ఆనవాళ్లు) ఆ లేఖను మరింతగా విశ్లేషిస్తున్నామని పోలీస్ కమీషనర్ అలోక్ కుమార్ తెలిపారు. మొదట జూన్18న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌వార్‌కు ఈ ఆత్మహత్యలకు సంబంధముందా అనే కోణంలో పోలీసులు విచారించారు. అలాగేభాటియా ఇంట్లోకి శనివారం రాత్రి 10:40 గంటలకు ఫుడ్ డెలివరీ అయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు ఇతర అనేక అంశాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నామనీ, లేఖను డీకోడ్ చేసిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఉరికి వేలాడిన వారిలో ఆరుగురు ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. వీరి అంత్యక్రియలు డిల్లీలో నేడు (సోమవారం) నిర్వహించనున్నారు.
లేఖలో పేర్కొన్న అంశాల సారాంశం
మరణానికి గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలి..
కండ్లను బట్టతో కట్టుకోవాలి. ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి..
చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా నిష్టంగా పూజలు నిర్వహించాలి. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి.
పెద్దవాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్‌లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి.
డిమ్ లైట్‌లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి.
చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి.
నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి.
ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి..
రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకుముందే చేయాలి.
అందరిలోనూ ఒకేరకమైన పవిత్ర భావన ఉండాలి. అపుడు మాత్రమే మోక్షానికి మార్గం సుగమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment