pipes
-
సల్మాన్ ఖాన్ మూవీ బూస్ట్: ఏకంగా 21 వేల కోట్లకు ఎగబాకిన బిజినెస్‌మేన్
దేశంలోని అతిపెద్ద పైపుల బ్రాండ్‌కు బిలియనీర్ యజమాని, సందీప్ ఇంజనీర్ బిలియనీర్‌గా అవతరించడం వెనుక చాలా కష్టాలున్నాయి. జీవితంలో చాలా హెచ్చుతగ్గులు చవి చూశారు. కానీ విజయవంతమైన పారిశ్రామికవేత్త కావాలనే అతని సంకల్పం ముందు అన్నీ ఓడిపోయాయి. 2019లో ఆస్ట్రల్ పైప్స్ వ్యవస్థాపకుడిగా సందీప్ ఇంజనీర్ గౌరవనీయమైన బిలియనీర్స్ క్లబ్లోకిఎంట్రీ ఇచ్చారు. మామూలు ఫార్మ ఉద్యోగి నుంచి 21 వేల కోట్ల రూపాయల కంపెనీకి యజమానిగా సందీప్ సక్సెస్ఫుల్ జర్నీ..! గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని కాడిలా ల్యాబ్స్‌లో పనిచేసేవారు సందీప్. 20 ఏళ్ల వయసులో 1980లలో వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు.. ఆ సమయంలో అతనికి వ్యాపారం చేయడంలో అనుభవంలేదు కుటుంబ నేపథ్యమూ లేదు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేశారు. ఇసాబ్గోల్ అనే తొలి వెంచర్‌ను స్టార్ట్ చేశారు. కానీ అక్కడ విజయం సాధించలేకపోయారు. వ్యాపారంలో విఫలమయ్యారు. ఒక దశలో చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ క్రమంలో పంకజ్ పటేల్ అనే బిలియనీర్ వ్యాపారవేత్త సందీప్‌కు మార్గదర్శకత్వం వహించడంతో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది పంకజ్‌పటేల్ మద్దతుతో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (API) వ్యాపారంలోకి ప్రవేశించారు. ఇక్కడ లాభనష్టాలతో పోరాటం తప్పలేదు. తమ ఉత్పత్తులు నిరుపయోగంగా మారడంతో వాటిని మార్చాల్సి వచ్చింది. కానీ ఆ తరువాత ఇంజనీర్ క్లోరినేటెడ్ పాలీ వినైల్ క్లోరైడ్ (సీపీవీసీ) పైపుల వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టారు. ఆస్ట్రల్ పైప్స్ కంపెనీ అమెరికా నుంచి వచ్చిన కొత్త ఆవిష్కరణ 1998లో సందీప్ ఇంజనీర్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ అనే కొత్త వ్యాపారానాకి నాంది పలికింది. మొదట్లో దీన్ని చాలామంది విశ్వసించ నప్పటికీ, క్రమం బలం పుంజుకుంది. 2000ల ప్రారంభంలో సందీప్ ప్లంబింగ్ పైపుల తయారీ సంస్థగా బ్రాండ్‌ను స్థాపించారు. ఆ తరువాత 2010ప్రారంభంలో కుమారులు కైరవ్, సౌమ్య అందిరావడంతో సందీప్‌కు మరింత కలిసి వచ్చింది. 2003లో రూ 15 కోట్ల ఆదాయం ఒక్క ఏడాదిలోనే 25 కోట్లకు పెరిగింది. 2007లో, 60కోట్ల వాల్యూతో ఆస్ట్రాల్కు ఐపీఓవకు వచ్చింది. దీని ద్వారా రూ. 35 కోట్లను సేకరించింది. 2019లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆస్ట్రల్ స్పాన్సర్‌గా ఉంది. (సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్) దబాంగ్ సిరీస్, బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ వీటన్నింటికి మించి 2014లో ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో రెండేళ్ల ఒప్పందం కంపెనీ బ్రాండ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేసింది. అంతకుమందు సల్మాన్ నటించిన 'దబాంగ్-2' చిత్రంతో భాగస్వామ్యం సక్సెస్ కావడం గమనార్హం. (ఇదీ చదవండి: అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) కాగా 2023, ఏప్రిల్ నాటికి సందీప్ నెట్‌వర్త్ 21 వేల కోట్ల రూపాయలు. అసలు బిలియనీర్ కావాలనేది తన కోరిక కాదు. ఇదంతా శరవేగంగా జరిపోయిందని గతంలో ఫోర్బ్స్తో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు సందీప్ ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ రిటైల్, రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటల్స్, ఇండస్ట్రియల్స్, ఇతర పరిశ్రమలోని అన్ని రంగాలలో బలమైన క్లయింట్ బేస్ ఉంది. ఆస్ట్రల్‌కు అమెరికా, యూకే, కెన్యాలో సహా పలు ప్రదేశాల్లో ఫ్యాక్టరీలున్నాయి. -
11 మృతదేహాలు : 11 పైపులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది డెత్ మిస్టరీలపై క్షణానికో కథనం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా మోక్షం కేసమే ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు బలంగా నెలకొన్నాయి. ఇదే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులుకూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆ ఇంట్లో దొరికిన ఓ లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ లేఖ డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే మరో కొత్తకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటికి గోడకున్న 11గొట్టాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ప్రవేశద్వారం వద్ద 11 పైపులు, అసాధారణ పద్ధతిలో అమర్చి ఉండటంతోపాటు ఆ పైపులు అమర్చిన తీరు, మృతదేహాలు వేలాడిన వైనం ఒకేలా ఉండటం మరిన్ని అనుమానాలను రేకెత్తించింది. ఈ పైపులకు, భాటియా కుటుంబం మరణాలకు కచ్చితంగా సంబంధముందని భాటియా స్నేహితుడు నితిన్ ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. కాగా మోక్షం మంత్ర, తంత్ర పూజల్లో ఆ కుటుంబీకులు పాల్గొన్నారా లేదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. (చనిపోయిన11 మందిలో 10మందికి ముఖానికి, చేతులకు కట్టిన గుడ్డ ఒకే దుప్పటికి చెందిన ముక్కలు కాగా, మరో పెద్దావిడ వేరే గదిలో గొంతు నులిమి చంపినట్టుగా ఆనవాళ్లు) ఆ లేఖను మరింతగా విశ్లేషిస్తున్నామని పోలీస్ కమీషనర్ అలోక్ కుమార్ తెలిపారు. మొదట జూన్18న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌వార్‌కు ఈ ఆత్మహత్యలకు సంబంధముందా అనే కోణంలో పోలీసులు విచారించారు. అలాగేభాటియా ఇంట్లోకి శనివారం రాత్రి 10:40 గంటలకు ఫుడ్ డెలివరీ అయినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతోపాటు ఇతర అనేక అంశాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నామనీ, లేఖను డీకోడ్ చేసిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలున్నాయని పోలీసు అధికారి తెలిపారు. మరోవైపు ఉరికి వేలాడిన వారిలో ఆరుగురు ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. వీరి అంత్యక్రియలు డిల్లీలో నేడు (సోమవారం) నిర్వహించనున్నారు. లేఖలో పేర్కొన్న అంశాల సారాంశం మరణానికి గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలి.. కండ్లను బట్టతో కట్టుకోవాలి. ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి.. చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా నిష్టంగా పూజలు నిర్వహించాలి. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి. పెద్దవాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్‌లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి. డిమ్ లైట్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి. చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి. నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి. ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి.. రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకుముందే చేయాలి. అందరిలోనూ ఒకేరకమైన పవిత్ర భావన ఉండాలి. అపుడు మాత్రమే మోక్షానికి మార్గం సుగమవుతుంది. -
భగీరథ పైపులు బుగ్గిపాలు
రామకృష్ణాపూర్(చెన్నూర్): రామకృష్ణాపూర్లో మంగళవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మిషన్ భగీరథ పైపులు బూడిదయ్యాయి. పట్టణంలోని బీజోన్ ఆర్కే4 గడ్డ ప్రాంతంలో గల ఆట స్థలంలో మిషన్ భగీరథ పనుల కోసం పైపులు నిల్వ ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ప్రేంకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లి ఫైర్ సిబ్బందితో పాటు సింగరేణి రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు పెద్ద ఎత్తున పొగలు కమ్ముతూ మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోకి వెళ్లడానికి ఫైర్ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీళ్లు సరిపోక పోవడంతో సమీపంలోని సీఎస్పీకి వెళ్లి ఫైర్ ఇంజన్లలో నీరు నింపుకుని వచ్చారు. అప్పటికే మంటలు మరింత ఉధృతమయ్యాయి. సింగరేణి రెస్క్యూ స్టేషన్ సభ్యులు మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణమే నివారించే అక్వైర్డ్ ఫిల్మ్ ఫామ్డ్ ఫోమ్‌ను నీటితో పాటు సమాంతరంగా వినియోగించడంతో కొంతమేరకు మంటలు అదుపులోకి వచ్చాయి. సమీపంలోనే ఉన్న మిగతా పైపులను సర్పంచ్ జాడి శ్రీనివాస్, జెడ్పీటీసీ సుదర్శన్‌గౌడ్, ఓసీ డాట్ కంపెనీ మేనేజర్ సత్యనారాయణ, వార్డు సభ్యులు శశి, సత్యనారాయణ, రాజు, లక్ష్మారెడ్డి తదితరులు స్థానిక యువకులతో కలిసి దూరంగా తరలించారు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే సమీపంలోని ఇండ్లకు మంటలు వ్యాపించి పెనుప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన చెందారు. ఇంత నిర్లక్ష్యమా..? రూ.కోటికి పైగా విలువ చేసే మిషన్ భగీరథ పైపులను ఎలాంటి భద్రత కల్పించకుండా ఆట స్థలంలో ఉంచడం, వాటిపై నిర్లక్ష్యం కనబర్చడం గమనార్హం. మంటలు చుట్టు పక్కల ప్రాంతంలోని ఇండ్లపైకి వ్యాపించి ఉంటే ఎవర బాధ్యత వహించేవారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా పైపులను సరైన చోట భద్రపర్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిప్పు పెట్టి ఉంటారు : ఎస్ఈ ప్రకాశ్‌రావు సంఘటన స్థలాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రకాశ్‌రావు ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగి ఉంటుందని తాము భావించటం లేదని, ఎవరో నిప్పు పెట్టి ఉంటారనే భావిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సరైన గోడౌన్లు లేని కారణంగానే పైపులను భద్రతపర్చడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈఈ శ్రీనివాస్, డీఈలు విద్యాసాగర్, అబ్రహాం, రమణారావు తదితరులు ఘటనా స్థలిని సందర్శించారు. -
నిన్న గండి.. నేడు పైపులు
గండి కొట్టిన చెరువుకు అనుమతి లేకుండా పైపులు టీడీపీ నాయకుడి ఇష్టారాజ్యం విస్తుపోతున్న ఆయకట్టు రైతులు నీరు చెట్టు పనుల కోసం బరితెగించారని ఆరోపణలు సమృద్ధిగా నీరు ఉన్న సాగు నీటి చెరువుకు బుధవారం అక్రమంగా గండి కొట్టిన టీడీపీ నాయకులు గురువారం మరింత బరితెగించారు. ఎవరి అనుమతీ లేకుండానే పైపులు కూడా వేసే పని ప్రారంభించారు. ఈ చెరువులో నీరు చెట్టు పథకం కింద పనులు చేపట్టి నిధులు కాజేసేందుకే గండి కొట్టి విలువైన సాగునీటిని వృథా చేశారని, మిగిలి ఉన్న నీటిని కూడా బయటకు పంపేందుకే పైపులు వేస్తున్నారని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. చోడవరం: ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండానే వెంకన్నపాలెం సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కాశీవిశ్వేశ్వర సాగునీటి చెరువుకు గండికొట్టిన అధికార పార్టీ నాయకుడు గురువారం ఏకంగా పైపులు వేశాడు. ఈ సంఘటన అందరిలో చర్చనీయాంశమైంది. ఎవరికి నచ్చినట్టు వారు చెరువులకు గండికొట్టేసి వారికి నచ్చినట్టు పనులు చేసుకుంటే ప్రభుత్వ శాఖలు, అధికారులు ఎందుకో టీడీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే చెప్పాలని రైతులు అంటున్నారు. కాశీవిశ్వేశ్వర చెరువుకు గండి కొట్టడం, దిగువ ఆయకట్టు పంట భూములు మునిగిపోయిన విషయం ‘సాక్షి’లో వెలువడిన విషయం తెలిసిందే. ఈ చెరువుకు గండికొట్టిన విషయం గాని, చేస్తున్న పనులు గాని తమకు తెలియవని, అనుమతికూడాలేదని ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. అసలు గండి ఎందుకు కొట్టినట్టు, పైపులైన్లు ఎందుకు వేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల అనుమతి, పర్యవేక్షణ లేకుండా ఇక్కడ టీడీపీ నాయకులు ఎందుకు ఈ దుశ్చర్యకు దిగారనే విషయమే ఇప్పుడు ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. నీరుచెట్టు పనులకు చెరువులో నీటిని ఖాళీ చేయడానికే ఇదంతా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. చెరువు గట్టుకు గండికొట్టడమేకాకుండా ఇటీవల రూ.5 లక్షల జెడ్పీ నిధులతో ఈ చెరువుకు గట్టుకు సిమెంట్ లైనింగ్‌తో గోడ నిర్మించి, గట్టును పటిష్టం చేయగా ఆ గోడను కూడా కొంత కూలదోసి మరీ గట్టుకు గండికొట్టడం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమేనని అధికారులు అంటున్నారు. అధికారపార్టీ నాయకుడు ఎవరి అండదండలతో ఇందతా చేస్తున్నారో, దీనిపై ఇరిగేషన్ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలని ప్రజలు అంటున్నారు. -
'సిగరెట్లు, హుక్కాకు ఇక నో..'
దిహేగ్: వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ఈ సిగరెట్లు, హుక్కాను 18 ఏళ్లలోపువారికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. భవిష్యత్ యువకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెదర్లాండ్ అధికారులు తెలిపారు. ఈ రెండు వస్తువులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఇటీవల తెలిసిందని అందుకే చాలా కఠినంగా నిషేదాజ్ఞలు అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొగాకు రహితంగా ఉండే ఈ సిగరెట్ల వాడకం ద్వారా ఆరోగ్యాన్ని కొంత రక్షించుకోవచ్చని ఇన్నాళ్లు అనుకున్నా అవన్నీ అపోహలు అని తాము తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
ఎత్తిపోయిన ఎత్తిపోతల పథకం
వెల్దుర్తి : మండలంలోని కుకునూర్ హల్దీవాగులో 20 ఏళ్ల క్రితం రూ. 31 లక్షలు ఖర్చు చేసి ఎత్తి పోతల పథకాన్ని నిర్మించినా, అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, లబ్ధిదారుల అవగాహన లోపం అన్నీ కలగలిపి ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. ఫలితంగా 181 మంది రైతు కూలీల బతుకులకు ఆసరా లేకుండాపోయింది. కూలీలను రైతులను చేయాలని భూమి లేని ఎస్సీలను రైతులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం కుకునూర్ హల్దీవాగు ఒడ్డున ఉన్న 181 ఎకరాల సీలింగ్ భూమిని కుకునూర్, పంతుల్‌పల్లి, బస్వాపూర్ గ్రామాలకు చెందిన 181 మంది రైతులకు పంపిణీ చేసింది. నిరుపేద రైతులు ఈ భూముల్లో పంటలు పండించి అభివృద్ధి చెందడం కోసం 1992లో అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి కృషి ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం రాయితీపై రూ. 22 లక్షలు మంజూరు చేయించారు. ఆ డబ్బులతో 116 ఎకరాలను చదును చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు అవసరమైన డబ్బును కూడా ఎస్సీ కార్పొరేషన్ చెల్లించడంతో అధికారులు ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఐడీసీ సహకారంతో హల్దీవాగులో ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు బావులు తవ్వి రింగులు వేశారు. ఈ బావుల్లో 7.5 హెచ్‌పీ మోటర్లను బిగించి నీటి సరఫరా కోసం చదును చేసిన భూముల్లో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇక బతుకులు బాగుపడతాయని రైతులంతా భావించారు. కానీ సాగు సలహాలు ఇచ్చేవారు కరువవడంతో రైతులు ఆ పొలాన్నీ వృథా ఉంచేశారు. అలా కొన్ని రోజులు గడిచే సరికి విలువైన పైపులను దొంగలు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పైపులను ఎత్తుకెళ్లారు. అలాగే విద్యుత్ వైర్లు, ప్యానల్ బోర్డులు, స్టాటర్లు, 7.5 హెచ్‌పీ మోటర్లను సైతం చోరులు అపహరించారు. సంవత్సరాలు గడచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం చెట్లు, ముళ్ల పొదలతో అటవీ ప్రాంతంగా మారింది. ప్రస్తుతం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామంటున్న కేసీఆర్ సర్కార్ బీడుగా మారిన భూములను చదును చేసి సాగునీటి సౌకర్యం కల్పిస్తే సాగుకు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని, తద్వారా తమ బతుకులు బాగుపడతాయని రైతులు కోరుతున్నారు. బోర్లు వేస్తే సాగు చేసుకుంటాం తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన 181 ఎకరాల్లో బోర్లు వేసి మోటర్లు బిగిస్తే కలిసికట్టుగా శ్రమించి పంటలు సాగు చేసుకుంటామని రైతులు తెలిపారు. ప్రతి పది ఎకరాలకు ఓ బోరు వేసి, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు సాగుకు సలహాలు, సూచనలు ఇస్తే సిరులు పండిస్తామని రైతులు చెబుతున్నారు.