వెల్దుర్తి : మండలంలోని కుకునూర్ హల్దీవాగులో 20 ఏళ్ల క్రితం రూ. 31 లక్షలు ఖర్చు చేసి ఎత్తి పోతల పథకాన్ని నిర్మించినా, అది ఎందుకూ పనికిరాకుండా పోయింది. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, లబ్ధిదారుల అవగాహన లోపం అన్నీ కలగలిపి ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం లక్ష్యాన్ని నీరుగార్చారు. ఫలితంగా 181 మంది రైతు కూలీల బతుకులకు ఆసరా లేకుండాపోయింది.
కూలీలను రైతులను చేయాలని
భూమి లేని ఎస్సీలను రైతులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం కుకునూర్ హల్దీవాగు ఒడ్డున ఉన్న 181 ఎకరాల సీలింగ్ భూమిని కుకునూర్, పంతుల్‌పల్లి, బస్వాపూర్ గ్రామాలకు చెందిన 181 మంది రైతులకు పంపిణీ చేసింది. నిరుపేద రైతులు ఈ భూముల్లో పంటలు పండించి అభివృద్ధి చెందడం కోసం 1992లో అప్పటి రామాయంపేట ఎమ్మెల్యే అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి కృషి ఫలితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 శాతం రాయితీపై రూ. 22 లక్షలు మంజూరు చేయించారు.
ఆ డబ్బులతో 116 ఎకరాలను చదును చేశారు. అంతేకాకుండా విద్యుత్ శాఖకు అవసరమైన డబ్బును కూడా ఎస్సీ కార్పొరేషన్ చెల్లించడంతో అధికారులు ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలు ఏర్పాటు చేశారు. ఏపీఎస్‌ఐడీసీ సహకారంతో హల్దీవాగులో ఎత్తిపోతల పథకంలో భాగంగా రెండు బావులు తవ్వి రింగులు వేశారు. ఈ బావుల్లో 7.5 హెచ్‌పీ మోటర్లను బిగించి నీటి సరఫరా కోసం చదును చేసిన భూముల్లో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఇక బతుకులు బాగుపడతాయని రైతులంతా భావించారు. కానీ సాగు సలహాలు ఇచ్చేవారు కరువవడంతో రైతులు ఆ పొలాన్నీ వృథా ఉంచేశారు.
అలా కొన్ని రోజులు గడిచే సరికి విలువైన పైపులను దొంగలు ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పైపులను ఎత్తుకెళ్లారు. అలాగే విద్యుత్ వైర్లు, ప్యానల్ బోర్డులు, స్టాటర్లు, 7.5 హెచ్‌పీ మోటర్లను సైతం చోరులు అపహరించారు. సంవత్సరాలు గడచిపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతం చెట్లు, ముళ్ల పొదలతో అటవీ ప్రాంతంగా మారింది. ప్రస్తుతం దళితులకు మూడెకరాలు పంపిణీ చేస్తామంటున్న కేసీఆర్ సర్కార్ బీడుగా మారిన భూములను చదును చేసి సాగునీటి సౌకర్యం కల్పిస్తే సాగుకు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని, తద్వారా తమ బతుకులు బాగుపడతాయని రైతులు కోరుతున్నారు.
బోర్లు వేస్తే సాగు చేసుకుంటాం
తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన 181 ఎకరాల్లో బోర్లు వేసి మోటర్లు బిగిస్తే కలిసికట్టుగా శ్రమించి పంటలు సాగు చేసుకుంటామని రైతులు తెలిపారు. ప్రతి పది ఎకరాలకు ఓ బోరు వేసి, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు సాగుకు సలహాలు, సూచనలు ఇస్తే సిరులు పండిస్తామని రైతులు చెబుతున్నారు.
ఎత్తిపోయిన ఎత్తిపోతల పథకం
Published Mon, Sep 15 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement
Advertisement