
బుట్టాయగూడెం : పరిణయ సమయంలో నూరేళ్లపాటు తోడుగా ఉంటానని, ప్రేమగా చూసుకుంటామని వాగ్దానం చేసిన భర్తలే కాలయముళ్లుగా మారి హతమార్చి జీడిమామిడి తోటలో పూడ్చిపెట్టిన సంఘటన బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మృతురాలు సావిత్రి తల్లి కొండా గంగమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో హత్యా సంఘటన బయటపడింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌ఎన్‌డి పేటకు చెందిన గంగమ్మ తన కుమార్తె సావిత్రిని అదే గ్రామానికి చెందిన రామాంజనేయులుకు ఇచ్చి వివాహం చేసింది.
కొన్నేళ్లు బాగానే ఉన్నా అనంతరం భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదేవిధంగా పులిబోయిన మంగతాయారు (సావిత్రి కూతురు/గంగమ్మ మనవరాలు), భర్త నాగరాజుల మధ్య కూడా గొడవలు జరిగేవి. ఈ గొడవలపై కేసులు పెట్టుకొని కోర్టుకు కూడా వెళ్లారు. గత ఏడాది నవంబర్ 8వ తేదీ నుంచి ఇళ్ళ సావిత్రి, పులిబోయిన మంగతాయారులు కనిపించకుండా పోయారు. వీరి ఆచూకీ కోసం బంధువుల ఇళ్లకు తిరిగి వాకబు చేసినా వారు కనిపించకపోవడంతో సావిత్రి తల్లి కొండా గంగమ్మ పోలవరం పోలీస్‌స్టేషన్‌లో నవంబర్ 28న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సావిత్రి భర్త రామాంజనేయులు, మంగతాయారు భర్త నాగరాజులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరపగా వారిద్దరు నేరం అంగీకరించారు. వారిచ్చిన సమాచారం మేరకు శనివారం బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపంలోని జీడితోటలో ఒక ప్రదేశంలో తవ్వి సావిత్రి, మంగతాయారుల మృతదేహాలను వెలికితీశారు.
భార్యభర్తల మధ్య తరచూ వస్తున్న గొడవల నేపథ్యంలో కక్షతో రామాంజనేయులు తన భార్య సావిత్రిని(40), నాగరాజు తన భార్య మంగతాయారును(19) ఒకేరోజు పథకం ప్రకారం హత్యచేసినట్లు తమ విచారణలో తేలిందని సీఐ ఎం.రమేష్‌బాబు తెలిపారు. డీఎస్పీ ఏటీవీ రవికుమార్, ఎస్సైలు కె.శ్రీహరి, అల్లు దుర్గారావు, తహసీల్దార్ జి.ఉదయ్‌భాçస్కర్ తదితరుల సమక్షంలో మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. తొలుత పోలీసులు ఎర్రాయిగూడెం చేరుకున్నారు. తర్వాత జీడిమామిడితోటలో తవ్వకాలు జరుగుతుంటే ఏమి జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో పడ్డారు. తవ్వకాల్లో ఒక్కసారిగా రెండు మృతదేహాలు లభ్యం కావడంతో ఉలిక్కిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment