కొన్ని నేరాలు ఘోరాతి ఘోరంగా.. భయంకరంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉంటాయి!
హింటర్‌కైఫెక్ మర్డర్స్ అలాంటివే! జర్మనీ అపరిష్కృత నేరాల్లో ఇదీ ఒకటి.
సుమారు 100 ఏళ్ల నాటి ఆ కథే.. ఈ వారం మన ముందున్న మిస్టరీ.
జర్మనీలోని మ్యూనిక్‌కి 43 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ హింటర్‌కైఫెక్ అనే గ్రామీణ అటవీ భూభాగం. అక్కడ ఆండ్రీస్ గ్రూబర్(64) అనే మోతుబరి అతి పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అతని భార్య కాజిలియా గ్రూబర్(73), వాళ్ల వితంతు కూతురు విక్టోరియా(35), ఆమె ఇద్దరు పిల్లలు జూనియర్ కాజిలియా(7), జోసెఫ్(2) అంతా కలసి ఆ ఇంట్లోనే ఉండేవారు. వారికి అన్ని పనులు చేసిపెట్టడానికి ఓ పనిమనిషి వాళ్లతోనే ఉండేది. అయితే 1921 అక్టోబర్‌లో ఆమె ఉన్నట్టుండి ఆ ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే ఆమె ‘ఆ ఇంటి అటక మీద ఏవో స్వరాలు, శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంగా ఉంటోంది’ అంటూ ప్రచారం చేసింది.
అదే విషయాన్ని ఆండ్రీస్ కూడా చాలామందితో చెప్పేవాడు. పైగా ఇంటి వెనుకవైపు పడిన మంచు మీద ఏవో విచిత్రమైన అడుగులు కనిపించాయని, అవి ఇంటివైపు వేసిన అడుగులే కానీ బయటకు వెళ్లిన అడుగులు కావనీ, లేవనీ అతడు చెప్పాడు. అది విన్నవారంతా ‘ఇంట్లో ఓ తుపాకీ ఉంచుకోవడం మంచిది’ అని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆండ్రీస్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత మారియా(45) అనే ఆవిడ ఆ ఇంట్లో పనికి కుదిరింది. గ్రామస్థులతో కలివిడిగా ఉండే ఆ కుటుంబం.. 1922 మార్చి 31 తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆదివారం రోజున చర్చ్‌కి రాలేదు. సోమవారం జూనియర్ కాజిలియా స్కూల్లోనూ కనిపించలేదు. పోస్ట్‌మ¯Œ బట్వాడా చేసిన ఉత్తరాలూ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి.
దాంతో గ్రామస్థుల్లో అనుమానం మొదలైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. ఆండ్రీస్ ఇంట్లోనూ వెదకడం మొదలుపెట్టారు. బెడ్‌రూమ్‌లో కొత్త పనిమనిషి మారియా రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంది. రెండేళ్ల జోసెఫ్ తన ఉయ్యాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. మిగిలిన వారు ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పోలీసులూ వచ్చారు. కాసేపటికి ధాన్య కొటారంలో నాలుగు శవాలు వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి.. ఎండు గడ్డి కప్పి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ శవాలను చూస్తే అక్కడున్నవారందరి వెన్నులో వణుకుపుట్టింది.
పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. ఆ హత్యలు చేయడానికి మట్టాక్ (పదునైన వ్యవసాయ పరికరం)ను ఉపయోగించినట్లు తేలింది. ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు? ఏ సమయంలో చనిపోయారు? అన్నీ లెక్కలు తేలాయి. ఆ క్రమంలోనే ఏడేళ్ల కాజిలియా చావు అందరినీ కలచివేసింది. కిల్లర్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ పాప.. చాలా సమయం ఆ శవాల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడిందని.. చనిపోయే ముందు చాలా భయపడిందని తేలింది. పైగా హత్యల తర్వాత కూడా కిల్లర్.. అదే ఇంట్లో వంట చేసుకుని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
దాంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వందమందికి పైగా అనుమానితుల్ని విచారించారు. కానీ ఫలితం లేదు. ఈ కేసులో మరో విషాదకరమైన విషయమేంటంటే.. కొత్త పనిమనిషి ఆ ఇంటికి వచ్చిన రాత్రే ఆమె హత్యకు గురైంది. అయితే గతంలో ఆండ్రీస్ మాటలను గుర్తు చేసుకున్న చాలామంది.. హంతకుడు చాలా కాలంగా ఆ ఇంటి అటకపైన ఉన్నాడని నమ్మారు. విచారణలో భాగంగా ఆండ్రీస్ కుటుంబ చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆండ్రీస్.. కూతురు విక్టోరియాతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని, అందుకే 1915లో ఆ ఇద్దరికీ జైలు శిక్ష విధించారని, అయినా వాళ్లలో మార్పు రాలేదని.. జోసెఫ్ వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డేనని ఇరుగుపొరుగు చెప్పుకొచ్చారు.
మరికొంత మంది.. జోసెఫ్ తండ్రి ఆండ్రీస్ కాదని.. ఆ ఇంటికి సమీపంలో నివసించే లోరెంజ్ బౌర్ అనే వ్యక్తి అని వాదించారు. దాంతో జోసెఫ్ అసలు తండ్రి ఎవరో నేటికీ తేలలేదు. తదుపరి పరీక్ష కోసం బాధితుల తలలను వేరు చేసి, వాటిని మ్యూనిక్‌కి పంపినట్లు నివేదిక రాసి.. అందరినీ ఒకేచోట ఖననం చేశారు. అయితే ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి ఓ డాక్టర్.. ఆ తలలను అంజనం వేసే వ్యక్తుల దగ్గరకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు మాత్రం.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పుర్రెలు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హంతకుడు ఎవరో తెలియకపోవడంతో చాలా ఊహా గానాలు మొదలయ్యాయి.
నిజానికి విక్టోరియా భర్త గాబ్రియేల్ ఒక సైనికుడు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు. అయితే గాబ్రియేల్ చనిపోలేదని.. తిరిగి వచ్చాడని.. విక్టోరియా పాపాలు తెలుసుకుని.. ఈ ఊచకోతలకు తెగబడ్డాడనేది ఓ వర్గం వాదన. మరోవైపు.. ఈ ఘోరానికి తెగబడింది లోరేంజ్ అని.. విక్టోరియా తనతో ఉంటూనే తండ్రితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఇలా చేశాడనేది మరికొందరి ఊహాగానం. అయితే 1919లో ఓ వృద్ధురాలు పోలీస్ అధికారులను కలసి.. ‘ఈ హత్యలను నా మాజీ భూస్వామి చేశాడు. మొత్తం సమాచారం అతడితోనే ఉంది’ అని తెలిపింది. అయితే ఆ ప్రధాన నిందితుడు అప్పటికి ప్రాణాలతో లేడు.
2007లో జర్మనీ పోలీసు అకాడమీలోని విద్యార్థులు.. ఎలాగైనా ఈ కేసుని క్లోజ్ చెయ్యాలని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి.. ఒక అనుమానితుడ్ని హంతుకుడిగా గుర్తించారు. అయితే అతడు కూడా అప్పటికి ప్రాణాలతో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని.. అతడి పేరునూ బహిర్గతం చేయలేదు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment