
ప్రతికాత్మక చిత్రం
సిడ్నీ: దశాబ్దాలు గడిచిన చిక్కువీడని ఓ మిస్టరీ కేసుతో ఆస్ట్రేలియన్ పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. చివరికి చేసేదేమి లేక శనివారం రికార్డు రివార్డు ప్రకటించారు. 1980లో మెల్ బోర్న్‌లో జరిగిన వరుస మహిళల హత్యకేసును ఛేదించడం కోసం ఏకంగా రూ.30 కోట్ల రికార్డు రివార్డును ఆఫర్ చేశారు. 1980-1981 మధ్య కాలంలో దుండగలు 14 నుంచి 73 ఏళ్ల వయసుగల ఆరుగురు మహిళలను హతమార్చారు. ఆనాటి నుంచి ఈ కేసు మిస్టరీగా మారింది.
ఈ కేసును ఛేదించేందుకు నడుంబిగించిన విక్టోరియా పోలీసులు సమాచారం అందించినా, మిస్టరీ ఛేదించినా ఒక్కో కేసుకు రూ.5 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఇది ఆస్ట్రేలియన్ పోలీసులు ప్రకటించిన రెండో అతిపెద్ద రివార్డని తెలిపారు. అంతేగాకుండా ఎవరికైనా మిస్టరీలు ఛేదించే మేధాశక్తి ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు. అయితే ఈ రివార్డుపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన'చందంగా పోలీసులు తీరుందని విమర్శిస్తున్నారు.