githam university
-
చంద్రబాబు, పవన్‌కల్యాణే దండుపాళ్యం బ్యాచ్: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలోనే విశాఖలో భూ దందాలు జరిగాయన్నారు. గీతం కాలేజీ ఆక్రమణలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి మండిపడ్డారు. ఎలాంటి అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని, టీడీపీ అక్రమాలపై గతంలో పవన్ ఎందుకు నిలదీయలేదంటూ అమర్నాథ్ దుయ్యబట్టారు. ‘‘ప్రభుత్వ నిర్మాణాలపై పవన్ అభ్యంతరం ఏంటి?. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు రాకూడదనే పవన్ తాపత్రయం. చంద్రబాబు, పవన్‌కల్యాణే దండుపాళ్యం బ్యాచ్. పవన్ జ్ఞానం వచ్చే పుస్తకాలు చదివుంటే బాగుండేది. తన అన్నయ్య చెప్పినట్టు ఫేస్ లెప్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేది. బాబు బంధువు కాబట్టే గీతం వర్శిటీ అక్రమాలు పవన్‌కు కనపడలేదు’’ అంటూ మంత్రి అమర్నాథ్ నిప్పులు చెరిగారు. చదవండి: శ్రీగిరి సాక్షిగా 'అతనే' ద్రోహి! -
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సబబే
సాక్షి, అమరావతి: విశాఖపట్నం గీతం విద్యాసంస్థలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరపడానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వ భూముల్లో తాము చేపట్టిన నిర్మాణాల నుంచి తమను ఖాళీ చేయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న గీతం అభ్యర్థనను తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సబబుగానే ఉన్నాయని, అందులో ఏ రకంగానూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తదుపరి కట్టడాలు, కూల్చివేతలు వద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు గీతం ప్రయోజనాలను కాపాడేలా ఉన్నాయని, అలాంటప్పుడు ఆ ఉత్తర్వులు ఎలా తప్పవుతాయని ప్రశ్నించింది. తదుపరి ఏం ఉత్తర్వులు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లాలని గీతం యాజమాన్యానికి స్పష్టం చేసింది. గీతం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిష్కరిస్తూ జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమిని పెద్దమొత్తంలో ఆక్రమించిన గీతం యాజమాన్యం పలు నిర్మాణాలు చేపట్టింది. కొన్నింటిని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీనిపై గీతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని రెవెన్యూ అధికారులను, కూల్చివేసినచోట ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గీతం యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాలపై గీతం యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై మంగళవారం జస్టిస్ రాకేశ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మీకు అనుకూలంగా ఇచ్చినా అభ్యంతరమా?: గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ పెద్దసంఖ్యలో పోలీసులు వచ్చి తమ నిర్మాణాలను కూల్చేశారని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. సింగిల్ జడ్జి మీకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు కదా, మీకు అభ్యంతరం ఏముంది అని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి కేవలం తదుపరి కూల్చివేతలు వద్దని మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారని రుద్రప్రసాద్ చెప్పగా, అంతకు మించిన సానుకూల ఉత్తర్వులు ఏం ఇవ్వగలమని మళ్లీ ప్రశ్నించింది. తమ నిర్మాణాల నుంచి తమను ఖాళీచేయించేందుకు ప్రయత్నిస్తూ థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఆ దిశగా చర్యలు తీసుకోకుండా అధికారులను నియంత్రిస్తూ ఆదేశాలివ్వాలని రుద్రప్రసాద్ కోరారు. ధర్మాసనం అందుకు నిరాకరించింది. తాము అలాంటి ఆదేశాలు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. తదుపరి ఏం ఆదేశాలు కావాలన్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ అప్పీల్‌పై విచారణ జరపాలంటే సింగిల్ జడ్జి వద్ద ఉన్న రిట్ పిటిషన్‌ను కొట్టేయించుకురావాలని తెలిపింది. సింగిల్ జడ్జి మంచి ఉత్తర్వులిస్తే, దానిపై అభ్యంతరం చెబుతూ అప్పీల్ దాఖలు చేయడం ఏమిటని నిలదీసింది. తాము ఈ అప్పీల్‌ను విచారించబోమని తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వ భూమిలో కట్టిన అక్రమ కట్టడాలనే కూల్చివేశామని చెప్పారు. తమ భూమిని తాము స్వాధీనం చేసుకోవడాన్ని గీతం తప్పుపడుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. -
మేం కోరుకున్న ఉత్తర్వులివ్వలేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖ పరిసరాల్లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంపై హైకోర్టును ఆశ్రయించిన ‘గీతం’ యాజమాన్యం సింగిల్ జడ్జి తాము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వలేదంటూ సోమవారం రాత్రి హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. కూల్చివేతకు ముందున్న పరిస్థితిని కొనసాగించేలా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదని, కేవలం తదుపరి కూల్చివేతలు చేపట్టవద్దని మాత్రమే ఆదేశాలు ఇచ్చారంటూ ‘గీతం’ కార్యదర్శి బీవీ మోహనరావు ఈ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అప్పుడు సమ్మతించి ఇప్పుడు అప్పీల్ దారుణం.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘గీతం’ సమ్మతి మేరకే సింగిల్ జడ్జి ఆ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. అప్పుడు సమ్మతి తెలియచేసి ఇప్పుడు ఆ ఉత్తర్వులు తమకు సమ్మతం కాదంటూ అప్పీల్ దాఖలు చేయడం దారుణమన్నారు. ఈ అప్పీల్‌కు విచారణార్హతే లేదన్నారు. ఎవరు ప్రోత్సహిస్తున్నారో అందరికీ తెలుసు.. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో హైకోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు తెచ్చుకుంటామని గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ చెబుతున్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఏఏజీ పొన్నవోలు ప్రశ్నించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం తమకు అప్పీల్ కాగితాలు అందచేయకుండా నంబర్ కేటాయించడానికి వీల్లేదని, గీతం విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘హైకోర్టులో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ప్రతివాదుల వైపు న్యాయవాదులకు కాగితాలు ఇవ్వకుండా అప్పీల్‌కు నంబర్ అయిందంటే, అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించింది. కబ్జా భూమిని ఇవ్వాలంటోంది.. ఓ అనుబంధ పిటిషన్లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టుతో పాటు ఉమ్మడి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పాయని పొన్నవోలు నివేదించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా, ఆ భూమిని ఇచ్చేయాలని గీతం కోరుతోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అంతకు ముందు గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలను కూల్చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
విద్య కన్నా భూ దాహమే ఎక్కువ
మద్దిలపాలెం (విశాఖ): విద్యా దానం కన్నా.. గీతం యూనివర్సిటీలో భూ దాహమే ఎక్కువని హైకోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం వాస్తం కాదా..అని, సొంత భూమి 30 ఎకరాలున్నా దాన్ని రియల్ ఎస్టేట్ కోసం దాచుకుని ప్రభుత్వ భూమి 40 ఎకరాలకు పైగా దోచుకోవాలని ‘గీతం’ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రభుత్వం అడ్డుకుందని, దీన్ని ప్రజలు హర్షిస్తూ స్వాగతిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. గీతం వర్సిటీపై చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రేమ ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం కరెక్టేనా అని ప్రశ్నించారు. నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► తప్పులు చేసి కూడా సానుభూతి పొందాలనుకునే దిక్కుమాలిన ఆలోచన టీడీపీకి మాత్రమే వస్తుంది. ► ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గీతం యాజమాన్యం ఆక్రమించుకున్న రూ.800 కోట్లపై చిలుకు విలువైన 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీనిపై గీతం యాజమాన్యం కోర్టుకెళ్లగా.. కోర్టు తాత్కాలికంగా ఒక ఆర్డర్ ఇస్తే.. దానిని కూడా వక్రీకరిస్తున్నారు. టీడీపీ, వారి అనుకూల మీడియా ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ► గీతం వేసిన రిట్ పిటిషన్లోనే అది ప్రభుత్వ భూమి అని ఉంది. ఇంతకన్న రుజువు ఇంకేం కావాలి? ► గీతం యాజమాన్యం 2020 ఆగస్ట్ 3న ఎండాడ గ్రామ పరిధిలో గల 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తమకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాసింది. దీని అర్థం ఆ భూమి వారిది కాదనేగా..! -
ఐదేళ్లలో ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, విశాఖపట్నం: గీతం విద్యా సంస్థల ఆక్రమిత భూముల్ని ప్రభుత్వం స్వాదీనం చేసుకోవడాన్ని ప్రజలందరూ హర్షిస్తుంటే చంద్రబాబు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు గీతం గుప్పిట్లో ఉన్నాయని అధికారులు నివేదికలిచ్చినప్పుడు చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలా అని.. ఎందుకు గీతం సంస్థలకు బదలాయించలేదో ప్రజలకు చంద్రబాబు బహిర్గతంగా చెప్పగలరా? అని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాల్ని దోచుకున్న వారిని వెనకేసుకొస్తూ నీచరాజకీయాలు మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. -
అప్పటివరకు కట్టకండి.. కూల్చకండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ, యండాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) విద్యా సంస్థల యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ వరకు గీతం నిర్మాణాలను కూల్చొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గీతం యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకుని అందులో చేసిన పలు నిర్మాణాలను అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చి కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో గీతం యాజమాన్యం శనివారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఆదివారం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌రెడ్డి తన ఇంటి వద్ద వాదనలు విన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గీతంకు విద్యా దాహానికి బదులు భూదాహం పట్టుకుందన్నారు. తమ భూముల్లోకి తాము వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. గీతం తరఫు న్యాయవాది రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అధికారులు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి అదనపు డాక్యుమెంట్ల సమర్పణకు గీతంకు అనుమతినిచ్చారు. -
‘గీతం’పై సీబీఐ విచారణ జరపాలి
సీతమ్మధార (విశాఖ ఉత్తరం): విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమాల పర్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది. 71 ఎకరాలకు పైగా చేజిక్కించుకున్నది చాలక పక్కనున్న ప్రభుత్వ భూమి 40 ఎకరాలనూ కాజేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పలు ప్రజా సంఘాలు నినదిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తుంటే ఉపేక్షించరాదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ అండతో కబ్జాల పర్వం కొనసాగించారని, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, వైద్య వ్యాపారం ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సోమవారం ఆందోళన నిర్వహించింది. యాజమాన్యాన్ని అరెస్టు చేసి, సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఎస్పీ విమల్ ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున విదేశాల నుంచి రూ.కోట్లాది నిధులు, విరాళాలు పొందుతూ.. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన గీతంపై అంతర్గత ఆడిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సంస్థ అధినేత విశాఖ ఎంపీగా పనిచేసిన సమయంలో విశాఖ నగరాభివృద్ధికి కేటాయించిన నిధులను సైతం గీతం వర్సిటీకి దారి మళ్లించారని, గీతం ఇచ్చిన నకిలీ డిగ్రీలతో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సముద్ర తీర ప్రాంతంలో భారీ కట్టడాలు, భవంతులు ఉండరాదని హైకోర్టు ఉత్తర్వులుండగానే అదే హైకోర్టులో అరగంటలో అక్రమ కట్టడాలను కూల్చివేయరాదని ఏవిధంగా స్టే తెచ్చుకున్నారో విచారణ జరపాలన్నారు. గీతం వ్యవహారాలపై హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీబీఐ ఎస్పీ తెలిపారన్నారు. -
రేపటి వరకు తదుపరి కూల్చివేతలొద్దు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, రిషికొండ, యందాడ గ్రామాల పరిధిలో తమ విద్యా సంస్థలకు చెందిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. శనివారం రాత్రి అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి సోమవారం ఉదయం వరకు తదుపరి ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను ఆదివారానికి వాయిదా వేశారు. -
బుద్ధుందా.. గాడిద కొడుకుల్లారా..
సాక్షి, విశాఖపట్నం/కొమ్మాది (భీమిలి): మాజీమంత్రి, టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం అందుకున్నారు. పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గీతం విద్యా సంస్థలు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని కట్టిన అడ్డగోలు నిర్మాణాల్ని తొలగించిన నేపథ్యంలో గీతం కళాశాలలో టీడీపీ నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘చదువు చెప్పే విద్యాసంస్థను కూల్చేస్తారా? పడగొట్టిన వాడెవడండీ. బుద్ధుందా ఆ గాడిద కొడుకులకు.. ఆర్డీవో దగ్గరుండి పడగొట్టాడు. ముందు ఆర్డీవో, ఆ నా..... సస్పెండ్ చేయాలి’ అంటూ నోటికొచి్చనట్టు మాట్లాడారు. ‘గీతం కాలేజీని ధ్వంసం చేయడమేంటి. అధికారులకు జ్ఞానం లేదా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. కోర్టు పరిధిలో ఉన్న గీతం కాలేజీ నిర్మాణాలను తొలగించిన ఆర్డీవో, తహసీల్దార్.. ఆ నా..... సస్పెండ్ చెయ్యాలి’ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆ భూముల్ని అందరూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. తమకిస్తే అభివృద్ధి చేసుకుంటామంటూ అప్పటి ముఖ్యమంత్రిని దివంగత ఎంవీఎస్ మూర్తి కోరితే కేటాయించారని అయ్యన్న చెప్పడం గమనార్హం. గీతం యూనివర్సిటీ నిర్మాణాలను తొలగించడం ముమ్మాటికి కక్షపూరిత చర్య అన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గీతం కళాశాలపై ప్రభుత్వ కక్ష సాధింపును అంతా ఖండించాలన్నారు. దమ్ముంటే విశాఖ నగరంలో అనధికార నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. ‘అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో’ విధి నిర్వహణలో ఉన్న ఆర్డీవో, తహశీల్దార్లను నోటికొచ్చినట్టు దూషిస్తే సహించేది లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. గీతం విద్యాసంస్థల ఆక్రమణలపై చర్యలు తీసుకున్న రెవెన్యూ అధికారులపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని అసోసియేషన్ సహాధ్యక్షుడు పీవీ రత్నం, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖరరావు తీవ్రంగా ఖండించారు. యూనియన్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ మాట్లాడుతూ అయ్యన్న నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. ఇలా ఉద్యోగుల్ని బెదిరించడం చట్టరీత్యా నేరమన్న విషయం ఓ మాజీ మంత్రికి తెలియకపోవడం గర్హనీయమని అన్నారు. బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదనీ, ఉద్యోగుల మనోభావాల్ని దెబ్బతీసే వారికి సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా!
సాక్షి, విశాఖపట్నం: ‘గీతం యూనివర్సిటీకి జాతిపిత మహాత్మాగాంధీ పేరు పెట్టి భూ కబ్జాలకు పాల్పడతారా? భూ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకుంటే టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, మరో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెంలో వారు మీడియాతో మాట్లాడారు. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాల భూములను గీతం యాజమాన్యం ఆక్రమించిందని.. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తెల్లవారుజామున కూల్చేశారనడం సబబు కాదన్నారు. ఐదు నెలల క్రితమే గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ సర్వేయర్ సర్వే జరిపి.. 40 ఎకరాలు కబ్జా అయినట్టు తేల్చారన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వానికి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఎలివేషన్ (బదలాయింపు కోసం) దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒకటి, రెండు ఎకరాల వరకు ఎలివేషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తుందని.. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాలు ఆక్రమించుకుంటే ఎలివేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినేట్ సమావేశంలో గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం ప్రస్తావన రాగా.. అది తమ కుటుంబానికి సంబంధించిన అంశమని చెప్పిన చంద్రబాబు సమావేశం నుంచి బయటికి వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు. 2017లో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖలో జరిగిన భూకుంభకోణాన్ని వెలికి తీశామని గుర్తు చేశారు. అప్పుడు కంటితుడుపు చర్యగా సిట్ దర్యాప్తునకు ఆదేశించి.. కేసును నీరుగార్చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుంభకోణంపై సిట్ ఏర్పాటైందని.. కోవిడ్ కారణంగా దర్యాప్తు కొంత ఆలస్యమైందని తెలిపారు. భూకుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాలకృష్ణతో ఉన్న బంధుత్వం కారణంగా గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణల్ని బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని, హత్యలు చేసిన వారినే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకున్నారని, ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న అచ్చెన్నాయుడును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు. -
టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం
సాక్షి , విశాఖపట్నం/కొమ్మాది: గీతం విద్యా సంస్థల అక్రమాలపై విశాఖ జిల్లా రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత టీడీపీ ప్రభుత్వం అండతో అడ్డగోలుగా ఎండాడ, రుషికొండ పరిసర ప్రాంతాల భూముల్ని ఆక్రమించుకున్న ‘గీతం’కు చెక్ పెట్టడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. భూముల్ని ఆక్రమించి గీతం విశ్వవిద్యాలయం నిర్మించిన రక్షణ గోడ, గ్రావెల్ బండ్, గార్డెనింగ్ తదితర అక్రమ నిర్మాణాల్ని శనివారం రెవిన్యూ అధికారులు తొలగించారు. ఆర్డీవో పెంచల్ కిశోర్, నార్త్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది, పోలీసులు గీతం క్యాంపస్‌కు తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుని ఉదయం 11.30 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. 40.51 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, అందులో 38.53 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లోని 18.53 ఎకరాలు, రుషికొండలో సర్వే నంబర్ 34, 35, 37, 38లో 20 ఎకరాల భూమి ఉంది. కోర్టు కేసుల పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన భూముల్లోని అక్రమ నిర్మాణాల్ని కూలగొట్టారు. స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రభుత్వ భూములుగా బోర్డులు పెట్టారు. టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం ► రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్ 17/1, 5, 17/7 నుంచి 28 వరకు 71.15 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు ఇచ్చారు. గీతం విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూములు ఇవ్వాలని 1981లో అప్పటి ప్రభుత్వాన్ని గీతం యజమాని, టీడీపీ నేత, బాలకృష్ణ వియ్యంకుడు దివంగత ఎంవీఎస్ మూర్తి కోరారు. ► ఈ భూములపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆ«ధీన పత్రాలు దక్కించుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ ఆ స్థలాన్ని విద్యా సంస్థకు అప్పగించింది. ఆ తర్వాత ఈ సంస్థ కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది. ► గీతం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 14 ఎకరాల్లో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ► 1998 జూన్ 12న అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.34,94,200 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేలా చక్రం తిప్పి.. కారుచౌకగా ఆ భూముల్లో 49 ఎకరాలను గీతంకు అడ్డగోలుగా కట్టబెట్టేసింది. మిగిలిన 8.15 ఎకరాల భూమి కూడా ప్రస్తుతం ‘గీతం’ ఆధీనంలోనే ఉంది. పక్కనున్న 40 ఎకరాలపై కన్ను ► 71.15 ఎకరాలను తన చేతుల్లో ఉంచుకున్నది చాలక, పక్కనే ఉన్న 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిపై ‘గీతం’ కన్ను పడింది. క్రమక్రమంగా ఆక్రమణల పర్వానికి తెరతీసింది. ► అధికారులు ఆక్రమణలను గుర్తించిన ప్రతిసారీ.. కోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ దాఖలు చేయడం గీతం యాజమాన్యానికి పరిపాటిగా మారింది. ► సర్వే నంబర్ 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని ప్రభుత్వం వీఎంఆర్డీఏ, ఇగ్నో, సోషల్ వెల్ఫేర్, ఐటీడీఏ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఆదాయపు పన్ను శాఖ తదితర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. గీతం సంస్థ దీనిపై కూడా కోర్టుకు వెళ్లింది. ► మార్కెట్ ధర ప్రకారం ఈ భూమిని కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం సూచించినా, గీతం యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఐదు నెలల క్రితమే నోటీసులు గీతం క్యాంపస్ పరిధిలో 40.51 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించాం. వారు బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నా, ప్రభుత్వం ఆమోదించ లేదు. ఖాళీగా ఉన్న స్థలాల్ని ముందుగా స్వాధీనం చేసుకున్నాం. 5 నెలల క్రితమే ఆక్రమణలపై యాజమాన్యం సమక్షంలో సర్వే నిర్వహించి, మార్కింగ్ చేసి, నోటీసులిచ్చాం. ఆక్రమించిన భూముల్లో శాశ్వత భవనాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మార్కింగ్ చేశాం. త్వరలో ఆ ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకుంటాం. – పెంచల్ కిశోర్, ఆర్డీవో -
మెట్లపైకి దూసుకెళ్లే బైక్..
గీతం యూనివర్సిటీ విద్యార్థుల తయారీ పటాన్చెరు: మెట్లపైకి దూసుకెళ్లే బైక్‌ను గీతం యూనివర్సిటీ మెకానికల్ విద్యార్థులు తయారుచేశారు. ఆ బైక్‌ను పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో గురువారం ప్రదర్శించి ప్రయోగాత్మకంగా నడిపి, బైక్ విశేషాలను వివరించారు. ఇలాంటి ఆల్‌టెరైన్ వెహికల్స్ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో వాడతారని చెప్పారు. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనేందుకు తాము ఈ బైక్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఆ పోటీల్లో ఎనిమిది రౌండ్లు ఉంటాయని వారు తెలిపారు. తొలి రౌండ్లో ఎత్తయిన ప్రాంతం నుంచి బైక్‌ను జారవిడుస్తారని, ఆ తర్వాత గంటలోపు ఆ బైక్‌ను ఆరుగురు విద్యార్థులు కలసి విడదీసి బిగించాల్సి ఉంటుందన్నారు. బ్రేక్టెస్ట్, యాక్సిలేటర్, స్టీరింగ్ అలైన్మెంట్, యాన్యురెన్స్, టెక్నికల్ ఇన్స్పెక్షన్తోపాటు 15 లీటర్ల పెట్రోల్‌తో నాలుగు గంటలు నిర్విరామంగా నడపాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో నెగ్గిన వారిని విజేతలుగా ప్రకటిస్తారని ఆయన వివరించారు. అందుకు తగినట్లుగానే ఆ బైక్‌ను తయారు చేశామన్నారు. ఈ నాలుగు చక్రాల వాహనం రైతులకు, సైనికులకు బాగా ఉపయోగపడుతుందన్నారు. యూనివర్సిటీ వీసీ ఈ బైక్‌ను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.