మెట్లపైకి దూసుకెళ్లే బైక్..
గీతం యూనివర్సిటీ విద్యార్థుల తయారీ
పటాన్‌చెరు: మెట్లపైకి దూసుకెళ్లే బైక్‌ను గీతం యూనివర్సిటీ మెకానికల్ విద్యార్థులు తయారుచేశారు. ఆ బైక్‌ను పటాన్‌చెరు మండలం పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో గురువారం ప్రదర్శించి ప్రయోగాత్మకంగా నడిపి, బైక్ విశేషాలను వివరించారు. ఇలాంటి ఆల్‌టెరైన్ వెహికల్స్ అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో వాడతారని చెప్పారు. త్వరలో జాతీయస్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొనేందుకు తాము ఈ బైక్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఆ పోటీల్లో ఎనిమిది రౌండ్లు ఉంటాయని వారు తెలిపారు.
తొలి రౌండ్‌లో ఎత్తయిన ప్రాంతం నుంచి బైక్‌ను జారవిడుస్తారని, ఆ తర్వాత గంటలోపు ఆ బైక్‌ను ఆరుగురు విద్యార్థులు కలసి విడదీసి బిగించాల్సి ఉంటుందన్నారు. బ్రేక్‌టెస్ట్, యాక్సిలేటర్, స్టీరింగ్ అలైన్‌మెంట్, యాన్యురెన్స్, టెక్నికల్ ఇన్‌స్పెక్షన్‌తోపాటు 15 లీటర్ల పెట్రోల్‌తో నాలుగు గంటలు నిర్విరామంగా నడపాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీల్లో నెగ్గిన వారిని విజేతలుగా ప్రకటిస్తారని ఆయన వివరించారు. అందుకు తగినట్లుగానే ఆ బైక్‌ను తయారు చేశామన్నారు. ఈ నాలుగు చక్రాల వాహనం రైతులకు, సైనికులకు బాగా ఉపయోగపడుతుందన్నారు. యూనివర్సిటీ వీసీ ఈ బైక్‌ను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.