![Star Actor Today Also Not Use Mobile Phone, Who Failed Tenth Class](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Not-Use-Mobile-Phone.jpg.webp?itok=i0xmHHYY)
మీరు ఇలాంటి హీరోను అరుదుగా చూస్తారు.. బహుషా భవిష్యత్‌లో కనిపించకపోవచ్చు. థియేటర్ల వద్ద కటౌట్లు పెట్టొద్దని హుకూం జారీ చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో పాలాభిషేకాలు చేయొద్దని వేడుకుంటాడు. సినిమా విడుదల సమయంలో ఎలాంటి హంగామా, వేడుకలు వద్దని సూచిస్తాడు. ఇంతకీ ఎవరా స్టార్ అనుకుంటున్నారా..? కోలీవుడ్ హీరో అజిత్.. చిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రవర్తన ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులూ ఫిదా అవుతుండటం విశేషం.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_454.jpg)
సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్
అజిత్ నాన్న సుబ్రమణిది తమిళకుటుంబమే అయినప్పటికీ పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన మోహినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దేశ విభజన తర్వాత కోల్‌కతాలో స్థిరపడ్డారు. పెళ్ళయ్యాక ఆయనకి సికింద్రాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇక్కడ ఐదారేళ్లపాటున్నారు. రెండో సంతానంగా అజిత్ జన్మించారు. తర్వాత వారు చెన్నై వెళ్లి అక్కడే స్థరపడ్డారు. దీంతో అజిత్‌కి ఏ ప్రాంతీయ భాషా సరిగ్గా రాలేదు. ఆపై స్కూల్లో ఎప్పుడూ అట్టడుగు ర్యాంకే. చివరకు ఆయన్ను పదో తరగతి పరీక్షలకు కూడా అనుమతించలేదు.
అలా ఖాళీగా ఉన్నప్పుడే ఓసారి వాళ్ల నాన్నతో ఆఫీసుకెళ్లాడు. అక్కడి ఎండీ గదిలో ఉన్న రేసు బైకుల ఫోటోలను చూసి ఫిదా అయ్యాడు. తానూ ఆ రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు తయారీ కంపెనీలో మెకానిక్ పనిలో చేరాడు. అలా పదహారేళ్లకే రిపేరింగ్ నేర్చుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టాడు. కానీ, అతని తల్లిదండ్రులకి ఆ వర్క్ నచ్చలేదు..! మావాడు మెకానిక్ అంటే అందరూ నవ్వుతున్నారంటూ అజిత్‌పై వాళ్లనాన్న కోప్పడేవాడు. బలవంతంగా మెకానిక్ పనికి ఫుల్‌స్టాప్ పెట్టించి ఓ గార్మెంట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు.
అక్కడ పనిచేస్తున్నా సరే, అజిత్ రేసులపైన ఆశలు వదులుకోలేదు. తన జీతం డబ్బు మొత్తం పెట్టి బైకు రేసుల్లో పాల్గొనేవాడు. కానీ , ఆ సమయంలో అజిత్‌కు ఎక్కువగా ఎస్పీబీ చరణ్ సాయపడ్డాడు. పదో తరగతిలో మొదలైన ఆ స్నేహమే అజిత్ సినిమాల్లోకి రావడానికి మూల కారణమైంది. గార్మెంట్ ఎక్స్‌పోర్టింగ్ బిజినెస్ ప్రారంభించిన అజిత్‌కు నష్టాలు వచ్చాయి. అన్నయ్య అమెరికాలో స్థిరపడ్డాడు. తమ్ముడు ఐఐటీ మద్రాసులో చేరాడు. వారికి డబ్బు సర్ధడమే కుటుంబానికి కష్టంగా మారింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_171.jpg)
తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది.. ఇప్పటికీ నో ఫోన్
అప్పుడే గొల్లపూడి మారుతీరావు కుమారుడు సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా నిర్మాతకు అజిత్‌ను పరిచయం చేసింది ఎస్పీ బాలసుబ్రమణ్యమే.. అలా అజిత్ కెరీర్‌లో ఫస్ట్ సినిమా 'ప్రేమ పుస్తకం' తెలుగు పరిశ్రమ నుంచే పడ్డాయి. అక్కడ మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఏమీ లేని స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 350 కోట్ల ఆస్తితో నిలదొక్కుకున్నాడు.ఈ కాలంలో మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించని సూపర్ స్టార్ ఒకరు ఉన్నారని చెబితే అది అజిత్ మాత్రమేనని చెప్పవచ్చు. సోషల్ మీడియాకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. తనకంటూ యాక్టివ్ ఫ్యాన్ క్లబ్‌లు లేవు. ఎలాంటి వేడుకల్లో పాల్గొనడు. ప్రమోషనల్ యాడ్స్‌లో నటించడు. సినిమా, కారు రేసింగ్‌లలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు.
అభిమాన సంఘాలు వద్దని ఎందుకు చెప్పారు..?
రాజకీయాల్లో అజిత్ రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకు అభిమాన సంఘాలిను ఉపయోగించుకుంటున్నాడు అని ప్రచారం జరిగింది. దీంతో ఆ సంఘాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. సినిమా హీరోలను అభిమానించే వారికి గొప్ప గుణపాఠం కూడా చెప్పాడు. 'డియర్ సార్,మేడమ్.. ఒక సినిమా నటుడి కోసం మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. నేనొక మెకానిక్‌ని.. అక్కడి నుంచి నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కారణం కరెక్ట్ సమయాన్ని ఉపయోగించడమే. నామీద ప్రేమతో మీరు సమయాన్ని వృథా చేయకండి. అందుకే ఈ అభిమాన సంఘాలను పూర్తిగా రద్దు చేస్తున్నాను. మీ పని అంత మీ కెరీర్‌పైనా పెట్టిండి. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరాలి. మీరు పట్టుదలతో కరెక్ట్‌గా సమయాన్ని ఉపయోగిస్తే భారీ విజయాలను అందుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment