టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం | Revenue Department Taken Strict Action On Githam Educational Institutions Irregularities | Sakshi
Sakshi News home page

ఆక్రమణలకు చరమ‘గీతం’

Published Sun, Oct 25 2020 2:57 AM | Last Updated on Sun, Oct 25 2020 10:26 AM

Revenue Department Taken Strict Action On Githam Educational Institutions Irregularities - Sakshi

ఆక్రమిత స్థలంలో గీతం సంస్థలు నిర్మించిన రక్షణ గోడని కూలగొడుతున్న రెవెన్యూ సిబ్బంది

సాక్షి , విశాఖపట్నం/కొమ్మాది:  గీతం విద్యా సంస్థల అక్రమాలపై విశాఖ జిల్లా రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత టీడీపీ ప్రభుత్వం అండతో అడ్డగోలుగా ఎండాడ, రుషికొండ పరిసర ప్రాంతాల భూముల్ని ఆక్రమించుకున్న ‘గీతం’కు చెక్‌ పెట్టడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. భూముల్ని ఆక్రమించి గీతం విశ్వవిద్యాలయం నిర్మించిన రక్షణ గోడ, గ్రావెల్‌ బండ్, గార్డెనింగ్‌ తదితర అక్రమ నిర్మాణాల్ని శనివారం రెవిన్యూ అధికారులు తొలగించారు. ఆర్‌డీవో పెంచల్‌ కిశోర్, నార్త్‌ ఏసీపీ రవిశంకర్‌ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది, పోలీసులు గీతం క్యాంపస్‌కు తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుని ఉదయం 11.30 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. 40.51 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, అందులో 38.53 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్‌ 15, 16, 17, 18, 19, 20, 55, 61లోని 18.53 ఎకరాలు, రుషికొండలో సర్వే నంబర్‌ 34, 35, 37, 38లో 20 ఎకరాల భూమి ఉంది. కోర్టు కేసుల పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన భూముల్లోని అక్రమ నిర్మాణాల్ని కూలగొట్టారు. స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రభుత్వ భూములుగా బోర్డులు పెట్టారు.  

టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం
► రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్‌ 17/1, 5, 17/7 నుంచి 28 వరకు 71.15 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు ఇచ్చారు. గీతం విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూములు ఇవ్వాలని 1981లో అప్పటి ప్రభుత్వాన్ని గీతం యజమాని, టీడీపీ నేత, బాలకృష్ణ వియ్యంకుడు దివంగత ఎంవీఎస్‌ మూర్తి కోరారు.
► ఈ భూములపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆ«ధీన పత్రాలు దక్కించుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ ఆ స్థలాన్ని విద్యా సంస్థకు అప్పగించింది. ఆ తర్వాత ఈ సంస్థ కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది.  
► గీతం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 14 ఎకరాల్లో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు.
► 1998 జూన్‌ 12న అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.34,94,200 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేలా చక్రం తిప్పి.. కారుచౌకగా ఆ భూముల్లో 49 ఎకరాలను గీతంకు అడ్డగోలుగా కట్టబెట్టేసింది. మిగిలిన 8.15 ఎకరాల భూమి కూడా ప్రస్తుతం ‘గీతం’ ఆధీనంలోనే ఉంది.  

పక్కనున్న 40 ఎకరాలపై కన్ను
► 71.15 ఎకరాలను తన చేతుల్లో ఉంచుకున్నది చాలక, పక్కనే ఉన్న 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిపై ‘గీతం’ కన్ను పడింది. క్రమక్రమంగా ఆక్రమణల పర్వానికి తెరతీసింది. 
► అధికారులు ఆక్రమణలను గుర్తించిన ప్రతిసారీ.. కోర్టుకు వెళ్లి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గీతం యాజమాన్యానికి పరిపాటిగా మారింది. 
► సర్వే నంబర్‌ 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని ప్రభుత్వం వీఎంఆర్‌డీఏ, ఇగ్నో, సోషల్‌ వెల్ఫేర్, ఐటీడీఏ, స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్, ఆదాయపు పన్ను శాఖ తదితర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. గీతం సంస్థ దీనిపై కూడా కోర్టుకు వెళ్లింది. 
► మార్కెట్‌ ధర ప్రకారం ఈ భూమిని కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం సూచించినా, గీతం యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. 

ఐదు నెలల క్రితమే నోటీసులు
గీతం క్యాంపస్‌ పరిధిలో 40.51 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించాం. వారు బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నా, ప్రభుత్వం ఆమోదించ లేదు. ఖాళీగా ఉన్న స్థలాల్ని ముందుగా స్వాధీనం చేసుకున్నాం. 5 నెలల క్రితమే ఆక్రమణలపై యాజమాన్యం సమక్షంలో సర్వే నిర్వహించి, మార్కింగ్‌ చేసి, నోటీసులిచ్చాం. ఆక్రమించిన భూముల్లో శాశ్వత భవనాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మార్కింగ్‌ చేశాం. త్వరలో ఆ ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకుంటాం.  
    – పెంచల్‌ కిశోర్, ఆర్‌డీవో  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement