సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం | TDP Leader Collecting Money for postings in Revenue and Police Departments | Sakshi
Sakshi News home page

సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం

Published Sun, Jul 28 2024 4:24 AM | Last Updated on Sun, Jul 28 2024 11:10 AM

TDP Leader Collecting Money for postings in Revenue and Police Departments

రెవెన్యూ, పోలీసు శాఖల్లో పోస్టింగ్‌లకు పైరవీలు, మామూళ్లు

నచ్చిన వారిని నియమిస్తూ టీడీపీ నేతల వసూళ్ల పర్వం

ఎస్సై నుంచి సీఐ దాకా.. ఎమ్మార్వో నుంచి ఆర్డీవో వరకు పైసలిస్తేనే పోస్టింగ్‌ 

ఉన్నచోటే కొనసాగాలన్నా.. బదిలీ చేయాలన్నా నోట్ల కట్టలు ఇవ్వాల్సిందే.. 

ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ మంత్రి లోకేశ్‌ కనుసన్నల్లోనే.. 

తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం రూ.3 కోట్లు?

సీఐకి రూ.40 లక్షలు.. ఎస్‌ఐకి రూ.10 లక్షలు

కర్నూలులో ఓ సీఐ పోస్టుకు రూ.15 లక్షలకు బేరం  

విజయనగరంలో అశోక్‌ బంగ్లా నుంచే ఆదేశాలు  

ఇకపై నెలవారీ మామూళ్లు సైతం తమకే ఇవ్వాలంటూ టీడీపీ నేతల హుకుం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? హామీ­లను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇసుక దోపిడీ నుంచి భూ దందాలతో బరి తెగి­స్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్‌ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతోంది. బదిలీలలో పైరవీలు నడుస్తుండడంతో అధికారులంతా అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేశ్‌ కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెబు­తున్నారు. 

ఒకపక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యా­కాండ, మహిళలపై అఘాయి­త్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీలలో అందినకాడికి వసూలు చేసుకుంటున్నారు! ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీలను అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఉద్యోగుల బదిలీలు జరుగు­తుండటంతో హోదాను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. తమ్ముడు తమ్ముడే..! పేకాట పేకాటే! అన్నట్లుగా తమకు కొమ్ము కాసే ఖాకీలను నియమించుకోవడంతోపాటు పోలీస్‌ స్టేషన్లకు అందే నెలవారీ మామూళ్లపైనా కన్నేశారు. ఇకపై నేరుగా తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. 

రూ.కోట్లలో బేరసారాలు..
కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే బదిలీలపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలన్నా, కోరుకున్న చోటకు పోస్టింగ్‌ ఇవ్వాలన్నా అధికారి స్థాయి, పరిధిని బట్టి మామూళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్డీవోల నుంచి ఎమ్మార్వోల దాకా ఎస్‌ఐ నుంచి సీఐ దాకా రేట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం ఎవరు ఎక్కువ కోట్‌ చేస్తే వారికి ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. దీర్ఘకాలం జిల్లాలో పనిచేసిన ఓ అధికారి రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ తహశీల్దార్‌ తిరుపతి రూరల్‌ ఎమ్మార్వో పోస్టు కోసం భారీ మొత్తం ఇస్తానంటూ అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు.  

కొమ్ము కాయాల్సిందే...!
కూటమి నేతలకు కొమ్ము కాయడంతోపాటు మామూళ్లు అందించే ఖాకీలపై కన్నేసి ఉంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ సీఐ పోస్టు కోసం స్థానిక ఎమ్మెల్యే రూ.40 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావటంతో గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించేందుకు సైతం రేట్లు నిర్ణయించడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. 

కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కోసం ఓ సీఐ రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకోగా ప్రస్తుతం రూ.10 లక్షలు ఇచ్చారు. లెటర్, డీవో (డ్యూటీ ఆర్డర్‌) రాగానే మిగతాది చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ సర్కిల్‌కు భారీ ఆదాయం ఉంది. కర్నూలు చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌తో పాటు మట్కా, పేకాట, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా తదితర వ్యవహారాలతో పాటు నిత్యం స్టేషన్‌లో పంచాయతీలు జరుగుతుంటాయి. దీంతో డబ్బులు కట్టినా ఇక్కడ సంపాదనకు ఢోకా లేదనే భరోసాతో ఆఫర్‌ ఇచ్చారు. 

⇒ ఎమ్మిగనూరు రూరల్‌ స్టేషన్‌ కోసం ఓ సీఐ రూ.20 లక్షలు స్థానిక నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదోనిలో పని చేసిన ఆయన ప్రస్తుతం లూప్‌లైన్‌లో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆయనకు లెటర్‌ ఇవ్వగా త్రిసభ్య కమిటీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంది. ఇక ఎమ్మిగనూరు టౌన్‌ సర్కిల్‌కు కూడా రూ.20 లక్షలకు స్థానిక నేతతో బేరం కుదిరినట్లు సమాచారం. 

⇒ నంద్యాలలో ఆర్డీవో, తహసీల్దార్‌ కుర్చీ కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. నంద్యాల లోని రెవెన్యూ శాఖ అధికారి కుర్చీ కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో డివిజన్‌ స్థాయి పోస్టు కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లించేందుకు పలువురు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో డీఎస్పీ పోస్టు కోసం రూ.10 లక్షలు, చాగలమర్రి ఎస్‌ఐ పోస్టుకు రూ.5 లక్షల చొప్పున స్థానిక ప్రజాప్రతినిధి డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. 

⇒ కాకినాడ జిల్లాలో కాకినాడ సహా ప్రధాన సర్కిళ్లలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ డివిజన్‌లోని సర్కిల్స్‌లో నియోజక వర్గ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండగా పిఠాపురం సమీప సర్కిల్స్‌లో స్థానిక నేతల అనుచరుల హవా రాజ్యమేలుతోంది. గతంలో పలు వివాదాలు మూటగట్టుకుని బదిలీపై  పొరుగు సర్కిల్స్‌కు వెళ్లిన ఇన్‌స్పెక్టర్లు డబ్బు కట్టలతో నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాకినాడ టూ టౌన్‌ నుంచి బదిలీపై వెళ్లిన ఓ సీఐ లక్షలు సమర్పించైనా తిరిగి వచ్చేయాలనే పట్టుదలతో నియోజకవర్గ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రూ.30 నుంచి రూ.40 లక్షలు ఇచ్చుకునేలా బేరసారాలు జరుగుతున్నాయి. పలువురు పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం ఉన్న మండలంలోనే కొనసాగేందుకు మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి కాకినాడ జిల్లాలో అదే పోస్టులో కొనసాగేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ.20 లక్షలు ఆఫర్‌ చేసినట్లు  సమాచారం. జిల్లా పరిషత్‌లో ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన ఒక అధికారి తిరిగి అదే పోస్టు కోసం రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు!

⇒ అనంతపురంలో ఆదాయం బాగున్న ఓ పోలీస్‌స్టేషన్‌కు సీఐగా వచ్చేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయన నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రూ.5 లక్షల దాకా ఇస్తానని చెప్పడంతో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకే చెందిన ఓ అధికారి పుట్టపర్తి బదిలీ అయ్యేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. 

పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన ఆయన పుట్టపర్తిలో ఓ జిల్లా శాఖ ఇన్‌చార్జీగా వచ్చేందుకు లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. రూ.15 లక్షలు ఇస్తానని పరిటాల కుటుంబం ద్వారా ఓ మంత్రిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కదిరి లేదా ధర్మవరం సబ్‌ డివిజన్‌లో సీఐ పోస్టు కోసం రూ.10 లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.

⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్‌ తమకు కావాల్సిన ఎమ్మార్వో, ఎస్‌ఐ, సీఐల జాబితా తయారు చేసుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే ఆలస్యం!

⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో తమ వద్దకు వచ్చిన అధికారుల పేర్లు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా వారి గురించి ఆరా తీస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులను తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నారు. చేపల చెరువులతోపాటు పందాలు, పేకాట ఎక్కువగా జరిగే భీమవరం, ఉండి, ఆచంటలో  పోస్టింగ్‌కు భారీగా డిమాండ్‌ ఉంది. అమలాపురం రూరల్‌ సీఐ బదిలీ వ్యవహారం టీడీపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటంతో ఈ పంచాయతీ టీడీపీ అధిష్టానం, డీజీపీ వద్దకు వెళ్లింది. 

⇒ ఏపీఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరంలో ఎస్‌ఈ పోస్టు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా మాజీ మంత్రి జవహర్‌ బావమరిది కూడా లైన్‌లో ఉన్నారు. పోస్టు కోసం రూ.50 లక్షల ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. 

⇒ అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రెండు జాబితాలు సిద్ధం చేశారు.

⇒ విశాఖ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడలో తహశీల్దారు, ఎస్‌ఐ, సీఐ పోస్టులకు గిరాకీ ఉంది. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జీ రెండు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. భీమిలిలోనూ అధికార పార్టీకి చెందిన కీలక నేత బేరాలు కుదుర్చుకున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభంలో చేరేవారి జాబితా సిద్ధమైంది.

⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు, గుడ్లూరు, కావలి రూరల్, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, పొదలకూరు, నెల్లూరు వేదాయపాలెం, నవాబుపేట, నెల్లూరు రూరల్, వెంకటాచలం అర్బన్‌ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్‌ ఉంది.  

⇒ ప్రకాశం జిల్లాలో టీడీపీ పెద్దల సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించాలని కొన్ని సర్కిళ్ల పరిధిలో తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 

⇒ విజయనగరం జిల్లాలో ఏ పదవిలోనూ లేకపోయినా టీడీపీ సీనియర్‌ నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజు తన బంగ్లా నుంచే యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అధికారులు ఆమె అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. కీలక స్థానాల కోసం అదితి కొన్ని పేర్లు కలెక్టరుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో దాదాపుగా తమ కులం వారికే పోస్టింగ్‌లు ఇచ్చేలా ఆయన తండ్రి కొండలరావు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల (జనసేన) ఎమ్మెల్యే లోకం మాధవి కూడా తమకు అనుకూలమైన తహసీల్దార్ల పేర్లను కలెక్టరేట్‌కు పంపినట్లు సమాచారం. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి సైతం ఇప్పటికే సిఫారసు లేఖలను కలెక్టరేట్‌కు పంపించారు. 

⇒ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట, లాలాపేట పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్‌ కనుసన్నల్లో జరుగుతున్నాయి. కొత్తపేటకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐని, లాలాపేటకు కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐని నియమించండంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత గుంటూరు స్టేషన్‌కు మాత్రమే సీఐ నియామకాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌కు అప్పగించినట్లు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement