వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక బదిలీ
అక్రమ కేసులు పెట్టలేదని చంద్రబాబు ఆగ్రహం
డీఐజీ కోయా ప్రవీణ్‌కు అక్రమ కేసుల పర్యవేక్షణ బాధ్యత!
డీజీపీ, సీఎస్ తీరుపై అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేయాలి. అక్రమ కేసులు పెట్టి వేధించాలి. థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి. రాజ్యాంగ హక్కులు, సుప్రీంకోర్టు తీర్పులు పట్టించుకోకూడదు. కాదు కూడదంటే వేటు తప్పదు.
– ఇది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పాటిస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగ దుర్నీతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధికార కూటమి పారీ్టల నేతలు చెప్పినట్లుగా పోలీసు వ్యవస్థ నడుచుకోవాలని, ఎవరైనా ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే శంకరగిరి మాన్యాలకు పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం బదిలీ వేటు వేయడమే ఇందుకు నిదర్శనం. ఆయన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడును వైఎస్సార్ జిల్లా ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్దన్ రాజును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ జిల్లా ఎస్పీగా నియమించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు యథేచ్ఛగా అక్రమాలకు తెగించారు. తాజాగా తమ రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు నమోదు చేసి, చిత్రహింసలకు గురి చేయాలని పట్టుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 41 ఎ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటాంగానీ అక్రమంగా అరెస్ట్ చేయడం సాధ్యం కాదని ఎస్పీ వారితో చెప్పినట్టు తెలిసింది.
దాంతో ఆయనపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహించారు. విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్లింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనిని సాకుగా తీసుకున్న చంద్రబాబు.. వైఎస్సార్ జిల్లా ఎస్పీపై వేటు వేయడం ద్వారా ఐపీఎస్ అధికారులను లోబరుచుకోవచ్చన్న మైండ్‌గేమ్‌కు తెరలేపినట్లు సమాచారం. వెంటనే ఎస్పీని బదిలీ చేయడంతో పాటు టీడీపీ మాజీ ఎంపీకి సమీప బంధువైన కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్‌ను ప్రత్యేకంగా వైఎస్సార్ జిల్లాకు పంపారు.
డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, స్టేషన్ హౌస్ అఫీసర్లకు ఒక స్థానంలో కనీసం రెండేళ్లపాటు విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ‘ప్రకాశ్‌సింగ్ వెర్సస్ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పును తమకు వర్తింప చేయాలని డీజీపీ, సీఎస్‌లు కోరుతున్న నేపథ్యంలో హర్షవర్దన్‌రాజు విషయంలో పాటించక పోవడం గమనార్హం. ఈ విషయమై పోలీసువర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కాగా, వైఎస్‌ఆర్ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డి పల్లెకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని జిల్లా పోలీసులు కడప తాలూకా స్టేషన్‌కు తీసుకుని వచ్చి ఓ కేసులో 41ఎ నోటీసు ఇచ్చి పంపించారు. అతన్ని అరెస్ట్ చేయలేదనే నెపంతో, ఇతర కారణాలను చూపిస్తూ జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. చిన్నచౌక్ సీఐని సస్పెండ్ చేశారు. కడప తాలూకా సీఐపై కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
నగరంపాలెం: రిమాండ్ ముద్దాయి బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన ఘటనలో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ విధించిన గుంటూరు జిల్లా కోర్టు.. రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో అనిల్‌కుమార్‌ను ఏలూరు సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు ఎస్కార్ట్ సిబ్బంది తీసుకెళ్లారు. ఈ ఘటనలో ఒక ఆర్‌ఎస్‌ఐతో పాటు ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment