రూ.51,99,800 నగదుతోపాటు చెక్కులు కూడా ఇవ్వండి
రామోజీరావుకి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ లొల్లి
ఆధారాలు చూపించాలని అధికారులు అడిగితే చూపకుండా పరారీ
ఓట్ల కొనుగోలుకు టీడీపీ నేతలకు అందించడానికి మార్గదర్శి పక్కా ప్లాన్
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో కేసు ఐటీ శాఖ చేతికి..
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.51,99,800 నగదుతోపాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో పచ్చ పత్రికాధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ డ్రామాలకు తెరలేపింది. ఆ నగదుతోపాటు చెక్కులు కూడా తమవేనని చెబుతున్న మార్గదర్శి ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపమంటే చూపడం లేదు. దీంతో ఈ సొమ్ము మార్గదర్శిది కాదని.. టీడీపీ నేతలు ఓట్ల కొనుగోలుకు తరలిస్తున్న నగదని అంతా చెబుతున్నారు. ఇప్పటికే ఈ నగదుకు సంబంధించి కేసు కూడా నమోదైంది.
అంతేకాకుండా ఈ వ్యవహారం ఆదాయ పన్ను శాఖ పరిధిలోకి వెళ్లిపోయింది. ఆధారాలు చూపించి నగదును తీసుకునే అవకాశం ఉన్నా ఆ పనిచేయకుండా జిల్లా ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది తిరగడం చర్చనీయాంశంగా మారింది.
ఐటీ అధికారులకు ఆధారాలు చూపాల్సిందే..
ఎఫ్‌ఐఆర్ నమోదుతో మార్గదర్శి పేరుతో జరిగిన మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశం ఐటీ శాఖ చేతుల్లోకి వెళ్లింది. దీంతో పట్టుబడిన ప్రతి పైసాకు లెక్కలతో సహా ఆధారాల్ని పోలీసులతో పాటు ఐటీ అధికారులకు మార్గదర్శి సమర్పించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ము మార్గదర్శిది కాదని.. అందుకే ఐదు రోజులు గడుస్తున్నా లెక్కా పత్రాలు చూపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ఖర్చులకు తమకు అనుకూలమైన పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు అందించేందుకు మార్గదర్శి పేరుతో పక్కా ప్లాన్ వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరికి ఇస్తున్నారో అధికారులు దర్యాప్తు చేసి రామోజీరావు నడిపిస్తున్న మనీలాండరింగ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆధారాల్లేకుండా అధికారుల చుట్టూ..
ఈ నెల 2న విశాఖ ద్వారకానగర్ ప్రాంతంలో రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులు పట్టుబడ్డాయి. వీటిని ఇద్దరు మార్గదర్శి సిబ్బంది స్కూటీపై సూట్‌కేసులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, చెక్కులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. నగదు తరలింపుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం తమ పరిధిలో లేదని రెండు రోజుల క్రితం మార్గదర్శి సిబ్బందికి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
అయినప్పటికీ.. కలెక్టరేట్‌లోని ఎన్నికల యంత్రాంగం చుట్టూ మార్గదర్శి సిబ్బంది ప్రదక్షిణలు చేస్తూ.. నగదు, చెక్కులు ఇప్పించాలంటూ హడావుడి చేస్తున్నారు. తమ పరిధిలో లేదని చెబుతున్నా వదలకపోవడంతో ‘ఆధారాలు చూపించండి.. పోలీసులు, ఐటీ సిబ్బందికి ఇస్తాం’ అని ఎన్నికల యంత్రాంగం చెప్పడంతో.. తామేమీ ఆధారాలు తీసుకురాలేదని అక్కడి నుంచి మార్గదర్శి సిబ్బంది పలాయనం చిత్తగించారు. అయితే శనివారం సాయంత్రం మళ్లీ ఎన్నికల అధికారుల వద్దకు వచ్చి నగదు కోసం ఒత్తిడి తెచ్చారు. విధులకు ఆటంకం కలిగిస్తుండటంతో మార్గదర్శి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment