
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ, యండాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన నేపథ్యంలో.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) విద్యా సంస్థల యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే తదుపరి విచారణ వరకు గీతం నిర్మాణాలను కూల్చొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఆదివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
గీతం యాజమాన్యం ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకుని అందులో చేసిన పలు నిర్మాణాలను అధికారులు ముందస్తు నోటీసులు ఇచ్చి కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీంతో గీతం యాజమాన్యం శనివారం అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఆదివారం న్యాయమూర్తి జస్టిస్ సురేశ్‌రెడ్డి తన ఇంటి వద్ద వాదనలు విన్నారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గీతంకు విద్యా దాహానికి బదులు భూదాహం పట్టుకుందన్నారు. తమ భూముల్లోకి తాము వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. గీతం తరఫు న్యాయవాది రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అధికారులు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి అదనపు డాక్యుమెంట్ల సమర్పణకు గీతంకు అనుమతినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment