సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖ పరిసరాల్లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంపై హైకోర్టును ఆశ్రయించిన ‘గీతం’ యాజమాన్యం సింగిల్ జడ్జి తాము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వలేదంటూ సోమవారం రాత్రి హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. కూల్చివేతకు ముందున్న పరిస్థితిని కొనసాగించేలా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదని, కేవలం తదుపరి కూల్చివేతలు చేపట్టవద్దని మాత్రమే ఆదేశాలు ఇచ్చారంటూ ‘గీతం’ కార్యదర్శి బీవీ మోహనరావు ఈ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
అప్పుడు సమ్మతించి ఇప్పుడు అప్పీల్ దారుణం..
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘గీతం’ సమ్మతి మేరకే సింగిల్ జడ్జి ఆ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. అప్పుడు సమ్మతి తెలియచేసి ఇప్పుడు ఆ ఉత్తర్వులు తమకు సమ్మతం కాదంటూ అప్పీల్ దాఖలు చేయడం దారుణమన్నారు. ఈ అప్పీల్‌కు విచారణార్హతే లేదన్నారు.
ఎవరు ప్రోత్సహిస్తున్నారో అందరికీ తెలుసు..
ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో హైకోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు తెచ్చుకుంటామని గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ చెబుతున్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఏఏజీ పొన్నవోలు ప్రశ్నించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం తమకు అప్పీల్ కాగితాలు అందచేయకుండా నంబర్ కేటాయించడానికి వీల్లేదని, గీతం విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘హైకోర్టులో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ప్రతివాదుల వైపు న్యాయవాదులకు కాగితాలు ఇవ్వకుండా అప్పీల్‌కు నంబర్ అయిందంటే, అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించింది.
కబ్జా భూమిని ఇవ్వాలంటోంది..
ఓ అనుబంధ పిటిషన్‌లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టుతో పాటు ఉమ్మడి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పాయని పొన్నవోలు నివేదించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా, ఆ భూమిని ఇచ్చేయాలని గీతం కోరుతోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అంతకు ముందు గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలను కూల్చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
మేం కోరుకున్న ఉత్తర్వులివ్వలేదు
Published Wed, Oct 28 2020 4:05 AM | Last Updated on Wed, Oct 28 2020 4:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment