Government land kabza
-
మేం కోరుకున్న ఉత్తర్వులివ్వలేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ భూమిని ఆక్రమించి విశాఖ పరిసరాల్లో నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయడంపై హైకోర్టును ఆశ్రయించిన ‘గీతం’ యాజమాన్యం సింగిల్ జడ్జి తాము కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వలేదంటూ సోమవారం రాత్రి హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేసింది. కూల్చివేతకు ముందున్న పరిస్థితిని కొనసాగించేలా సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వలేదని, కేవలం తదుపరి కూల్చివేతలు చేపట్టవద్దని మాత్రమే ఆదేశాలు ఇచ్చారంటూ ‘గీతం’ కార్యదర్శి బీవీ మోహనరావు ఈ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అప్పుడు సమ్మతించి ఇప్పుడు అప్పీల్ దారుణం.. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘గీతం’ సమ్మతి మేరకే సింగిల్ జడ్జి ఆ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. అప్పుడు సమ్మతి తెలియచేసి ఇప్పుడు ఆ ఉత్తర్వులు తమకు సమ్మతం కాదంటూ అప్పీల్ దాఖలు చేయడం దారుణమన్నారు. ఈ అప్పీల్‌కు విచారణార్హతే లేదన్నారు. ఎవరు ప్రోత్సహిస్తున్నారో అందరికీ తెలుసు.. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో హైకోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు తెచ్చుకుంటామని గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ చెబుతున్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఏఏజీ పొన్నవోలు ప్రశ్నించారు. హైకోర్టు నిబంధనల ప్రకారం తమకు అప్పీల్ కాగితాలు అందచేయకుండా నంబర్ కేటాయించడానికి వీల్లేదని, గీతం విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘హైకోర్టులో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ప్రతివాదుల వైపు న్యాయవాదులకు కాగితాలు ఇవ్వకుండా అప్పీల్‌కు నంబర్ అయిందంటే, అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో కూడా అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించింది. కబ్జా భూమిని ఇవ్వాలంటోంది.. ఓ అనుబంధ పిటిషన్లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టుతో పాటు ఉమ్మడి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పాయని పొన్నవోలు నివేదించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా, ఆ భూమిని ఇచ్చేయాలని గీతం కోరుతోందని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. అంతకు ముందు గీతం తరఫు న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ నోటీసు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలను కూల్చేశారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. -
ఆక్రమణలు..అమ్మకాలు
తుమ్మపాల(అనకాపల్లి) : ప్రభుత్వ భూముల ఆక్రమణతో పాటు అమ్మకాలకు అడ్డాగా మారింది మండలంలోని గొలగాం పంచాయతీ. అనకాపల్లి పట్టణానికి చెందిన అధికారపార్టీ నాయకులు కొందరు ఇటీవల ఈ గ్రామంలోని సర్వే నెంబరు 137లో సుమారు 5ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అందులోని భారీ వృక్షాలను తొలగించి లేఅవుట్ వేశారు. అది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసిన పరిణామం మరువక ముందే మరో వ్యవహారం వెలుగుచూసింది. మండలంలో అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నది గొలగాంలోనే. ఈ గ్రామానికి సమీపంలో కోడూరులో ఏపీఐఐసీ, అనకాపల్లి–ఆనందపురం రహదారి విస్తరణ వంటి అంశాలు మూలంగా ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈమేరకు సర్వే నెంబరు 88లో ఉన్న 60 ఎకరాల కొండపోరంబోకు భూమిలో కొంత గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించారు. సుమారు 10 ఎకరాల మేర లేఅవుట్ వేసి రూ. లక్షలకు అమ్మేశారు. సుమారు రూ.రెండు కోట్లమేర లావాదేవీలు జరిగినట్టు అంచనా. కొందరు చోటా మోటా నాయకులు ఇదే బాట పడుతున్నారు. కొండను చదును చేసి దొంగపట్టాలు సృష్టించి జోరుగా విక్రయాలు చేపడుతున్నారు. సెంటు రూ.లక్ష చొప్పున 3 నుంచి 6 సెంట్లు ఒక్కో ప్లాటుగా రూపొందించారు. వీటి లావాదేవీలు జాతరను తలపిస్తున్నాయి. వీటిల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి మున్ముందు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పంచాయతీ, ఇతర శాఖల అధికారులు ఇంటి పన్ను, విద్యుత్, మంచినీటి సౌకర్యం ఎంచక్కా కల్పిస్తున్నారు. అనకాపల్లికి కేవలం 4 కిలో మీటర్ల దూరంలో తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు లభిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పలువురు ఈ స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని గ్రామస్ధాయి అధికారుల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా గ్రామాభివృద్ధిలో భాగంగా అన్ని ఇళ్లకు సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్నారు. వీఆర్వో ఓ అడుగు ముందుకేసి ఇక్కడి నిర్మాణాలకు ఎల్పీసీలు కూడా మంజూరు చేశామన్నారు. అంటే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి రెవెన్యూ సిబ్బంది సహకరిస్తున్నారన్నమాట. అధికారులు పాలకపార్టీ నాయకులతో కుమ్మక్కవుతున్నారనడానికి ఇది తార్కాణంగా ఉంటోంది. ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు.. గొలగాంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి విక్రయిస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. ఎన్టీఆర్ హౌసింగ్‌లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన ఎల్‌పీసీలతో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టరాదు. అలా చేపడితే తొలగిస్తాం. ఇటీవల ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసి అర్హులకు పట్టాలు పంపిణీ చేస్తాం. –బి.సత్యనారాయణ, తహసీల్దార్, అనకాపల్లి -
మళ్లీ స్కెచ్చేస్తున్నారు..!
►ఒంగోలులో రూ..5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం ►గతంలో ఇచ్చిన పట్టాలు రద్దుచేసిన నాటి జేసీ ►ముస్లిం కమ్యూనిటీ హాలుకు ఇవ్వాలని ఆనాడే ఉత్తర్వులు ►అదే స్థలాన్ని కబ్జాదారులకు కట్టబెట్టేందుకు మళ్లీ సన్నాహాలు ►పావులు కదుపుతున్న అధికార పార్టీ నేతలు ధనార్జనే పరమావధిగా పెట్టుకున్న అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలుతున్నారు. ఒంగోలు నగరంలో అత్యంత ఖరీదైన స్థలాలపై కన్నేసి, వాటిని కాజేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. అర్హత లేకున్నా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఓ కబ్జాదారు తాజాగా తన కుటుంబ సభ్యుల పేరుతో రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు పావులు కదుపుతున్నాడు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత సైతం గురువారం ఆ స్థలాన్ని సందర్శించి, దానిని కబ్జాదారునికే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని సమాచారం. ఒంగోలు క్రైం: ఒంగోలు పాతగుంటూరు రోడ్డులో ఉన్న బిలాల్‌నగర్‌లోని పోతురాజుకాలువ పక్కనే టీఎస్ నంబర్–116/1ఏ/1ఏ లో 42 గదుల ప్రభుత్వ భూమి ఉంది. మూడు వైపుల రోడ్డు సౌకర్యం ఉన్న ఈ భూమి అత్యంత ఖరీదైంది. దీనిపై అధికార పార్టీకి చెందిన ‘బొట్టు’ శ్రీను అనే వ్యక్తి కన్నుపడింది. గతంలో ఆ స్థలాన్ని రెండు ప్లాట్లుగా విభజించి నిబంధనలకు విరుద్ధంగా అతడి తల్లి, అత్త పేరుతో రెండు పట్టాలు పొందాడు. ప్లాట్ నంబర్ ఒకటిని నెలకుర్తి సుబ్బులు, రెండోది వేమూరి లక్ష్మమ్మ పేరుతో పట్టాలు తీసుకున్నాడు. అయితే అప్పట్లో బిలాల్‌నగర్‌కు చెందిన ముస్లింలు ఆ స్థలం కమ్యూనిటీ హాలుకు కావాలని అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఒంగోలు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని కోరారు. ఆస్థలాన్ని కమ్యూనిటీ హాలుకు కేటాయిస్తామని వారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ స్థలంపై కొందరు పట్టాలు పొందారని తెలిసి కొందరు ముస్లింలు 2009లో నాటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అప్పటి జాయింట్ కలెక్టర్ ఎ.దినకరబాబు అదే ఏడాది డిసెంబర్ 4న వీరిద్దరి పట్టాలను రద్దు చేస్తూ ఆర్సి నంబర్ ఈ3–3684/2009తో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో ఆ స్థలాన్ని కమ్యూనిటీ హాలుకు కేటాయిస్తున్నట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నం.. అనంతరం సుబ్బులు, లక్ష్మమ్మలకు ఒంగోలు నగరంలో ఎక్కడెక్కడ సొంత ఇళ్లున్నాయో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అప్పటి తహశీల్దార్ చిరంజీవిని ఆదేశించారు. దీంతో విచారణ జరిపిన తహశీల్దార్ వారిద్దరికీ ఉన్న శాశ్వత భవనాలకు సంబంధించిన ఆధారాలతో సహా నివేదిక సమర్పించారు. 2010 ఫిబ్రవరి 11న ఆర్సీ బి/1053/2009 నంబర్‌తో కూడిన నివేదికను తహశీల్దార్ చిరంజీవి జేసీ దినకరబాబుకు సమర్పించారు. ఆ నివేదికలో వాళ్లిద్దరికి సంబంధించిన ఆర్సీసీ భవనాల వివరాలతో సహా అందజేశారు. అయినా మళ్లీ ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు వాళ్లే రంగంలోకి దిగడం గమనార్హం.