గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా! | Gudivada Amarnath Fires On TDP Leaders And Yellow Media | Sakshi
Sakshi News home page

గాంధీజీ పేరు పెట్టుకుని భూ కబ్జాలా!

Published Sun, Oct 25 2020 3:04 AM | Last Updated on Sun, Oct 25 2020 10:08 AM

Gudivada Amarnath Fires On TDP Leaders And Yellow Media - Sakshi

మీడియా సమావేశంలో గుడివాడ అమర్‌నా«థ్, అదీప్‌రాజ్‌

సాక్షి, విశాఖపట్నం: ‘గీతం యూనివర్సిటీకి జాతిపిత మహాత్మాగాంధీ పేరు పెట్టి భూ కబ్జాలకు పాల్పడతారా? భూ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకుంటే టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, మరో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ధ్వజమెత్తారు. శనివారం మద్దిలపాలెంలో వారు మీడియాతో మాట్లాడారు. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాల భూములను గీతం యాజమాన్యం ఆక్రమించిందని.. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను తెల్లవారుజామున కూల్చేశారనడం సబబు కాదన్నారు. ఐదు నెలల క్రితమే గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ సర్వేయర్‌ సర్వే జరిపి.. 40 ఎకరాలు కబ్జా అయినట్టు తేల్చారన్నారు.

2014లో అప్పటి ప్రభుత్వానికి గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఎలివేషన్‌ (బదలాయింపు కోసం) దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఒకటి, రెండు ఎకరాల వరకు ఎలివేషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తుందని.. రూ.800 కోట్ల విలువైన 40 ఎకరాలు ఆక్రమించుకుంటే ఎలివేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినేట్‌ సమావేశంలో గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం ప్రస్తావన రాగా.. అది తమ కుటుంబానికి సంబంధించిన అంశమని చెప్పిన చంద్రబాబు సమావేశం నుంచి బయటికి వెళ్లింది నిజం కాదా అని ప్రశ్నించారు.

2017లో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖలో జరిగిన భూకుంభకోణాన్ని వెలికి తీశామని గుర్తు చేశారు. అప్పుడు కంటితుడుపు చర్యగా సిట్‌ దర్యాప్తునకు ఆదేశించి.. కేసును నీరుగార్చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటైందని.. కోవిడ్‌ కారణంగా దర్యాప్తు కొంత ఆలస్యమైందని తెలిపారు. భూకుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాలకృష్ణతో ఉన్న బంధుత్వం కారణంగా గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణల్ని బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని, హత్యలు చేసిన వారినే టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులుగా తీసుకున్నారని, ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న అచ్చెన్నాయుడును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement