రచ్చ చేయడం లబ్ధి పొందడం పచ్చ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అందుకు అవసరైతే ఎవరినైనా బలి చేస్తారు. ఎంతదాకైనా వెళ్తారు. ఎన్ని అసత్యాలైనా చెబుతారు. తమ రాజకీయ స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తారు. అవసరమైతే రోడ్లెక్కి ఆందోళనలు చేస్తారు. జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఇదే. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం పాలన సాగిస్తుండగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేని పచ్చ నేతలు అమాయకులు, మహిళలను ఉసిగొలిపి రచ్చ చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ జనం దగ్గర మార్కులు కొట్టేయాలని కుయుక్తులు పన్నుతున్నారు.
సాక్షి, పుట్టపర్తి: ఒకప్పుడు మందీమార్బలం.. అధికార దర్పంతో హడావుడి చేసిన పచ్చ నేతలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గతంలో ఇళ్లముందు బారులు తీరే జనం.. ఇప్పుడు ఎదురెళ్లినా పట్టించుకోలేదు. నమ్ముకున్న కేడరూ తలోదారి చూసుకున్నారు.. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి.. ఏం చేయాలో తెలియని ‘తమ్ముళ్లు’ అసత్యాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉనికి కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. నేరాల్లో ముద్దాయిలుగా ఉన్న మహిళలను నేతలు, అధికారులపై ఉసిగొలిపి రోడ్డెక్కుతున్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని విషపు రాతలు రాయిస్తున్నారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగు చూసిన కొన్ని ఘటనలు తెలుగు ‘తమ్ముళ్ల’ ఆగడాలకు అద్దం పడుతున్నాయి.
వ్యభిచార గృహం నడుపుతూ..
ధర్మవరం టూటౌన్ సీఐ రాజా తనను వేధిస్తున్నారని.. అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని గీతాంజలి అనే మహిళ గత సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఆరా తీస్తే.. ఆమెపై ఇప్పటికే పలు ఫిర్యాదులున్నాయి. చీరల వ్యాపారం పేరుతో పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతోంది. ధర్మవరంలో అద్దెకు ఇళ్లు తీసుకుని ఇంటి యజమానులను వేధించేది. అద్దె ఇవ్వకపోగా, దబాయించేది.
చివరకు వ్యభిచార గృహం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. దీనిపై చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని గీతాంజలి తనకు బాగా తెలిసిన కొందరు పచ్చనేతలను కలిసి వారి డైరెక్షన్‌లో టూ టౌన్ సీఐ రాజాపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు, టూ టౌన్ సీఐ రాజాకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గీతాంజలి సీఐపై ఫిర్యాదు చేయడం, ఆమెపై ఇప్పటికే కేసులుండటం తెలిసి జనం పచ్చనేతల దిగజారుడు ప్లాన్‌పై మండిపడుతున్నారు.
చదవండి: (జనసేన నాయకుడి వేధింపుల పర్వం.. ప్రేమిస్తున్నానంటూ హల్‌చల్)
నాటుసారా, కర్ణాటక మద్యం విక్రయిస్తూ..
పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన లలితాబాయి నాటుసారా, కర్ణాటక మద్యం విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడింది. ఆమె వితంతువు కాగా ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. అయితే ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడంతో విచారణ చేసిన అధికారులు వితంతు పింఛన్ నిలిపివేశారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్న స్థానిక టీడీపీ నేతలు లలితాబాయిని రెచ్చగొట్టారు. దీంతో ఆమె అప్పటి మంత్రి శంకరనారాయణను ఇష్టానుసారం దూషించారు. దీంతో విచారణ చేయించగా...ఆమె పింఛన్‌కు అనర్హురాలిగా తేలింది. పైగా ఆమెపై నాటుసారా విక్రయాలకు సంబంధించి ఇప్పటికే కేసులున్నాయి. 10 రోజుల క్రితం కూడా రొద్దం మండల పరిధిలోని రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక మద్యం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడింది.
ప్రచారం కోసం...హంగామా
బుక్కపట్నం మండలం రాసింపల్లి – గూనిపల్లి మధ్యలో తమపై వైఎస్సార్ సీపీ నేతలు హత్యాయత్నం చేశారని తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి అంబులెన్సు రమేశ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాదాలంకపల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారాలకు చెందిన చెన్నప్ప, రాజు, అగ్రహారానికి చెందిన వారాది, లక్ష్మీనారాయణ తదితరులు రాళ్లు, కర్రలతో దాడి చేయబోయారని ఫిర్యాదు చేశారు. వివరాలపై ఆరా తీయగా..అలాంటి ఘటనే చోటుచేసుకోలేదని తెలిసింది. కేవలం పబ్లిసిటీ కోసమే అంబులెన్స్ రమేశ్ ఇలా చేసినట్లు తేలింది. కేవలం పచ్చ మీడియా తన ఫొటోతో ప్రచారం చేస్తుందన్న ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఎమ్మెల్యేపై దురుసు ప్రవర్తన
పచ్చ నేతలు రెచ్చగొట్టడంతో నల్లమాడ మండలం మసకవంకపల్లి గ్రామస్తులు రెచ్చిపోయారు. సచివాలయం మార్చాలంటూ పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నివాసానికి చేరుకుని గొడవ చేశారు. సర్దిజెప్పేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు రంగంలోకి దిగి అందరినీ స్టేషన్‌కు తరలించారు. దీనిపై జనసేన, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు దు్రష్పచారం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు మసకవంకపల్లి వాసులపై దాడి చేశారంటూ ప్రచారం చేశారు. ఎల్లో మీడియా కూడా పలు కోణాల్లో అసత్య కథనాలు వండివార్చింది. కానీ జనం అసలు విషయం తెలిసి పచ్చనేతల నిసిగ్గు రాజకీయంపై పెదవి విరిచారు.
మున్సిపల్ కార్యాలయానికి కంప
పుట్టపర్తిలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోయింది. ఈ పార్టీ నేతలను పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రతి పథకం అర్హత ఆధారంగా అర్హులందరికీ అందుతుండటంతో ఆపార్టీ కౌన్సిలర్లను జనం పలకరించడం కూడా మానేశారు. దీన్ని జీర్ణించుకోలేని కౌన్సిలర్ రత్నప్పచౌదరి ఎలాగైనా ప్రభుత్వంపై బురదజల్లి లబ్ధి పొందాలని భావించారు. మోటారు వర్షపు నీటిలో మునిగిపోగా, మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొంది. దాని గురించి ప్రస్తావించకుండా నీటి సమస్య పరిష్కరించని మున్సిపల్ కార్యాలయం ఎందుకంటూ ఏకంగా కార్యాలయానికి కంప వేయించారు.
అంతేకాకుండా ఎకరాకు రూ.50 వేలు లీజు రూపంలో చెల్లిస్తానని.. వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలం తనకు ఇవ్వాలని కోరారు. అర్థంపర్థం లేకుండా ఆయన చేసే వ్యాఖ్యలు చూసి జనం నవ్వుకుంటున్నారు. పబ్లిసిటీ పిచ్చితో ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో రత్నప్ప నిత్యం వార్తల్లో కనిపించాలని సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment