AP: Yellow Media False Propaganda On Distilleries And Liquor Brands - Sakshi
Sakshi News home page

బాబూ.. నీది ఏ బ్రాండ్‌?

Published Tue, Mar 22 2022 9:17 AM | Last Updated on Tue, Mar 22 2022 3:37 PM

Yellow Media False Propaganda On AP Distilleries And Liquor Brands - Sakshi

ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్‌ రిజర్వ్‌ విస్కీ బ్రాండ్లకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన అనుమతి పత్రాలు

చంద్రబాబును మోస్తున్న ఓ వర్గం మీడియా... ఎన్నటికీ చెప్పని నిజాలు. అసలు కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. అన్నీ పాతవే!!. మరి ఆ డిస్టిలరీలు తయారు చేస్తున్న మద్యం ఉన్నట్టుండి ఇప్పుడెందుకు ప్రమాదకరమయ్యింది? గతంలో ఇది ఆరోగ్యానికి మంచిదా? ఇదే డిస్టిలరీలు తయారు చేస్తున్న బ్రాండ్లు ఇప్పుడెందుకు ‘జె’ బ్రాండ్లయ్యాయి? ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్‌ రిజర్వ్‌ వంటి వింత వింత పేర్లతో బ్రాండ్లకు అనుమతిచ్చిన చంద్రబాబును అప్పట్లో ఈ మీడియా ఎందుకు నిలదీయలేదు? బెల్టు షాపులు పెట్టించి ఊరూరా మద్యం తాగమని ప్రోత్సహించిన నారా వారిపై అప్పుడెందుకు ఆగ్రహం వ్యక్తంచేయలేదు? ఎందుకంటే.. ఆయన చంద్రబాబు! ఈయన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. అదే తేడా!!. 

నిజం చెప్పాలంటే గతంలో ఏవైతే డిస్టిలరీలు, బ్రూవరీలు మద్యాన్ని సరఫరా చేశాయో... ఇప్పుడూ అవే చేస్తున్నాయి. అందులో చాలావరకూ తెలుగుదేశం నేతలవే. అయ్యన్నపాత్రుడు, యనమల బంధువు, డీకే ఆదికేశవులు నాయుడు... వీరంతా డిస్టిలరీల ఓనర్లే. అప్పుడు... ఇప్పుడు కూడా!!. ఇక బ్రాండ్లనేవి ఈ డిస్టిలరీల ఇష్టం. కావాలనుకున్నపుడు పేర్లు మారుస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న బ్రాండ్లన్నీ దాదాపుగా గతంలోనూ ఉన్నవే. కాకుంటే వై.ఎస్‌.జగన్‌ అధికారంలోకి వచ్చాక మద్యం విషయంలో జరిగిందొక్కటే!. షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు.

మద్యం దుకాణాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఊరూరా వెలిసే బెల్టు షాపుల్ని అడ్డుకోలేమని భావించి... మద్యం దుకాణాలను ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకున్నారు. మద్యం విక్రయించే వేళల్ని తగ్గించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసి... ఎలాంటి ఉల్లంఘనలూ లేకుండా కట్టుదిట్టంగా వీటిని అమలు చేస్తున్నారు. కాకుంటే చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకు మాత్రం ఇవన్నీ మద్యం విక్రయాల్ని పెంచే చర్యలుగా కనిపించటమే... ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. 

చదవండి: ఐదు కోట్ల ఆంధ్రుల సమాచారం చోరీ? సభా సంఘానికి సై

ఏది నిజం?
► ప్రెసిడెంట్‌ మెడల్‌... గవర్నర్‌ రిజర్వ్‌ 
 – ఈ విస్కీ బ్రాండ్లకు 2018 ఫిబ్రవరి 6న అనుమతి ఇచ్చింది చంద్రబాబు సర్కారే.. 
► 3 క్యాపిటల్స్‌... స్పెషల్‌ స్టేటస్‌  
– ఇదంతా టీడీపీ ఎల్లో మీడియా బూటకపు ప్రచారమే. అసలు ఈ పేర్లతో విస్కీనే లేదు. 
► కొత్తవి ఒక్కటీ లేవు.. 
 -వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతివ్వలేదు. ప్రస్తుతం ఉన్నవన్నీ గత సర్కారు హయాం నుంచీ కొనసాగుతున్నవే. 
ఇవన్నీ నిఖార్సయిన నిజాలు.  

ఏదైనా హానికరమే కదా? 
తెలుగుదేశం చెబుతున్నట్లుగా అవి ‘జే’ బ్రాండ్లయినా... బాబు అనుమతిచ్చిన నారా బ్రాండ్లయినా... చీప్‌ లిక్కరైనా... ప్రీమియం బ్రాండ్లయినా... ఏదైనా మద్యమే. ఏదైనా ఆరోగ్యానికి హానికరమే. ఆరోగ్యానికి మేలు చేసే మద్యమేదీ ఉండదు. కాకపోతే ప్రీమియం కాస్త ప్రాసెస్‌ ఎక్కువ చేసి ఉంటుంది కనక కాస్త తక్కువ హానికరం. చీప్‌ లిక్కర్‌ ఏ బ్రాండయినా దాదాపు ఒకటే. సిగరెట్‌కు.. బీడీకి ఉన్న తేడానే వీటిది కూడా. సిగరెట్‌ కాస్త ప్రాసెస్‌ ఎక్కువ చేసి ఫిల్టర్‌తో వచ్చేది కొంచెం తక్కువ హానికరం. బీడీకి అవేవీ ఉండవు కనక ఎక్కువ హానికరం. ఏదైనా హానిచేసేదే. కాకపోతే వీళ్లకు రాజకీయం తప్ప ఏదీ అవసరం లేదు కనక చీప్‌ లిక్కర్‌లో సైతం పేరు పేరునా ఆరోగ్య సూత్రాలు వల్లిస్తోంది బాబు గ్యాంగ్‌.

ఫలానా బ్రాండ్‌ మంచిదని, ఫలానా బ్రాండ్‌ మంచిది కాదని రేటింగులిస్తోంది. తమ వాదనను నిరూపించడానికంటూ ఏ స్థాయికైనా దిగజారుతోంది. కొన్ని బ్రాండ్ల మద్యాన్ని తమకు నచ్చినట్లుగా మార్చేసి... ఆ బాటిళ్లను తమ తాబేదార్ల చేత టెస్టింగ్‌ ఏజెన్సీలకు పంపిస్తోంది. తమకు ఎలాంటి రిపోర్టులు కావాలో కూడా అడుగుతోంది. ఆ రిపోర్టుల్ని పట్టుకుని వై.ఎస్‌.జగన్‌ వ్యతిరేకుల ద్వారా ఏకంగా ప్రధానికి సైతం లేఖలు రాయించే భారీ కుట్రలకు తెరతీసింది. ఇన్ని చేసినా... ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో ఏమాత్రం హానికరం కాని సేంద్రీయ, మొక్కల నుంచి వచ్చిన పదార్థాల అవశేషాలే ఉన్నట్లు సదరు టెస్టింగ్‌ సంస్థ తెలియజేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్ల కుట్రల స్థాయీ తెలుసుకోవచ్చు.  


2018లో బాబు అనుమతి ఇచ్చిన మద్యం బ్రాండ్లు


2019 మే 14న ఎన్నికల ఫలితాలకు 2 వారాల ముందు బాబు అనుమతించిన బ్రాండ్లు

టీడీపీ సర్కారు తెచ్చిన బ్రాండ్లలో కొన్ని.. 
ప్రెసిడెంట్‌ మెడల్, హైదరాబాద్‌ బ్లూ డీలక్స్‌ బ్రాండ్ల విస్కీకి 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ రిజర్వ్, లెఫైర్‌ నెపోలియన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చారు. ఇక హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలకు 2017 జూన్‌ 7న అనుమతి జారీ చేశారు.

రాయల్‌ ప్యాలస్, న్యూ కింగ్, సైన్‌ అవుట్‌ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతి ఇచ్చారు. బిరా 91 పేరుతో మూడు రకాల బీర్‌ బ్రాండ్లకు 2019 మే 14న టీడీపీ ప్రభుత్వమే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చారు. అప్పటివరకు రాష్ట్రంలో వినిపించని, కనిపించని ఈ విచిత్రమైన మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు సర్కారు పుణ్యమే. 
చదవండి: పెగసస్‌ వ్యవహారంలో దొరికిపోవడం ఖాయం

డిస్టిలరీలన్నీ బాబు జమానావే... 
రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలుండగా వాటిలో మెజారిటీ... అంటే 11 డిస్టిలరీలకు అనుమతిచ్చింది చంద్రబాబే. ఒక్కటంటే ఒక్కటి కూడా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది లేదు. 11లో నాలుగు డిస్టిలరీలకు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు అంటే 1995–99లో అనుమతివ్వగా మరో ఏడు డిస్టిలరీలకు 2014–19 మధ్య ఆయనే అనుమతులిచ్చారు. ఈ వాస్తవాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి చంద్రబాబు అనుకూల మీడియా ఎన్నడూ చెప్పదు. ఎందుకంటే ఇవన్నీ చెబితే బాబును చీకొట్టని వారుండరు. అందుకే వాళ్లు చెప్పరు. 

డిస్టిలరీలు... బాబు అండ్‌ కో 
రాష్ట్రంలోని మద్యం బ్రాండ్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల ఆధీనంలోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్‌ యాదవ్‌ కుమారుడు. శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌ దివంగత టీడీపీ నేత డీకే ఆదికేశవులనాయుడు కుటుంబానిది. ఇక ఎస్పీవై ఆగ్రో ప్రొడక్సŠట్‌ను టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం నిర్వహిస్తోంది. వైసీపీ తరపున ఎంపీగా గెలిచాక... నిబంధనలకు విరుద్ధంగా ఎస్పీవై రెడ్డి టీడీపీలోకి ఫిరాయించారు. అందుకు నజరానాగా చంద్రబాబు ఆ డిస్టిలరీకి అనుమతిచ్చారు. ఇక చంద్రబాబు సర్కారు ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో... గతేడాది వరకూ టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుడు. 

లేని బ్రాండ్ల పేరుతో దుష్ప్రచారం... 
కోవిడ్‌ ప్రతికూల పరిస్థితుల్లోనూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో దిక్కు తోచని విపక్షం దిగజారుడు రాజకీయాలకు తెర తీసింది. ‘3 క్యాపిటల్స్‌’ ‘స్పెషల్‌ స్టేటస్‌’ అనే మద్యం బ్రాండ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారానికి తెగించింది. వాస్తవానికి రాష్ట్రంలో ఇలాంటి పేర్లతో మద్యం బ్రాండ్లు ఏవీ లేవు. విపక్ష టీడీపీ అభూత కల్పనలకు ఇది మరో నిదర్శనం.  

అవే డిస్టిలరీలు... అదే బెవరేజస్‌ కార్పొరేషన్‌ 
రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతినిచ్చిన డిస్టిలరీలు మద్యాన్ని తయారు చేస్తుండగా ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ దాన్ని కొనుగోలు చేసి మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తోంది. ఇది దశాబ్దాలుగా ఉన్న విధానమే. గతంలో ప్రైవేట్‌ మద్యం దుకాణాలుండేవి. బెల్టు షాపుల్ని, మద్యం అమ్మకాల్ని నియంత్రించాలంటే అవి ప్రభుత్వం చేతిలోనే ఉండాలని భావించిన ముఖ్యమంత్రి జగన్‌... ప్రైవేటు పద్ధతిని రద్దు చేశారు. అయితే ఈ మంచి పనికి ముసుగు వేసేసి... అప్పుల కోసమే ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నట్లు టీడీపీ విష ప్రచారానికి దిగింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా మద్యాన్ని ప్రోత్సహించి 43 వేల బెల్ట్‌ దుకాణాల్ని తెచ్చిన దుర్మార్గాన్ని ఈ మీడియా ఏనాడూ ప్రస్తావించ లేదు.

4,380 ప్రైవేట్‌ మద్యం దుకాణాలకు పక్కనే పర్మిట్‌ రూమ్‌లకు అనుమతినిచ్చినా ప్రశ్నించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే 43 వేల బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా తొలగించింది. మద్యం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంటే బెల్టు షాపులను అడ్డుకోవడం అసాధ్యమే. అందుకే ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహించాలని నిర్ణయించింది. 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించడంతోపాటు విక్రయ వేళలను కుదించడంతో విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2020–21లో మద్యం విక్రయాలు 40 శాతం, బీర్‌ విక్రయాలు 73 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనం.  

మరణాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం 
ఒకవైపు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ.. మద్యం విక్రయాలు తగ్గి సారా వాడకం పెరిగిందనే మరో విష ప్రచారానికీ పూనుకుంది. జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలను కూడా వక్రీకరిస్తూ వీధి నాటకానికి తెర తీసింది. ఈ మరణాలకు కల్తీ మద్యం కారణం కాదని వైద్య పరీక్షలు నిర్ధారించినా... తమ కుటుంబీకులకు తాగుడు అలవాటే లేదని కొందరు మృతుల బంధువులు వాపోయినా... ఎల్లో గ్యాంగ్‌కు మాత్రం ఇదేమీ పట్టడం లేదు. అసలంతటి జనసమ్మర్థం... పోలీసు నిఘా ఉండే ప్రాంతంలో నాటుసారా ఎలా కాస్తారు? వేర్వేరు ప్రాంతాల్లోని మృతులంతా ఒకే కారణంతో మరణించే అవకాశం ఎక్కడుంటుంది? అనే కనీస ఇంగితజ్ఞానాన్ని వదిలేసి మరీ విషప్రచారానికి దిగుతున్నారంటే... అది ప్రజల విజ్ఞతపై వీరికున్న చులకనభావమే తప్ప వేరొకటి కాదనుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement