సాక్షి, అమరావతి: ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి బట్టబయలైంది. మద్యంలో ప్రమాదకర పదార్థాల అవశేషాలు హానికర స్థాయిలో ఉన్నట్లు తప్పుడు రిపోర్టులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న పన్నాగం బెడిసికొట్టింది. తప్పుడు నివేదికలను ప్రస్తావిస్తూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం ద్వారా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కుట్రను తారాస్థాయికి చేర్చారు. అయితే ఆ లేఖలో ఆయన పేర్కొన్న చెన్నైలోని ఎస్‌జీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్.. ఏపీలో విక్రయిస్తున్న మద్యంలో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అవశేషాలు హానికర స్థాయిలో ఉన్నట్లు నివేదికలో తాము చెప్పలేదని స్పష్టం చేసింది. ఏమాత్రం హానికరం కాని సేంద్రియ, మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు అందులో ఉన్నట్లు తాము పేర్కొన్నామని వెల్లడించింది.
అవాస్తవాలతో రాద్ధాంతం
రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర పదార్థాల అవశేషాలున్నట్లు ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు ఫిబ్రవరి 3న ప్రధాని మోదీకి లేఖ రాశారు. స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అనే ప్రమాదకర అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన పవన్ పీఎంకే, చైతన్యరెడ్డి ఆ మద్యం నమూనాలను గత డిసెంబర్‌లో చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌కు పంపి పరీక్షించగా ఈ విషయం నిర్ధారణ అయినట్లు లేఖలో పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ, ఓ వర్గం మీడియా రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి దిగాయి.
అసలు నిజం ఏమిటంటే...
దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాల పరీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని లేఖ రాయడంతో ఎస్‌జీఎస్ ల్యాబొరేటరీ అన్ని అంశాలను వెల్లడిస్తూ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. పవన్ పీఎంకే, చైతన్యరెడ్డి గత డిసెంబర్ 11న పంపిన మద్యం నమూనాలను పరీక్షించి ఫలితాల నివేదికను అదే నెల 24వ తేదీన అందచేసినట్లు తెలిపింది.
ఆ మద్యం నమూనాల్లో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాము నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది. మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఐఎస్ 4449 (విస్కీ), ఐఎస్ 4450 (బ్రాందీ) ప్రమాణాల మేరకు తాము మద్యం నమూనాలను పరీక్షించలేదని వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో స్కోపరోన్, పైరోగలాల్, వోల్కనిన్ అనే అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తాము నివేదిక ఇవ్వలేదని లిఖిత పూర్వకంగా స్పష్టం చేసిన ఎస్‌జీఎస్ ల్యాబొరేటరీ
అదే మాట చెప్పిన గుంటూరు ల్యాబ్
రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను గుంటూరులోని కెమికల్ ల్యాబొరేటరీకి కూడా పంపి పరీక్షించింది. మద్యం నమూనాల్లో ప్రమాదకర అవశేషాలులేవని ఆ ల్యాబొరేటరీ కూడా నిర్ధారించింది.
న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం
‘రాష్ట్రంలో విక్రయిస్తున్న మద్యంలో ప్రమాదకర అవశేషాలున్నట్లు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాము అలాంటి నివేదిక ఇవ్వలేదని ఎస్‌జీఎస్ ల్యాబరేటరీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం నమూనాలను ఎప్పటికప్పుడు ల్యాబరేటరీలలో పరీక్షించి అనంతరమే మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చడంతోపాటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం’
– వాసుదేవరెడ్డి, ఎండీ, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment