సాక్షి, అమరావతి: వ్యక్తులు ఎవరైనా ఫిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు దానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సీఆర్‌పీసీ సెక్షన్ 200 లేదా 156(3) కింద ప్రత్యామ్నాయం ఉందని, దాని ప్రకారం మేజిస్ట్రేట్ ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ జడ్జి తీర్పు ఇదీ...
తాము ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం లేదంటూ పలువురు వ్యక్తులు గతంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాఖలైన వ్యాజ్యాలన్నింటిపై సింగిల్ జడ్జి జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. ఆ వ్యాజ్యాలన్నింటిలో వాదనలు విన్న న్యాయమూర్తి, ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నప్పుడు దానిని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టుకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఉటంకించారు. ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని, ఒకవేళ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే అందుకు చట్టంలో ప్రత్యామ్నాయాలున్నాయని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ వ్యాజ్యాలను కొట్టివేశారు.
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్...
సింగిల్ జడ్జి తన పిటిషన్‌ను కూడా కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ ముప్పుడి నాగమణి అనే మహిళ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. నాగమణి తరఫు న్యాయవాది సువ్వారి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి తీర్పు వల్ల పోలీసులు ఏ ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉండదన్నారు. అంతిమంగా ఇది అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తీరాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే ఏం చేయాలనేది చట్టంలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి తీర్పులో ఏ దోషం లేదంటూ నాగమణి అప్పీల్‌ను కొట్టేసింది.
పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోతే.. నేరుగా హైకోర్టుకు రాకూడదు
Published Sun, Feb 6 2022 5:16 AM | Last Updated on Sun, Feb 6 2022 7:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment