ఓ అంశానికి సంబంధించి ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాజ్యాన్ని విచారించాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కాదన్న నెపంతో న్యాయమూర్తిని తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించకుండా ఎవ్వరూ ఆపలేరని పేర్కొంది. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్‌ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.