
అప్పీల్‌పై సోమవారం విచారణ
♦ ఏఏజీ అభ్యర్థనను అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం
♦ మీరు ఉత్తర్వులిచ్చినా సభకు అనుమతించడం లేదు
♦ సింగిల్ జడ్జి ముందు ప్రస్తావించిన రోజా తరపు న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై శాసన సభా వ్యవహారాలశాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. తమ అప్పీల్ గురించి శుక్రవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ముందు ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రస్తావించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల గురించి వివరించారు. ఈ అప్పీల్‌పై సోమవారం విచారణ చేపట్టాలని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ సోమవారం విచారణ చేపట్టాలంటే ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారని, ఆ రోజున ప్రస్తావిస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నించింది. సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించే రోజు కావడంతో ఆ రోజున తమ అప్పీల్‌ను కేసుల జాబితాలో చేర్చడం సాధ్యం కాదని రిజిస్ట్రీ చెబుతోందని, అందువల్ల ఇప్పుడు ప్రస్తావిస్తున్నానని శ్రీనివాస్ చెప్పారు. దీంతో ధర్మాసనం అప్పీల్‌ను సోమవారం విచారించేందుకు అంగీకరించింది.
మీ ఉత్తర్వులను అమలు చేయడం లేదు..
కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని ఆమె తరఫు న్యాయవాది నర్మద శుక్రవారం ఉదయం న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ వర్గాలు కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఆమె తెలిపారు. దీనికి న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు స్పందిస్తూ, దీని గురించి సోమవారం ప్రస్తావించాలని ఆమెకు సూచించారు.