సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. మెరిట్ ఆధారంగా సింగిల్ జడ్జి విచారణ కొనసాగించాలని స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తమపై కేసు కొట్టివేయాలని, సిట్ విచారణ నిలిపివేయాలంటూ నిందితులు రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతోకూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది.
తొలుత ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. హైకోర్టులో జరిగిన పరిణామాలు వివరించారు. కింది కోర్టు బెయిల్‌ను తిరస్కరించినా నిందితులు సవాల్ చేయలేదని తెలిపారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. రిమాండు ఉత్తర్వులు, బెయిలు ఉత్తర్వులు వేర్వేరని తెలిపారు. అరెస్టు చేయడానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పడం సరికాదన్నారు. హైకోర్టు అనుమతితో నిందితులను ట్రయల్‌కోర్టులో హాజరుపరిచి రెండు రోజుల కస్టడీకి తీసుకున్నామని, దీంతో హైకోర్టు రిమాండు ఉత్తర్వులకు కాలం చెల్లిందని దుష్యంత్ దవే తెలిపారు.
‘ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అర్నేశ్‌కుమార్ తీర్పును హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పులో పలు లోపాలున్నాయని నిందితుల తరఫు న్యాయవాది తన్మయ్ మెహతా తెలిపారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 ప్రయోగించారని.. లంచం తీసుకున్న వారిపై దీన్ని ప్రయోగిస్తారని చెప్పారు. హైకోర్టు తీర్పు అర్నేశ్‌కుమార్ తీర్పునకు విరుద్ధంగా ఉందన్నారు.
ఇవేం వ్యాఖ్యలు?
హైకోర్టు తీర్పులోని పదాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టు, హైకోర్టులు సమానమే. హైకోర్టులేమీ కింది కోర్టులు కాదని చెబుతుంటాం. సింగిల్ జడ్జి పదాలు ఆక్షేపణీయంగా ఉన్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో నాయకులను అరెస్టు చేయొచ్చు.. అధికార పార్టీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం అన్ని అంశాలు మాట్లాడతారంటూ దుష్యంత్ దవే పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేసి చట్టపరమైన అంశాలపైనే మాట్లాడాలని దుష్యంత్ దవేకు సూచించింది. అన్ని పార్టీల నేతలను బెయిల్‌పై విడుదల చేస్తుంటామని పేర్కొంది. అవినీతి నిరోధక కేసులో పోలీసులు ట్రాప్ చేసి నిందితులను పట్టుకున్నారని దుష్యంత్ దవే తెలిపారు.
ప్రతి కేసులోనూ నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలనడం సరికాదన్నారు. రూ.వందల కోట్లలో లంచానికి సంబంధించిన ఈ అంశం పోలీసుల సమక్షంలో జరిగిన నేరమని, ఇది దర్యాప్తు చేయదగిన కేసు అని చెప్పారు. ట్రాప్ కేసుల్లో అప్పటికప్పుడే సాక్ష్యాధారాలు సేకరించకుంటే వాటిని నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తరఫున హాజరైన మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా తెలిపారు. దర్యాప్తునకు సహకరించినప్పుడు అరెస్టు అవసరం లేదని సిద్ధార్థ్ దవే చెప్పారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని దవే బదులిచ్చారు. రాజకీయ పార్టీ పిటిషన్ లేకపోతే అదే రోజు బెయిలిచ్చే వారమని గత విచారణలో చెప్పినట్లు ధర్మాసనం పేర్కొంది. ‘సింగిల్ జడ్జి ఉత్తర్వులు సరిగాలేవు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలు అవసరం లేదు. నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలి. బెయిల్ పిటిషన్లపై విచారణ త్వరగా పూర్తి చేయాలి’ అని పేర్కొంటూ ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగించింది.
సిట్ దర్యాప్తు పిటిషన్‌పై...
తొలుత నిందితుల తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తును సీబీఐ లేదా న్యాయమూర్తుల నేతృత్వంలోని సిట్‌కు బదిలీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఓ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌లో దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించారని, తర్వాత స్టే ఎత్తివేశారని తెలిపారు. దీన్ని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయగా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలిచ్చిందన్నారు. ఈ సందర్భంలో సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకొని హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టి నిందితుల పిటిషన్‌పై విచారణ చేయాలని సూచిస్తామంది. ప్రభుత్వం తరఫున హాజరైన దుష్యంత్ దవే విభేదించడంతో ప్రత్యేక దర్యాప్తునకు అర్హత ఉన్న కేసా కాదా అని హైకోర్టు నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను న్యాయమూర్తి పర్యవేక్షించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. జైన్ హవాలా తదితర కేసుల్లో సుప్రీంకోర్టు కూడా పర్యవేక్షణ అదేశాలిచ్చిందని దుష్యంత్ దవే చెప్పారు. దర్యాప్తుపై స్టే విధించొద్దని కోరారు.
ఇదీ చదవండి: ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగానికి అవకాశం లేనట్టే!
Comments
Please login to add a commentAdd a comment