తెలంగాణ హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన ధర్మాసనం
హైకోర్టు, రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా చెప్పడంపై అసహనం
అడవుల ప్రాధాన్యత గుర్తించడంలో మనుషులకు ‘మతిమరుపు’ ఉంటుందని ఘాటు వ్యాఖ్య
ఆ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.300 కోట్లు..
సాక్షి, న్యూఢిల్లీ/భూపాలపల్లి: అటవీశాఖకు ఓ వ్యక్తికి మధ్య చోటు చేసుకున్న భూ వివాదానికి 40 ఏళ్ల తర్వాత తెరపడింది. వరంగల్ జిల్లాలోని 106.34 ఎకరాల అటవీ భూమి ప్రైవేట్ భూమి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అత్యంత విలువైన ఆ భూమి అటవీశాఖకు చెందినదేనంటూ గురువారం తీర్పునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరే‹Ù, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన సుప్రీం ధర్మాస నం గురువారం కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తికి చెరో రూ.5 లక్షలు జరిమానా విధించింది.
ఈ మొత్తాన్ని జాతీయ న్యాయసేవల సంస్థ (నల్సా)కు రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది. వరంగల్ జిల్లా కొంపల్లిలోని సర్వే నంబర్ 171/3 నుంచి 171/7 వరకు ఉన్న 106.34 ఎకరాలు తమవేనని అబ్దుల్‌ఖాసీం తదితరులు ప్రకటించుకున్నారు. ఈ మేరకు 1981లో జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ నిరాకరించడంతో 1984లో ఆ భూమిని డీ నోటిఫై చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతోపాటు వరంగల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. అక్కడ అనుకూలంగా ఆదేశాలు వచ్చినప్పటికీ ఉమ్మడి హైకోర్టు ఆ ఆదేశాలను కొట్టివేసింది.
అనంతరం ఆ వ్యక్తి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. తెలంగాణ హైకోర్టు ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం గురువారం ఆదేశాలు వెలువరించింది. భూమి తమదని చెప్పుకోవటానికి ఆ వ్యక్తులకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ సమయంలో తెలంగాణ హైకోర్టు, రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తులకు అనుకూలంగా నివేదికలు ఇవ్వడం.. సుప్రీంకోర్టులోనూ అనుకూలంగా రిజాయిండర్ దాఖలు చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
వాద, ప్రతివాదులకు జరిమానా విధిస్తూ అడవుల ప్రాముఖ్యత తెలుసుకోవాలని సూచించింది. అడవుల ప్రాధాన్యతను గుర్తించడంలో మనుషులకు ‘మతిమరుపు’ ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అడవులు నిస్వార్థంగా మాతృసేవ అందిస్తున్నప్పటికీ ప్రజలు నాశనం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అడవులను పరిరక్షించడం మనుషుల బాధ్యత అని వాటి క్షీణత వల్ల తామే నష్టపోతామన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించింది. పర్యావరణ కేంద్రీకృత విధానాలను ప్రభుత్వాలు అనుసరించాలని తెలిపింది.
అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు: డీఎఫ్‌ఓ
ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్‌లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు డీఎఫ్‌ఓ వసంత తెలిపారు. ఈ కేసులో అటవీశాఖ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, ఏఓఆర్ శ్రావణ్‌కుమార్ వాదించారు. ఈ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా అటవీశాఖ ఆ భూములు తమ శాఖకే చెందుతాయని వాదించగా, రెవెన్యూ శాఖ మాత్రం ఆ భూమిపై ప్రైవేట్ వ్యక్తికే హక్కులున్నాయని అఫిడవిట్లు దాఖలు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రం నుంచి రెండు ప్రభుత్వ శాఖలు విభిన్న వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకే వాదనను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని గత అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో సదరు 106.34 ఎకరాలను అటవీ భూమిగా స్పష్టంచేశారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించి దాన్ని అటవీ భూమిగా గుర్తిస్తూ తీర్పు వెలువరించినట్లు వసంత తెలిపారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment