సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏడాదిన్నర సన్నద్ధత అంతా వృథా అయిపోతుందా?, ఎన్నో ఆశలతో గ్రూప్–1 కొలువు కోసం చేసిన ప్రయత్నాలు మళ్లీ మొదటికి వస్తాయా? అనే ఆందోళన నెలకొంది. మొత్తం మీద రెండోసారి రాసిన పరీక్షను హైకోర్టు రద్దు చేయడమే ఇందుకు కారణం. ప్రశ్నపత్రాల కుంభకోణం నేపథ్యంలో తొలిసారి ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు తాజా తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించిందనే సమాచారం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరటనిస్తోంది.
అప్పుడలా..ఇప్పుడిలా..!
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ కేటగిరీల జాబితా తయారు చేసి 1:50 నిష్పత్తిలో మెయిన్‌కు అర్హుల జాబితాను ప్రకటించి పరీక్ష తేదీలు సైతం వెల్లడించింది.
అయితే టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రశ్నపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. కమిషన్ సిబ్బంది కొందరు వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు లీక్ చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూడడంతో టీఎస్‌పీఎస్సీ వరుసగా వివిధ పరీక్షలను రద్దు చేసింది.
ఈ క్రమంలోనే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను సైతం రద్దు చేసింది. గత జూన్ 11వ తేదీన తిరిగి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. రెండోసారి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించింది. రెండోసారి 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షలను కమిషన్ అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి కమిషన్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు.
పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న తీర్పు ఇచ్చారు. దీంతో ఎంతకాలంగానే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా దీనిపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్య వైఖరి వల్లే గందరగోళం నెలకొందంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సైతం స్పష్టం చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిoచింది. దీంతో అభ్యర్థులు మరింత ఆవేదనకు గురయ్యారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్లు సమాచారం.
మళ్లీ చిగురిస్తున్న ఆశలు
హైకోర్టు తీర్పు తుది కాపీ రాగానే వచ్చేవారంలో టీఎస్‌పీఎస్సీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఉద్యోగాల కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఏ విధమైన తీర్పు వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు బలంగా విన్పించాలని, మళ్లీ పరీక్ష నిర్వహించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ, ఆ తర్వాత గాంధీ జయంతి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వరుస సెలవులున్నాయి. కాగా సుప్రీంకోర్టు తీర్పుపైనే గ్రూప్–1 పరీక్ష భవితవ్యం ఆధారపడి ఉంది. ఇతర గ్రూప్ పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో గ్రూప్–1 మళ్లీ నిర్వహణ ప్రభుత్వానికి కూడా సవాలుగానే మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment