dissolution
-
ఏపీ శాసనసభ రద్దు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ రద్దు అయ్యింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ బుధవారం మధ్యాహ్నాం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.వాస్తవానికి 15వ శాసనసభ గడువు జూన్ 16వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఫలితాలు వెలువడడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న అసెంబ్లీని రద్దు చేయాల్సి రావడం అనివార్యమైంది. -
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్‌లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి: ఉద్ధవ్
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘శివసేన పేరు, విల్లు, బాణం గుర్తును మా వద్ద నుంచి దొంగిలించారు. కానీ, థాకరే పేరును మాత్రం దొంగిలించలేరు’ అని సోమవారం మీడియాతో అన్నారు. ఈసీ అంత హడావుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తాము వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో బహుశా మంగళవారం విచారణకు రావొచ్చని అన్నారు. ‘‘ఎన్నికల సంఘం ఉత్తర్వులు తప్పు. సుప్రీంకోర్టే మా చివరి ఆశా కిరణం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘నేడు మాకు జరిగినట్లే రేపు మరొకరికి జరగొచ్చు. ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలూ ఉండవు’ అని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల నేపథ్యంలో మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, తదితర విపక్ష నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారన్నారు. సుప్రీం తలుపుతట్టిన ఉద్ధవ్ వర్గం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ, విల్లు, బాణం ఎన్నికల గుర్తు కేటాయించడాన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తిరస్కరించింది. ‘‘నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రండి’’ అని సీజేఐ సూచించారు. -
పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం.. రంగంలోకి సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కరణ వ్యవహారాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు వెల్లడించింది.కాగా, పాకిస్తాన్ పార్లమెంట్ (జాతీయ అసెంబ్లీ)లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు. సభను ఈ నెల 25 వరకూ వాయిదా వేశారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ తీరుపై విపక్ష పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్ అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. (చదవండి: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు) దేశ ద్రోహంతో సమానం జాతీయ అసెంబ్లీ రద్దును పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేత షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇమ్రాన్ చర్యలు దేశద్రోహంతో సమానమని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. 90 రోజుల్లో ఎన్నికలు ఇక దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని కోరారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నారు. ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు. (చదవండి: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన పదవీ గండం) -
నేపాల్ ప్రజాస్వామ్యానికి ఓలి షాక్
నేపాల్ అస్థిర ప్రభుత్వాల చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నియామకం అయిన రెండేళ్లలోపు అవిశ్వాస తీర్మానం తెచ్చే వీల్లేకుండా సంస్కరణ తెచ్చారు. అయితే నిర్ణీత సమయం మీరకముందే ప్రధాని ఓలి పార్లమెంటును రద్దు చేయడానికి పూనుకోవడం అంటేనే సుస్థిరతను కొనసాగించడం అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చినట్లే. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి పార్లమెంటును రద్దు చేసే అధికారం లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ రద్దును సమర్థించుకోవడం అంటే సంస్కరించిన పార్లమెంటరీ వ్యవస్థను తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. ఈ తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టే తగిన తీర్పు చెప్పాల్సి ఉంది. నేపాల్ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి నిరంకుశపాలనకు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణం. తన సొంత ప్రయోజనాల కోసం ప్రధాని పార్లమెంటునే రద్దు చేయడంతో నేపాల్ రాజకీయ కల్లోలంలో చిక్కు కుంది. పాలక పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఓలి, ప్రచండ మధ్య అంతర్గత పోరు పరాకాష్ఠకు చేరిన నేపథ్యంలో ప్రధాని ఓలిపై అవిశ్వాస తీర్మానం గురించి చర్చిస్తున్నారన్న పుకార్ల మధ్య కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఓలి అనుకూలురను చొప్పించ డానికి ఆర్డినెన్స్ తీసుకురావడంతో సంక్షోభం ముది రిపోయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి రాజరికాన్ని మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న తరు ణంలో ఈ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. నేపాల్‌లో ప్రప్రథమంగా ఎన్నికైన ప్రభు త్వాన్ని, పార్లమెంటును 1960లో రాజరికపు కుట్ర ద్వారా రద్దు చేసిన ఘటనకు 60 సంవత్సరాలు గడిచిన సందర్భంలోనే ఓలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాకతాళీయం కావచ్చు కానీ ఇది మరొక చారిత్రక తప్పిదం వైపు దారితీస్తున్నట్లే చెప్పాలి. ఎన్నికలను తాజాగా నిర్వహించడం అప్రజాస్వామికం కాకపోవచ్చు. కానీ ప్రధాని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతినిధుల సభను రద్దు చేయడం అనేది ఇప్పటికే సంస్కరించి ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రం లేదనే చెప్పాలి. సమస్యకు నాంది 2017 సాధారణ ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని డెమాక్రటిక్ అలయెన్స్‌కు వ్యతిరే కంగా నేపాల్ ఐక్య మార్క్సిస్ట్ లెనినిస్టు (సీపీఎన్– యుఎమ్ఎల్), సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) నేతృత్వంలో వామపక్ష ఎన్నికల కూటమి ఏర్ప డింది. నేపాల్ అభివృద్ధికి అస్థిరత్వమే ప్రధాన ఆటంకమని చెబుతూ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తా మని ఈ కూటమి హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు కమ్యూనిస్టు కూటమికి అనుకూలంగా తీర్పిచ్చారు. పార్లమెంటులో ఉన్న 275 స్థానాలకుగానూ 175 ఈ కూటమి గెల్చుకుని ఏడు ప్రావిన్స్‌లలో ఆరింట ప్రభుత్వాలను ఏర్పర్చింది. ఎన్నికల కూటమితో మొదలైన ఈ క్రమం రెండు పార్టీల విలీనానికి దారితీసి కమ్యూనిస్టు పార్టీ అఫ్ నేపాల్ (సీపీఎన్) ఏర్పడింది. కానీ ఈ కొత్త పార్టీ అంతర్గత ఘర్షణల్లో మునిగిపోయింది. పార్టీలోని ఇద్దరు కీలక నేతలు పార్టీలోనూ, ప్రభు త్వంలోనూ అధికారాన్ని ప్రతిష్టించుకోవడం కోసం నిత్య పోరాటాలకు తెరతీశారు. అంతర్గత ఘర్షణ ముదురుతున్న నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో ప్రధాని ఓలి రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. ఒకటి, పొలిటికల్ పార్టీస్ యాక్ట్. దీంతో పార్టీని చీల్చడం సులభం అయింది. రెండు, రాజ్యాంగ మండలి యాక్ట్ సవరణ. దీంతో కీలకమైన రాజ్యాంగ పదవుల్లో తన అనుయాయులను నామి నేట్ చేయడం సులభమైంది. పార్టీలోనూ ప్రజ ల్లోనూ తీవ్ర విమర్శ తర్వాత ఓలి వెనక్కు తగ్గి తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు. అయితే తనపై అవిశ్వాస తీర్మానం తీసుకురానున్నారనే అను మానం తలెత్తడంతో ఏకంగా పార్లమెంటునే రద్దు చేసిపడేశారు. అధ్యక్ష, ప్రధాని దుష్ట కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాని వివాదా స్పదమైన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన ప్రతి సందర్భం లోనూ దానికి ప్రతిపక్షం తీవ్ర వ్యతిరేకత తెలుపు తున్నప్పటికీ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి వెను వెంటనే ఆమోదం తెలుపుతూ వచ్చారు. రాజ్యాంగ మండలి చట్టం అలాంటి ఆర్డినెన్సుల్లో ఒకటి. ప్రధాని నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మండ లిలో చీఫ్ జస్టిస్, పార్లమెంటు స్పీకర్, జాతీయ అసెంబ్లీ చైర్మన్, ప్రతిపక్ష నేత, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఓలి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మండలి సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావలసిన సభ్యుల సంఖ్యను అయిదు నుంచి మూడుకు కుదించింది. అంటే ప్రధాని, ఆయన పార్టీకి చెందిన మరొక సభ్యుడు మాత్రమే నియామకాలపై కీలక నిర్ణయాలు తీసుకోగలరు. రాజ్యాంగం ప్రకారం పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర తనిఖీకి చెందిన ప్రాతిపదికనే ఈ ఆర్డినెన్స్ చెరిపివేసింది. రాజ్యాంగాన్ని నీరుగార్చేశారు రాజ్యాంగ నిబంధనలను ప్రాతిపదికగా చేసు కుని అధ్యక్షురాలు ప్రధాని సిఫార్సులను ఆమో దిస్తూ వచ్చారు. దీంతో పార్లమెంటరీ వ్యవస్థ ప్రాథ మిక స్ఫూర్తిని నేపాల్లోనూ, అంతర్జాతీయంగానూ ఈక్రమంలో తొక్కిపెట్టేశారు. ఆర్టికల్ 76(1), (7), ఆర్టికల్ 85 ఆధారంగా పార్లమెంటును రద్దు చేశారు. పార్లమెంటు పదవీకాలం అయిదేళ్లు కొన సాగాలని ఆర్టికల్ 85 చెబుతోంది. ఆర్టికల్ 76 (7) పార్లమెంటు రద్దుకు రాజ్యాంగం ప్రకారం అనుమ తించే ఏకైక నిబంధనగా ఉంటోంది. ఇక ఆర్టికల్ 76 అయితే మెజారిటీ పార్టీ నేత, సంకీర్ణ పార్టీల నేత, అతిపెద్ద పార్టీ నేత లేదా మెజారిటీని నిరూపించు కునే చేవ కలిగిన ఏ సభ్యుడైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పర్చే ప్రయత్నాలన్నింటికీ ప్రెసిడెంట్ తావిచ్చి చూడాలి. ఆ తర్వాత మాత్రమే ఆర్టికల్ 76(7) కింద ప్రధాని సిఫార్సుతో పార్లమెంటును రద్దు చేయవచ్చు. అంటే ఆర్టికల్ 76 అనేది ప్రభుత్వ స్థాపననే ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ప్రభు త్వాన్ని ఏర్పర్చే అవకాశమే లేదని తేలిన తర్వాతే తాజా ఎన్నికల నిర్వహణకు గానూ పార్లమెంటును రద్దు చేయవచ్చు. అంతేకానీ పార్లమెంటును మధ్యలో రద్దు చేయడానికి ఆర్టికల్ 76(7)ని ఉపయోగించలేరు. 1990ల నాటి రాజ్యాంగంలో ఆర్టికల్ 53 కింద ఒక స్పష్టమైన నిబంధన ఉండేది. దానిప్రకారం ప్రధాని సిఫార్సు మేరకే నేపాల్ రాజు పార్లమెం టును రద్దు చేయగలిగేవాడు. ప్రధాని ఇష్టాయిష్టాల మేరకు పార్లమెంటును పదే పదే రద్దు చేస్తూ వచ్చిన గుణపాఠాలతో నూతన రాజ్యాంగం ఆర్టికల్ 76 (7) కింద పరిమిత సందర్భాల్లో మాత్రమే రద్దు చేయడానికి అనుమతించింది. అయితే రెండేళ్లలోపే కొత్త ప్రభుత్వ హయాంలో ప్రధాని సిఫార్సు మేరకు పార్లమెంటును రద్దుచేయడం సరికొత్త పరిణామం గానే చెప్పాలి. 1995లో కూడా రెండు సందర్భాల్లో ప్రధానులు పార్లమెంటు రద్దు కోరుతూ తీర్మానిం చినప్పుడు, రాజు ఆమోదం లభించినా కూడా సుప్రీంకోర్టు విభేదించి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమైన తర్వాతే పార్లమెంటు రద్దుకు అధికారాన్ని ఉపయోగిం చాలని వ్యాఖ్యా నించి రద్దును కొట్టేసింది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి పార్లమెం టును రద్దు చేసే అధికారం లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ అంతర్జాతీయ ఆచరణను చూపించి నేపాల్‌లో అలాంటి రద్దుకు పాల్పడవచ్చని సమ ర్థించుకోవడం అంటే సంస్కరించబడిన పార్లమెం టరీ వ్యవస్థను తప్పుగా అర్థం చేసుకోవడమే. నేపాల్ చరిత్రలో అస్థిర ప్రభుత్వాలు, వాటి రాజ కీయీకరణ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రధానిని నియమించిన రెండేళ్లలోపు అవిశ్వాస తీర్మానం రాకుండా సంస్కరణ తెచ్చారు. మంత్రిమండలిని తన విధులు నెరవేర్చేలా చూడటం ప్రస్తుత రాజ్యాంగం తీసుకొచ్చిన సంస్క రణ. అయితే నిర్ణీత సమయం మీరకముందే పార్లమెంటును రద్దు చేయడానికి పూనుకోవడం అంటేనే సుస్థిరతను కొనసాగించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చినట్లే అవుతుంది. ఈకోణంలో ప్రధాని ఓలి చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి, అప్రజాస్వామికమైనవి, చారిత్రక తప్పిదాలను కొనసాగించేవి. నేపాల్‌కు రాజరికం, నిరంకుశ అధికారం, రాజ్యాంగ ఉల్లంఘనల బాధాకరమైన చరిత్ర ఉంది. ప్రస్తుత నేతలు కూడా దాన్నే పాటిస్తే ప్రజలు భరించలేరు. అంతకు మించి ఒక పార్టీలోని అంతర్గత వివాదం రాజ్యాం గాన్నే బందీ చేయకూడదు. రాజ్యాంగాన్ని పరిరక్షిం చడానికి సుప్రీంకోర్టే తగిన తీర్పు చెప్పాల్సి ఉంది. రాబిన్ శర్మ, హార్దిక్ సుబేది వ్యాసకర్తలిద్దరూ ఖాట్మండు న్యాయవాదులు, నల్సార్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. -
మళ్లీ నేపాల్‌లో అస్థిరత
నిరంతరం సంక్షోభం నుంచి సంక్షోభానికి పయనించడం అలవాటైన నేపాల్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం హఠాత్తుగా 275మంది సభ్యులుండే పార్లమెంటు దిగువ సభను రద్దు చేశారు. పాలకపక్షం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్)లో గత కొన్నినెలలుగా పుట్టిన ముసలం కారణంగా ప్రతినిధుల సభకు ఇంకా ఏడాది గడువుండగానే ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఓలి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో ఓలి ప్రభుత్వానికి మూడింట రెండొంతుల మెజారిటీ...అంటే 174మంది సభ్యుల మద్దతు వుంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆదర్శనీయంగా రెండేళ్లక్రితం ఓలి నాయకత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్టు సెంటర్)లు విలీనమై సీపీఎన్గా ఏర్పడ్డాయి. అయితే కలిశాయన్న మాటేగానీ ఆ రెండు సంస్థలూ రెండు వర్గాలుగా పనిచేస్తున్నాయి. అయిదేళ్లక్రితం ఆమోదం పొంది గణతంత్ర నేపాల్ ఆవిర్భావానికి మూలకారణమైన రాజ్యాంగం ఇలా అర్థాంతరంగా పార్లమెంటు రద్దు చేయడాన్ని అంగీకరిస్తుందా లేదా అన్న అంశంలో వాదోపవాదాలు సాగుతున్నాయి. పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో డజను పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీల విలీనంలోనే వివాదం బీజాలున్నాయి. విలీనం సందర్భంగా కుదిరిన ఒప్పందం ఇటీవలికాలం వరకూ రహస్యంగానే వుండిపోయింది. ఓలి, ప్రచండలిద్దరికీ, పార్టీలో మరికొందరికీ మాత్రమే దాని వివరాలు తెలుసు. అందులో ఇద్దరూ చెరిసగం కాలం పాలించాలన్న షరతుంది. సింహాసనం అధిరోహించాక ఓలి దాన్ని మరిచిపోవడమే తాజా వివాదానికి దారితీసింది. భిన్న పార్టీలైనా, సంస్థలైనా విలీనం కావడానికి అనేక కారణాలుంటాయి. ఐక్య సంఘటనగా కలిసి పనిచేస్తున్న క్రమంలో వాటిమధ్య ఏర్పడే సదవగాహన...ఒకే రకమైన సిద్ధాంతాలు లేదా ఆశయాలు వున్నాయన్న అభిప్రాయం...ఉమ్మడిగా సాధించాల్సింది ఎంతోవుందన్న భావన –ఇలా ఏదో ఒక ప్రేరణ వున్నప్పుడే ఏ విలీనమైనా సహేతుకమైనదవుతుంది. కానీ స్వప్రయోజనాలే పరమార్థం అయినప్పుడు పేరుకు విలీనం జరిగినా అది కాస్తా ప్రహసప్రాయంగా మిగులుతుంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీల కలయిక చివరి బాపతేనని గత కొన్ని నెలల పరిణామాలు చెబుతున్నాయి. ఒప్పందంలోని షరతు బేఖాతరు చేశాక సీపీఎన్లో రాజుకున్న మంటలు చూసి ఓలి మొదట్లో బెంబేలెత్తారు. రాజీ బేరాలు సాగించారు. సీనియర్లతో చర్చోపచర్చలు సాగించి పార్టీ కార్యనిర్వహణాధికారాలను ప్రచండకు కట్టబెట్టడానికి సమ్మతించారు. అది మొదట్లో కొన్నాళ్లు పనిచేసింది. ప్రచండ పార్టీ చైర్మన్ అయ్యారు. కానీ త్వరలోనే ఆయనకు అంతా అర్థమైంది. పార్టీ స్థాయీ సంఘాన్ని సంప్రదించకుండా మంత్రులు, విదేశాలకు రాయబారులు తదితరుల్ని నియమిస్తూ ఓలి తనను నామమాత్రం చేశారని, ప్రభుత్వంతోపాటు పార్టీపై కూడా ఆయన పట్టే సాగుతోందని గుర్తించారు. మళ్లీ ప్రచండలో అసంతృప్తి మొదలైంది. దాన్ని చల్లార్చడానికి మరో మంచి పదవి అప్పగిస్తానని ఓలి ఊరించారు. కానీ పాలనా పగ్గాలు అప్పజెప్పడం మినహా తనకు మరేదీ సమ్మతం కాదని ఆయన హఠాయించారు. పేచీ సద్దుమణగకపోవడంతో కొంతకాలంగా ఓలి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని కొన్ని రోజులుగా ఆయన హెచ్చరిస్తున్నారు. తాజా నిర్ణయంతో అదేమిటో అందరికీ అర్థమైంది. ఓలి, ప్రచండల మధ్య మౌలికంగా చాలా వ్యత్యాసాలున్నాయి. నేపాల్‌లో హిందూ రాజరిక వ్యవస్థ వున్న కాలంలో అమలైన పార్టీ రహిత పంచాయతీ విధానానికి వ్యతిరేకంగా అరవయ్యో దశకంలోనే ఉద్యమం సాగించి కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఓలి పార్లమెంటరీ రాజకీయాల్లో ఆరితేరారు. కానీ ప్రచండ ఇందుకు భిన్నం. ఆయన అజ్ఞాతంలో పనిచేసే కమ్యూనిస్టు పార్టీలో 1981లో చేరి, సాయుధ పోరాట రాజకీయాల్లో తలమునకలయ్యారు. అందుకే కావొచ్చు... రాజకీయ ఎత్తుగడల్లో ఓలితో పోలిస్తే ప్రచండ వెనకబడివున్నట్టు కనబడతారు. పార్టీలో కీలక నాయకులనదగ్గవారు ప్రచండతోనే వున్నారు. అందుకే ‘చాలా పెద్ద చర్య’ తీసుకుంటానని చెప్పినప్పుడు ఆయన పార్టీని చీలుస్తాడని ...ఆయనతో పార్టీనుంచి వైదొలగేవారు వుండరుగనుక ఓలి విఫలమవుతారని ప్రచండ వర్గం సీనియర్ నేతలు భావించారు. పార్టీ చీలికపై వున్న చట్ట నిబంధనలను మొన్న ఏప్రిల్‌లో మారుస్తూ ఓలి ఆర్డినెన్సు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆ అంచనాకు కారణం కావొచ్చు. పార్టీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో దాన్ని విరమించుకున్నా, ఓలి అసలు ఆంతర్యం పార్లమెంటు రద్దని ఇప్పుడు వారికి తెలిసొచ్చింది. ఓలి తాజా నిర్ణయంపై సుప్రీంకోర్టు ఏమంటుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. 76వ అధికరణ ప్రకారం ఒక ప్రభుత్వం కుప్పకూలినప్పుడు అప్పుడుండే పార్లమెంటుద్వారా తదుపరి ప్రభుత్వం ఏర్పడటం అసాధ్యమని తేలాకే దాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలి. పాలకపక్షానికి మూడింట రెండొంతుల మెజారిటీ వుండగా పార్లమెంటును ఎలా రద్దు చేస్తారన్నదే ప్రశ్న. పాలకపార్టీ నేతలు పరస్పరం కుమ్ములాడుకుంటూ మధ్యలో పార్లమెంటుపై దాడి చేయడం సరికాదని విపక్షాలు అంటున్నాయి. నేపాల్ రాజకీయాలు మొదటినుంచీ పొరుగునున్న రెండు పెద్ద దేశాలు చైనా, భారత్‌లతో ముడిపడివుంటున్నాయి. ఓలి, ప్రచండలిద్దరూ చైనాకు సన్నిహితులే. అందుకే వారి మధ్య రాజీ కుదిర్చేందుకు చైనా లోపాయికారీగా కష్టపడింది. కానీ ఆ మధ్యవర్తిత్వం తనకు అనుకూలంగా వుండదనుకున్నారో, ఏమోగానీ ఓలి ఇటీవల మన దేశానికి దగ్గరయ్యారు. గత నెలలో మన విదేశాంగ కార్యదర్శి ఆ దేశం పర్యటించారు. భూకంప వైపరీత్యంనుంచి అయిదేళ్లయినా కోలుకోని నేపాల్ కరోనా మహమ్మారితో మరింత సంక్షోభంలో పడింది. ఇలాంటి సమయంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశాన్ని ఎటు తీసుకెళ్తుందో చూడాలి. -
ఏయూ పాలకమండలి రద్దు
ఉన్నత విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం కట్టింది. సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ప్రస్తుత పాలకవర్గాలపై వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గం కూడా రద్దయ్యింది. 2016 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గాన్ని నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరితోనే పాలకవర్గ పదవీకాలం పూర్తి కాగా.. మరో అరు నెలలు పొడిగిస్తూ అదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న పాలకమండలి వర్సిటీ అభివృద్ధికి చేసిన కృషి మచ్చుకైనా కనిపించలేదు. అధికారులు సూచించిన వాటికి తలూపడం తప్ప విలువైన సూచనలు గానీ, తమస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయించడానికి గానీ ప్రయత్నించకుండా నామమాత్రంగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిని మార్చడానికే వైఎస్ జగన్ సర్కారు వర్సిటీలపై వేటు వేయడంతో మంచి పాలకమండలి వస్తుందన్న ఆనందం వర్సిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: విశ్వ విద్యాలయాల బలోపేతం.. ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమర్థ వంతమైన సారథులను నియమించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని మెత్తం 10 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవోఆర్టీ 82ను విడుదల చేసింది. దీంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం పాలక మండలి రద్దయింది. తాజాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆచార్య హేమచంద్రారెడ్డి నియామకం.., నేడు పాలక మండళ్లు రద్దు చేయడం ప్రభుత్వం దూకుడును స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహాలో త్వరలో వర్సిటీల్లో పూర్తిస్థాయిలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో పాలక మండలి సభ్యులుగా ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆచార్య జి.శశిభూషణరావు, డాక్టర్ సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, గ్రంధి మల్లికార్జున రావు, డాక్టర్ కె.మురళీదివి, డాక్టర్ పి.సోమనాథరావు, ఆచార్య ఎన్. బాబయ్యలను నియమిస్తూ 2016 ఫిబ్రవరి 3న అప్పటి ప్రభుత్వం జీవోఎంఎస్ 5ను జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వీరిని నియమించింది. ఆ ప్రకారం వీరి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. అయితే పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 24న జీవో 32ను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నేపథ్యంలో నేటితో పాలక మండలి పూర్తిస్తాయిలో రద్దయ్యినట్లయింది. అలాగే వచ్చే నెల 16వ తేదీతో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ అయ్యే విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సైతం త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకమండలి సమావేశంలో చర్చిస్తున్న సభ్యులు (పాత చిత్రం) నామమాత్రంగా పాలక మండళ్లు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన పాలక మండలి సభ్యులు నామమాత్రంగానే మిగిలిపోయారు. పాలక మండలి సమావేశంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి వీరు అందించిన సూచనలు మచ్చుకైనా కనిపించలేదు. వర్సిటీ అధికారులు ప్రవేశపెట్టే వివిధ అంశాలను పరిశీలించడం, అనుమతించడం, తిరస్కరించడానికే పరిమితమైంది.వర్సిటీ అధికారులకు, పాలక మండలి సభ్యులకు మధ్య సమన్వయం కుదరడానికి చాలా సమయం పట్టింది. దీంతో వర్సిటీ పాలకులకు, పాలక మండలి సభ్యులకు మధ్య అగాథం పెరిగింది. పాలక మండలి సభ్యులు వర్సిటీ వికాసానికి ఉపకరించే పథకాలు అమలు చేయడానికి సూచనలు చేయలేదు. ఆ వర్సిటీలు యథాతథమే సబ్బవరంలోని న్యాయవిశ్వవిద్యాలయం హైకోర్టు పర్యవేక్షణలో నడుస్తోంది. ఇక మారిటైం యూనివర్సిటీ కేంద్రప్రభుత్వ పరిధిలో నడుస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వీటికి వర్తించదు. నెరవేరని ఆశయం విశ్వవిద్యాలయాల పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు ఉండాలనే గత ప్రభుత్వ ఆశయం పూర్తిగా నీరుగారింది. ఏయూ పాలక మండలి సభ్యులుగా నియమితులైన గ్రంధి మల్లికార్జున రావు(జీఎంఆర్), డాక్టర్ మురళీ దివిలు ఒక్క పాలక మండలి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు.దీంతో వారు నామమాత్రమే అయ్యారు. పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాల ప్రగతిని, అమలును తర్వాత సమావేశం జరిగేలోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌గా ఏయూ అధికారులు తయారు చేసి పాలక మండలి సభ్యులకు అందించాల్సి ఉంటుంది. దీన్ని అందించడంలో వర్సిటీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. వర్సిటీకి సంబంధించిన ఆర్థిక నిర్వహణ అనుమతులు, ఇతర అత్యవసర అనుమతులు అవసరమైన సందర్భాలలో మాత్రమే పాలక మండలి సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకు సామేశం జరగాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే అవకాశం పాత పాలక మండలి రద్దు కావడంతో త్వరలో నూతన పాలక మండలి ఏర్పాటు అవుతుందని ఆచార్యులు భావిస్తున్నారు. దీంతో పాలక మండలిలో స్థానం పొందడానికి ఆచార్యులు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నారు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే చోటు లభించే అవకాశం అవకాశం ఉంటుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. -
ముదిరిన లంక సంక్షోభం
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సృష్టించిన రాజకీయ సంక్షోభం చివరకు ఆ దేశంలో పార్లమెంటు రద్దుకు, మధ్యంతర ఎన్నికలకు దారితీసింది. ప్రధాని పదవిలో ఉన్న రనిల్ విక్రమసింఘేను ఆకస్మికంగా ఆ పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు దాన్ని కట్టబెట్టిన సిరిసేనకు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. నమ్మి పదవినిచ్చిన సిరిసేనను నట్టేట ముంచి, తనతోపాటు మరో 44మంది మాజీ ఎంపీలను తీసుకుని సోదరుడు బాసిల్ రెండేళ్లక్రితం ఏర్పాటు చేసిన శ్రీలంక పొదుజన పెరిమునా(ఎస్ఎల్పీపీ)కు రాజపక్స వలసపోయారు. దాంతో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) డీలాపడింది. ఆయన వరస నిర్ణయాలను చట్టవిరుద్ధమని ప్రకటించా ల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ మొదలు కావలసి ఉండగా... సిరిసేన వీటిని బేఖాతరు చేస్తూ పార్లమెంటును రద్దు చేసి, వచ్చే జనవరి 5న ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేశారు. పార్లమెంటు రద్దుకు సిరిసేన చెబుతున్న కారణాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ముందనుకున్నట్టు బుధవారం పార్లమెంటులో బలాబలాలు తేల్చుకోవలసి వస్తే... రనిల్, రాజపక్స వర్గాలకు చెందిన ఎంపీల మధ్య ఘర్షణలు తలెత్తి హింస చోటు చేసుకునే ప్రమాదం ఉన్నదని, అదే జరిగితే గ్రామస్థాయి వరకూ హింస చెలరేగి అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయని ఆయన అంటున్నారు. పార్లమెంటును రద్దు చేయడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించానని వివరిస్తున్నారు. ఇది తన అక్రమ చర్యల్ని కప్పెట్టుకోవడం తప్ప మరేమీ కాదు. రాజపక్సకు తిరిగి అధికారం కట్టబెట్టడంపై తన పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఓటింగ్ అంటూ జరిగితే తన నిర్ణయం వీగిపోవడం ఖాయమని గ్రహించబట్టే ఆయన మరో తప్పుడు చర్యకు సిద్ధపడ్డారు. ప్రధాని తొలగింపు వ్యవహారం మాదిరే పార్లమెంటు రద్దు కూడా రాజ్యాంగ విరుద్ధమే. పార్లమెంటు సభ్యుల్లో మూడింట రెండు వంతులమంది కోరితే తప్ప పార్లమెంటు రద్దు చేయరాదని మూడేళ్లక్రితం తీసుకొచ్చిన 19వ రాజ్యాంగ సవరణ చెబుతోంది. మరో అధికరణలో పార్లమెంటు రద్దుకు సంబంధించిన అధికారం గురించిన ప్రస్తావన ఉంది గనుక సిరిసేన చర్య చెల్లుతుందని ఆయన మద్దతుదార్లు వాదిస్తున్నారు. ఆయన చర్యలపై సుప్రీంకోర్టు నిష్పాక్షికంగా విచారణ జరిపితే దీన్లోని రాజ్యాంగ విరుద్ధత తేటతెల్లమవుతుంది. ప్రజలెన్నుకునే పార్లమెంటుపై అధ్యక్షుడు నిరంకుశంగా పెత్తనం చలాయించడానికి వీల్లేదని దేశంలోని ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఉద్యమిస్తున్నారు. ఈ అపరిమిత అధికారాల తొలగింపునకు తాను సిద్ధపడతానని 2015లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా సిరిసేన హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చడం కోసం 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తీరా ఆచరణలోకొచ్చేసరికి దానికి విరుద్ధంగా ప్రవర్తించారు. ఈ విషయంలో సిరిసేనతో చేతులు కలిపి రాజపక్స తప్పుచేశారు. 2005లో అధ్యక్షుడై నప్పటినుంచీ రాజపక్స చైనాకు సన్నిహితంగా మెలిగారు. వారి సహకారంతోనే తమిళ టైగర్లను తీవ్రంగా అణచివేశారు. ఈ క్రమంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు సంజాయిషీ కోరుతున్నాయి. తమిళ టైగర్ల విషయంలో చేసిన సాయానికి కృతజ్ఞతగా రాజపక్స చైనాకు భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టు లిచ్చారు. ఆ దేశం నుంచే తుపాకులు, ఇతర రక్షణ సామగ్రి కొన్నారు. 2014లో కొలంబో నౌకాశ్రయంలో చైనా జలాంతర్గామి ఉనికి వెల్లడయ్యాక మన దేశం కూడా అప్రమత్తమైంది. దాని ఫలితంగానే 2015 ఎన్నికల్లో ఏమాత్రం పొసగని విక్రమసింఘే–సిరిసేనల మధ్య అవగాహన సాధ్యపడిందని చెబుతారు. మూడున్నరేళ్ల తర్వాత ఆ అమరిక దెబ్బతినడం వెనక చైనా ఉండొచ్చునని రాజకీయ నిపుణుల అంచనా. తమ ఎంపీలను కొనడానికి చైనా డబ్బు కుమ్మరిస్తున్నదని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేత ఈమధ్యే ఆరోపించారు. ఇప్పుడు సిరిసేన, రాజపక్సల మధ్య కృత్రిమ మైత్రి కుదిర్చి, విక్రమసింఘేను సాగనంపడంలో చైనా పాత్ర ఉన్నదని స్థానిక మీడియా చెబుతోంది. కానీ సిరిసేన, రాజపక్సల మైత్రికి మెజారిటీ పార్లమెంటు సభ్యుల ఆమోదం లేకపోవడంతో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటే అయింది. రాజపక్స 2005–15 మధ్య సింహళ జాతీయ వాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా దీర్ఘకాలం అధికారంలో కొనసాగారు. తాను తప్పుకుంటే మళ్లీ తమిళ టైగర్లు విజృంభిస్తారని కూడా 2015 ఎన్నికల సందర్భంగా ఆయన హెచ్చరించారు. అయితే అవినీతి, బంధుప్రీతి ఆరో పణల వల్లా, ఆర్థిక రంగంలో చవిచూసిన దారుణ వైఫల్యాల వల్లా సింహళులు ఆయన్ను తిరస్కరించారు. అటు తమిళులు, ముస్లింలలో 70 శాతంమంది అప్పట్లో సిరిసేనకు మద్దతు పలికారు. ఫలితంగా రాజపక్స వైదొలగవవలసి వచ్చింది. ఇప్పుడాయన తన బాణీ మార్చారు. జైళ్లలో మగ్గుతున్న తమిళుల విడుదలకు తమ పార్టీ అవసరమైన చర్యలు తీసుకుం టుందని కుమారుడి ద్వారా చెప్పించారు. అయితే లంక తమిళులు ఈ విషయంలో రాజపక్సను ఏమేరకు నమ్ముతారో అనుమానమే. దానిమాటెలా ఉన్నా శ్రీలంక రాజకీయ సంక్షోభం అంతర్జాతీయంగా ఆ దేశానికి అప్రదిష్ట మిగిల్చింది. ఆ దేశానికి విడుదల చేయాల్సి ఉన్న 50 కోట్ల డాలర్ల సాయాన్ని అమెరికా నిలిపివేసింది. జపాన్ నుంచి రావలసిన 140 కోట్ల రుణం కూడా ఆగిపోయింది. శ్రీలంక నుంచి వచ్చే దిగుమతులకు సుంకం మినహాయింపును ఉపసంహరిస్తామని యూరప్ యూనియన్(ఈయూ) హెచ్చరించింది. వివిధ రంగాల్లో ఇప్పటికే 800 కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ప్రస్తుత అనిశ్చితిలో కొత్తగా రుణాలు మంజూరు చేసి ఆదుకోవడం కష్టమే. సిరిసేనకు ఇది గడ్డుకాలం. దీన్నుంచి గట్టెక్కలేకపోతే రాజకీయంగా తెరమరుగుకావడం ఖాయం. -
లంకలో సంక్షోభం...
పార్లమెంట్ రద్దుతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఊహించని పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ గడువు ఇంకా రెండేళ్లు ఉండగానే రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన 225 సభ్యుల పార్లమెంట్ రద్దు, ఎన్నికల నిర్వహణకు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సహా వివిధ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెబుతూ రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ప్రధాని రాణిల్ విక్రమసింఘే నాయకత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) సిద్ధమవుతోంది. మొదలైన అస్థిరత... గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు మైత్రీపాల అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించడం మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. ప్రధాని పదవిని విడిచిపెట్టేందుకు విక్రమసింఘే ససేమిరా అనడంతో విక్రమసింఘే, రాజపక్సెల మధ్య అధికారం కోసం గత రెండువారాలుగా సాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనే దానిపై పార్లమెంట్లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడిని పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను సస్పెండ్ చేశారని ప్రతిపక్షాలు భావించాయి. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని పలువురు సభ్యులు పేర్కొన్నారు. అమెరికా, తదితర దేశాల ఒత్తిళ్లలో పార్లమెంట్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తేసేందుకు మూడుసార్లు సిరిసేన అంగీకరించినా ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలు లేవనేది స్పష్టం కావడంతో ఆ దేశాధ్యక్షుడు పార్లమెంట్‌రద్దుకు నిర్ణయం తీసుకున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. శ్రీలంక పార్లమెంటు రద్దు వార్తపై అమెరికా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. సుస్ధిరత, అభ్యున్నతి కోసం ప్రజాస్వామ్య సంస్థలు, ప్రక్రియలను గౌరవించాల్సిన అవసరం ఉందని అమెరికా పేర్కొంది. అధ్యక్షుడి ఆకస్మిక నిర్ణయం నేపథ్యంలో విశ్వాసపరీక్షలో నెగ్గేంత స్థాయిలో ఎంపీలను కూడగట్టుకోలేకపోయినట్లు సిరిసేనకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యూపీఎఫ్యే) అంగీకరించింది. ఆపధర్మ ప్రధానిగా రాజపక్స... ప్రస్తుత పరిణామాలతో సభలో మెజారిటీని నిరూపించుకోకుండా తప్పించుకున్న రాజపక్స ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్త పార్లమెంట్ సమావేశమయ్యే (జనవరి 17) వరకు ఆపధర్మ ప్రధానిగా ఉంటారు. పార్లమెంట్‌రద్దు నిర్ణయానికి ముందే అధ్యక్షుడు సిరిసేన తన కేబినెట్లోకి మరికొందరు మంత్రులను తీసుకున్నారు. పార్లమెంట్లో మెజారిటీ నిరూపణకు ఈ నెల 14న విశ్వాసపరీక్ష నిర్వహణకు స్పీకర్ కారు జయసూరియా చేస్తున్న ప్రయత్నాలకు అధ్యక్షుడి తాజా నిర్ణయం గండి కొట్టినట్టు అయ్యింది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ , విక్రమ సింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇటీవలి కాలంలో సిరిసేన,విక్రమ సింఘేల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, దేశంలోని ఓడరేవును భారత్‌కు లీజు విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. మనదేశం నుంచి సరుకుల రవాణాకు ఉపయోగపడే కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే కోరుకున్నాడు. ఈ నేపథ్యంలో సిరిసేన–విక్రమసింఘేల మధ్య విభేదాలు మరింత తీవ్రం కావడంతో మళ్లీ అధికారానికి రావాలన్న రాజపక్స ఆశలు ఫలించే అవకాశాలు ఏర్పడ్డాయి. రాజపక్సే అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు (గతంలో రెండుసార్లు)వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. మళ్లీ దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారానే అధ్యక్షుడు ఏ విధంగా ప్రధానిని తొలగించవచ్చో నిర్వచించారు. దీనిని కూడా అధ్యక్షుడు సిరిసేన పాటించకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమైంది. రాజపక్సతో ఇబ్బందులు... విక్రమసింఘే ప్రభుత్వ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో ప్రధాని పదవిపై రాజపక్స కన్నేసారు. ఎల్టీటీఈ పట్ల అనుసరించిన కఠిన వైఖరితో పాటు ఉల్లంఘనలకు పాల్పడిన సైనికులపై చర్యలకు విముఖంగా ఉన్న కారణంగా శ్రీలంక మిలటరీ నుంచి రాజపక్సకు మద్దతు లభిస్తోంది. ఎల్టీటీఈను అణచేసాక కూడా సింహళ బుద్దిస్ట్ జాతీయవాదిగా రాజపక్స మైనారిటీ తమిళియన్లు, ముస్లింల పట్ల వివక్షచూపారు. సింహళ బుద్ధిస్ట్ తీవ్రవాదులు శ్రీలంకలోని ముస్లింలపై చే సిన దాడులకు పరోక్ష మద్దతునిచ్చారు. ఈ కారణంగానే 2015 ఎన్నికల్లో తమిళులు, ముస్లింలు రాజపక్సకు వ్యతిరేకంగా ఓటువేసి ఆయన ఓటమికి కారణమయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనా వైపు పూర్తిగా మొగ్గారు. సింహళ బుద్ధిస్ట్‌లకు రాజపక్స సంపూర్ణ మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న తమిళుల భద్రతకు ముప్పు ఏర్పడితే భారత్‌పై దాని దుష్ప్రభావం పడుతుంది. రాజపక్స మళ్లీ అధికారానికి వస్తే శ్రీలంకలో చైనా జోక్యం పెరగగడం వల్ల మనదేశానికి అంతర్జాతీయంగా సమస్యలు ఎదురుకావడంతో పాటు దేశంలో అంతర్గతంగా తమిళుల సమస్య మళ్లీ పునరావృతమవుతుందని భారత్ ప్రధాన ఆందోళన. -
తల్చుకుంటే సర్కారును రద్దు చేసే వాళ్లం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాము తలచుకుని ఉంటే తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండే వాళ్లమని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరుచెందూరులోని సెంథిల్నాథన్ ఆలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నాడీఎంకే ప్రభుత్వం తనకు తానుగానే కూలిపోతుంది. అసెంబ్లీలో బలం కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. మేం తలచుకుని ఉంటే ఆర్టికల్–356ను ప్రయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండేవాళ్లం’ అని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం బీజేపీతో రహస్య సంబంధాలను నెరపుతోందనీ, తమిళనాడులో ప్రస్తుతం మోదీ ప్రభుత్వమే సాగుతోందని విమర్శలు రావడం తెల్సిందే. -
పెళ్లి చేయాలని చూస్తే నాకు ఫోన్ చెయ్
♦ బాలికతో తహసీల్దార్ విజయకుమారి ♦ పాతకోల్కుంద గ్రామంలో ♦ బాల్య వివాహ ఏర్పాట్లు నిలిపివేత ♦ వధువు, వరుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ మోమిన్‌పేట: బలవంతంగా పెద్దలు నీకు పెళ్లి చేయాలని చూస్తే నాకు ఫోన్ చెయ్.. వెంటనే వివాహాన్ని నిలిపివేసి మీ తల్లిదండ్రులను జైలుకు పంపిస్తాం.. దాంతోపాటు నువ్వు చదువుకునేందుకు చైల్డ్ హోంకు పంపిస్తామని తహసీల్దార్ విజయకుమారి ఓ బాలికకు ధైర్యం చెప్పారు. ఈనెల 6న మండల పరిధిలోని పాత కోల్కుంద గ్రామానికి చెందిన రాములు, మాణెమ్మ దంపతుల కూతురు శివలీల(15)కు ఇదే మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కోల్కుంద కిష్టయ్య కుమారుడు పేతూరుతో వివాహం చేసేందుకు ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. శివలీల పెళ్లి విషయం 1098కి సమాచారం అందడంతో సోమవారం ఆమె తల్లిదండ్రులను, పేతూరు తల్లిదండ్రులను తహసీల్దార్ విజయకుమారి తన కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అమ్మాయికి మైనారిటీ తీరేవరకు పెళ్లి చేయబోమని బాలిక తల్లిదండ్రులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయకుమారి బాలికకు ధైర్యం చెప్పారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. బాగా చదువుకొని జీవితంలో నీ సొంతకాళ్లపై నిలబడాలని సూచించారు. మీ తల్లిదండ్రులు నీకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే నాకు ఫోన్ చెయ్.. ఆ తర్వాత నేను చూసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కాంతారావు, పీఎస్ఐ వెంకటేశ్వర్లు, 1098 సిబ్బంది దేవకుమారి తదితరులు ఉన్నారు. -
రాష్ట్ర శాసనసభ రద్దు
-
రాష్ట్ర శాసనసభ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం సుప్తచేతనావస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రపతి పాలనను పొడిగించాలని కూడా శుక్రవారం రాష్ర్టపతికి సిఫారసు చేసింది. రాజ్యాంగం ప్రకారం రాష్ర్టపతి పాలన విధించిన రెండు నెలల్లోగా అందుకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంది. ఈ నెల 30తో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలనకు రెండు నెలల గడువు ముగుస్తోంది. ఆలోగా పార్లమెంట్ ఆమోదం పొందలేకపోతే అసెంబ్లీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో నేతలంతా తలమునకలవడంతో ప్రస్తుతం పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరిచే పరిస్థితి లేదు. ఇందుకు కేంద్రం సానుకూలంగా లేదు. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మన్మోహన్సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ అంశంపై చర్చ జరిగింది. రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా మంత్రివర్గం ముందు హాజరై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అన్నింటినీ బేరీజు వేసుకున్న కేంద్ర కేబినెట్.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా అసెంబ్లీ రద్దుకే మొగ్గు చూపింది. అలాగే రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ రాష్ర్టపతి మళ్లీ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్లమెంట్ ఆమోదానికి మరో రెండు నెలల గడువు లభిస్తుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ, సీమాంధ్రల్లో కొత్త శాసనసభలు కొలువు తీరనున్నాయి. ఈ ప్రక్రియ రెండు నెలల్లోపే పూర్తి కానుండటంతో ‘రెండు నెలల’ నిబంధన అడ్డంకి కాబోదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. శాసనసభ రద్దవుతుండటంతో ప్రస్తుత ఎమ్మెల్యేలంతా మాజీలుకానున్నారు. కేబినెట్ తాజా సిఫారసులకు రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలిపే అవకాశముంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన విషయంలో నిర్ణయాన్ని కేబినెట్ వాయిదా వేసింది. ఈ అంశంపై ఇంకా చర్చించాల్సి ఉందని, మరింత సమాచారం తీసుకుని వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.