నేపాల్‌ ప్రజాస్వామ్యానికి ఓలి షాక్‌ | Nepal PM Oli Recommends Parliaments Dissolution | Sakshi
Sakshi News home page

నేపాల్‌ ప్రజాస్వామ్యానికి ఓలి షాక్‌

Published Fri, Dec 25 2020 12:00 AM | Last Updated on Fri, Dec 25 2020 12:00 AM

Nepal PM Oli Recommends Parliaments Dissolution - Sakshi

నేపాల్‌ అస్థిర ప్రభుత్వాల చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నియామకం అయిన  రెండేళ్లలోపు అవిశ్వాస తీర్మానం తెచ్చే వీల్లేకుండా సంస్కరణ తెచ్చారు. అయితే నిర్ణీత సమయం మీరకముందే ప్రధాని ఓలి పార్లమెంటును రద్దు చేయడానికి పూనుకోవడం అంటేనే సుస్థిరతను కొనసాగించడం అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చినట్లే. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి పార్లమెంటును రద్దు చేసే అధికారం లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ రద్దును సమర్థించుకోవడం అంటే సంస్కరించిన పార్లమెంటరీ వ్యవస్థను తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. ఈ తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టే తగిన తీర్పు చెప్పాల్సి ఉంది.

నేపాల్‌ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి నిరంకుశపాలనకు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణం. తన సొంత ప్రయోజనాల కోసం ప్రధాని పార్లమెంటునే రద్దు చేయడంతో నేపాల్‌ రాజకీయ కల్లోలంలో చిక్కు కుంది. పాలక పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఓలి, ప్రచండ మధ్య అంతర్గత పోరు పరాకాష్ఠకు చేరిన నేపథ్యంలో ప్రధాని ఓలిపై అవిశ్వాస తీర్మానం గురించి చర్చిస్తున్నారన్న పుకార్ల మధ్య కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఓలి అనుకూలురను చొప్పించ డానికి ఆర్డినెన్స్‌ తీసుకురావడంతో సంక్షోభం ముది రిపోయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి రాజరికాన్ని మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న తరు ణంలో ఈ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. 

నేపాల్‌లో ప్రప్రథమంగా ఎన్నికైన ప్రభు త్వాన్ని, పార్లమెంటును 1960లో రాజరికపు కుట్ర ద్వారా రద్దు చేసిన ఘటనకు 60 సంవత్సరాలు గడిచిన సందర్భంలోనే ఓలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాకతాళీయం కావచ్చు కానీ ఇది మరొక చారిత్రక తప్పిదం వైపు దారితీస్తున్నట్లే చెప్పాలి. ఎన్నికలను తాజాగా నిర్వహించడం అప్రజాస్వామికం కాకపోవచ్చు. కానీ ప్రధాని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతినిధుల సభను రద్దు చేయడం అనేది ఇప్పటికే సంస్కరించి ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రం లేదనే చెప్పాలి.

సమస్యకు నాంది
2017 సాధారణ ఎన్నికల్లో నేపాల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని డెమాక్రటిక్‌ అలయెన్స్‌కు వ్యతిరే కంగా నేపాల్‌ ఐక్య మార్క్సిస్ట్‌ లెనినిస్టు (సీపీఎన్‌– యుఎమ్‌ఎల్‌), సీపీఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) నేతృత్వంలో వామపక్ష ఎన్నికల కూటమి ఏర్ప డింది. నేపాల్‌ అభివృద్ధికి అస్థిరత్వమే ప్రధాన ఆటంకమని చెబుతూ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తా మని ఈ కూటమి హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు కమ్యూనిస్టు కూటమికి అనుకూలంగా తీర్పిచ్చారు. పార్లమెంటులో ఉన్న 275 స్థానాలకుగానూ 175 ఈ కూటమి గెల్చుకుని ఏడు ప్రావిన్స్‌లలో ఆరింట ప్రభుత్వాలను ఏర్పర్చింది.

ఎన్నికల కూటమితో మొదలైన ఈ క్రమం రెండు పార్టీల విలీనానికి దారితీసి కమ్యూనిస్టు పార్టీ అఫ్‌ నేపాల్‌ (సీపీఎన్‌) ఏర్పడింది. కానీ ఈ కొత్త పార్టీ అంతర్గత ఘర్షణల్లో మునిగిపోయింది. పార్టీలోని ఇద్దరు కీలక నేతలు పార్టీలోనూ, ప్రభు త్వంలోనూ అధికారాన్ని ప్రతిష్టించుకోవడం కోసం నిత్య పోరాటాలకు తెరతీశారు. అంతర్గత ఘర్షణ ముదురుతున్న నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో ప్రధాని ఓలి రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. ఒకటి, పొలిటికల్‌ పార్టీస్‌ యాక్ట్‌. దీంతో పార్టీని చీల్చడం సులభం అయింది. రెండు, రాజ్యాంగ మండలి యాక్ట్‌ సవరణ. దీంతో కీలకమైన రాజ్యాంగ పదవుల్లో తన అనుయాయులను నామి నేట్‌ చేయడం సులభమైంది. పార్టీలోనూ ప్రజ ల్లోనూ తీవ్ర విమర్శ తర్వాత ఓలి వెనక్కు తగ్గి తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు. అయితే తనపై అవిశ్వాస తీర్మానం తీసుకురానున్నారనే అను మానం తలెత్తడంతో ఏకంగా పార్లమెంటునే రద్దు చేసిపడేశారు.

అధ్యక్ష, ప్రధాని దుష్ట కూటమి
స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాని వివాదా స్పదమైన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన ప్రతి సందర్భం లోనూ దానికి ప్రతిపక్షం తీవ్ర వ్యతిరేకత తెలుపు తున్నప్పటికీ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి వెను వెంటనే ఆమోదం తెలుపుతూ వచ్చారు. రాజ్యాంగ మండలి చట్టం అలాంటి ఆర్డినెన్సుల్లో ఒకటి. ప్రధాని నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మండ లిలో చీఫ్‌ జస్టిస్, పార్లమెంటు స్పీకర్, జాతీయ అసెంబ్లీ చైర్మన్, ప్రతిపక్ష నేత, డిప్యూటీ స్పీకర్‌ ఉంటారు. ఓలి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ మండలి సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావలసిన సభ్యుల సంఖ్యను అయిదు నుంచి మూడుకు కుదించింది. అంటే ప్రధాని, ఆయన పార్టీకి చెందిన మరొక సభ్యుడు మాత్రమే నియామకాలపై కీలక నిర్ణయాలు తీసుకోగలరు. రాజ్యాంగం ప్రకారం పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర తనిఖీకి చెందిన ప్రాతిపదికనే ఈ ఆర్డినెన్స్‌ చెరిపివేసింది.

రాజ్యాంగాన్ని నీరుగార్చేశారు
రాజ్యాంగ నిబంధనలను ప్రాతిపదికగా చేసు కుని అధ్యక్షురాలు ప్రధాని సిఫార్సులను ఆమో దిస్తూ వచ్చారు. దీంతో పార్లమెంటరీ వ్యవస్థ ప్రాథ మిక స్ఫూర్తిని నేపాల్‌లోనూ, అంతర్జాతీయంగానూ ఈక్రమంలో తొక్కిపెట్టేశారు. ఆర్టికల్‌ 76(1), (7), ఆర్టికల్‌ 85 ఆధారంగా పార్లమెంటును రద్దు చేశారు. పార్లమెంటు పదవీకాలం అయిదేళ్లు కొన సాగాలని ఆర్టికల్‌ 85 చెబుతోంది. ఆర్టికల్‌ 76 (7) పార్లమెంటు రద్దుకు రాజ్యాంగం ప్రకారం అనుమ తించే ఏకైక నిబంధనగా ఉంటోంది. ఇక ఆర్టికల్‌ 76 అయితే మెజారిటీ పార్టీ నేత, సంకీర్ణ పార్టీల నేత, అతిపెద్ద పార్టీ నేత లేదా మెజారిటీని నిరూపించు కునే చేవ కలిగిన ఏ సభ్యుడైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పర్చే ప్రయత్నాలన్నింటికీ ప్రెసిడెంట్‌ తావిచ్చి చూడాలి. ఆ తర్వాత మాత్రమే ఆర్టికల్‌ 76(7) కింద ప్రధాని సిఫార్సుతో పార్లమెంటును రద్దు చేయవచ్చు. అంటే ఆర్టికల్‌ 76 అనేది ప్రభుత్వ స్థాపననే ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ప్రభు త్వాన్ని ఏర్పర్చే అవకాశమే లేదని తేలిన తర్వాతే తాజా ఎన్నికల నిర్వహణకు గానూ పార్లమెంటును రద్దు చేయవచ్చు. అంతేకానీ పార్లమెంటును మధ్యలో రద్దు చేయడానికి ఆర్టికల్‌ 76(7)ని ఉపయోగించలేరు.

1990ల నాటి రాజ్యాంగంలో ఆర్టికల్‌ 53 కింద ఒక స్పష్టమైన నిబంధన ఉండేది. దానిప్రకారం ప్రధాని సిఫార్సు మేరకే నేపాల్‌ రాజు పార్లమెం టును రద్దు చేయగలిగేవాడు. ప్రధాని ఇష్టాయిష్టాల మేరకు పార్లమెంటును పదే పదే రద్దు చేస్తూ వచ్చిన గుణపాఠాలతో నూతన రాజ్యాంగం ఆర్టికల్‌ 76 (7) కింద పరిమిత సందర్భాల్లో మాత్రమే రద్దు చేయడానికి అనుమతించింది. అయితే రెండేళ్లలోపే కొత్త ప్రభుత్వ హయాంలో ప్రధాని సిఫార్సు మేరకు పార్లమెంటును రద్దుచేయడం సరికొత్త పరిణామం గానే చెప్పాలి. 1995లో కూడా రెండు సందర్భాల్లో ప్రధానులు పార్లమెంటు రద్దు కోరుతూ తీర్మానిం చినప్పుడు, రాజు ఆమోదం లభించినా కూడా సుప్రీంకోర్టు విభేదించి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమైన తర్వాతే పార్లమెంటు రద్దుకు అధికారాన్ని ఉపయోగిం చాలని వ్యాఖ్యా నించి రద్దును కొట్టేసింది.

పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి పార్లమెం టును రద్దు చేసే అధికారం లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ అంతర్జాతీయ ఆచరణను చూపించి నేపాల్‌లో అలాంటి రద్దుకు పాల్పడవచ్చని సమ ర్థించుకోవడం అంటే సంస్కరించబడిన పార్లమెం టరీ వ్యవస్థను తప్పుగా అర్థం చేసుకోవడమే. నేపాల్‌ చరిత్రలో అస్థిర ప్రభుత్వాలు, వాటి రాజ కీయీకరణ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రధానిని నియమించిన రెండేళ్లలోపు అవిశ్వాస తీర్మానం రాకుండా సంస్కరణ తెచ్చారు. మంత్రిమండలిని తన విధులు నెరవేర్చేలా చూడటం ప్రస్తుత రాజ్యాంగం తీసుకొచ్చిన సంస్క రణ. అయితే నిర్ణీత సమయం మీరకముందే పార్లమెంటును రద్దు చేయడానికి పూనుకోవడం అంటేనే సుస్థిరతను కొనసాగించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చినట్లే అవుతుంది.

ఈకోణంలో ప్రధాని ఓలి చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి, అప్రజాస్వామికమైనవి, చారిత్రక తప్పిదాలను కొనసాగించేవి. నేపాల్‌కు రాజరికం, నిరంకుశ అధికారం, రాజ్యాంగ ఉల్లంఘనల బాధాకరమైన చరిత్ర ఉంది. ప్రస్తుత నేతలు కూడా దాన్నే పాటిస్తే ప్రజలు భరించలేరు. అంతకు మించి ఒక పార్టీలోని అంతర్గత వివాదం రాజ్యాం గాన్నే బందీ చేయకూడదు. రాజ్యాంగాన్ని పరిరక్షిం చడానికి సుప్రీంకోర్టే తగిన తీర్పు చెప్పాల్సి ఉంది.

రాబిన్‌ శర్మ, హార్దిక్‌ సుబేది 
వ్యాసకర్తలిద్దరూ ఖాట్మండు న్యాయవాదులు, 
నల్సార్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement