నిజమైన నివాళి అదే! | Parliament Attack Was 20 Years Guest Column Manmohan Bahadur | Sakshi
Sakshi News home page

నిజమైన నివాళి అదే!

Published Wed, Dec 22 2021 12:52 AM | Last Updated on Wed, Dec 22 2021 12:52 AM

Parliament Attack Was 20 Years Guest Column Manmohan Bahadur - Sakshi

పార్లమెంట్‌పై దాడికి 20 ఏళ్లు

అది 2001, డిసెంబర్‌ 13. ఢిల్లీకే ప్రత్యేకించిన ఓ చలికాలపు  ఉదయాన వైమానిక దళాధికారి సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్నాను. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.వై టిప్నీస్‌ ఆరోజు ఆఫీసులో లేరు. మా ఆఫీసు నుంచి చూస్తుంటే నార్త్‌ బ్లాక్, సౌత్‌ బ్లాక్, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ స్పష్టంగా కనిస్తున్నాయి. అది ఉత్తర భారతదేశంలో పెళ్లిల్ల సీజన్‌ కాబట్టి టపాసుల శబ్దాలు వినిపించినప్పుడు ఆందో ళన చెందేవాళ్లం కాదు. ఆరోజు పార్లమెంట్‌ వైపు నుంచి వినిపించిన కాల్పుల శబ్దాల వంటివాటిని ముందుగా పట్టించుకోనప్పటికీ, వాటి తీవ్రత పెరిగి అవి తుపాకీ కాల్పులేనని స్పష్టమవ్వడంతో నేను వెంటనే వైస్‌ చీఫ్, ఎయిర్‌ మార్షల్‌ కృష్ణస్వామి ఆఫీస్‌కు వెళ్లాను.

పార్లమెంట్‌ దగ్గర కాల్పులు జరుగుతున్నాయని చెప్పాను. అప్పటికే ఢిల్లీ పోలీస్‌ జీపులు సైరన్‌ మోతలతో పార్లమెంట్‌ వైపు పరుగి డుతున్నాయి. కొద్ది సేపటికే అక్కడ భ్రదతా దళాలు మొహ రించాయి. హఠాత్తుగా జరిగే ఉగ్రదాడులను ఎదుర్కోవ డంలో దేశ భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉండాలో  చెప్తూ చర్చను లేవనెత్తిన ఉగ్రదాడి అది. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా మరోసారి మన భద్రతా సన్నద్ధతను అవలోకించవలసిన సందర్భం ఇది.

అత్యంత అధునాతన ఆయుధాలు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడిచేయడానికి ఢిల్లీలో తిరు గాడుతుంటే మన నిఘా వ్యవస్థ  గుర్తించలేకపోయింది. 1999లో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైన నేపథ్యంలో తలెత్తిన కార్గిల్‌ యుద్ధం జరిగిన రెండేళ్లకే ఈ దాడి జరగ టంతో విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాతైనా నిఘా వ్యవస్థ మెరుగుపడిందా? ఏడేళ్ల తర్వాత 26/11 ముంబయి మారణకాండ మన నిఘా వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడ లేదనే విషయాన్ని నిర్థారించింది.

ఆ తర్వాత అనేక నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నప్పటికీ 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవా నుల మరణానికి కారణమైన 2019లో జరిగిన పుల్వామా దాడి, లడఖ్‌లో గత ఏడాది జరిగిన చైనీయుల చొరబాటు, ఈ ఏడాది జూన్‌లో జమ్మూలోని వైమానిక కేంద్రంపై జరి గిన దాడి వంటివాటిని ఎందుకు గుర్తించలేకపోయినట్లు? అలాగే 2016లో యూరీలో చోటుచేసుకున్న మరణాలు, పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి జరిగిన చొరబాటును మనం మర్చిపోయామా? ఐబీ, రా, ఎన్‌టీఆర్‌ఓ, డీఐఏ,ఎన్‌ఐఏ వంటి కేంద్ర సంస్థలు, అనేక రాష్ట్ర నిఘా సంస్థలు ఉన్నాయి. వీటికి జవాబుదారీతనం ఉండాలి.

అలాగే నిఘా వ్యవస్థల నిర్మాణాలనూ సమీక్షించాల్సిన అవసరమూ ఉంది. నిఘా వందశాతం విజయం సాధించలేకపోవచ్చు. కానీ జరిగిన సంఘటనను ఫాలో అప్‌ చేయవలసిన అవ సరం అయితే ఉంది కదా. 2008 నవంబర్‌ 26న ముంబయే కాక మొత్తం దేశం నాలుగు రోజులపాటు స్తంభించి పోయింది. యూరి లేదా పుల్వామా దాడుల వంటివి జరిగిన తర్వాత ప్రతిసారి సరిహద్దులు దాటి మనం దాడిచేయడం సాధ్యం కాదు. అటువంటి దాడుల ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పెరిగిన అంచనాలను బట్టి ప్రత్యర్థి ప్రతీకారానికి సిద్ధంగా ఉంటాడు. ఈ పరిస్థితుల్లో  ఏం చేయాలి?

ముందు రాజకీయ వ్యాఖ్యల తీవ్రత తగ్గించాలి. నిధులను తగినంతగా కేటాయించాలి. శిక్షణ కార్యక్రమా లను పునరుద్ధరించడం ప్రయోజనకరం. ఈ విషయంలో స్థిరమైన ఉగ్రవాద విధానాన్ని అనుసరిస్తున్న ఇజ్రాయెల్‌ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అద్భుతమైన సమాచార సేకరణ యంత్రాంగం, సోషల్‌ మీడియాపై నిఘా, అవసరమైనప్పుడు మెరుపు బాంబుదాడులకు దిగటం వంటివాటిని మనమూ గమనించాలి.

ఆపరేషన్‌ పరాక్రమ్‌ వంటి అరకొర సైనిక చర్యలను నివారించాలి. 10 నెలలపాటు పది లక్షల మంది ఆధునిక సైనికులను అప్రమత్తం చేసి యుద్ధ సన్నాహాలు చేయడం వల్ల, ఇండియా యుద్ధం చేయకుండానే 1874 మంది సైనికులను కోల్పోయింది. అలాగే కోట్లాది రూపాయల ధనం వ్యర్థమయింది. ఈ సైనిక చర్యల వల్ల ఏమైనా ఉగ్రవాద చర్యలు తగ్గాయా?  స్పష్టమైన రాజకీయ వ్యూహం లేకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి. 

ఇక చివరగా గమనించాల్సిందేమిటంటే.. మన శత్రు వులు మన ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుంటున్న సంగతిని గుర్తించడం. మన ప్రభుత్వం అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దానితోపాటు సామాజిక చైతన్యాన్ని కూడా రేకెత్తించవలసి ఉంది. మావో గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ‘సముద్రంలో ఈదే చేప’ అని వ్యాఖ్యా నించాడు. ప్రభుత్వం సముద్రంలాంటి ప్రజల్లో ఉగ్ర వాదం అనే చేపకు మద్దతు దొరకకుండా నిరోధించగలగాలి.  ఈ చర్యలన్నీ చేపడితే దేశ విభజన కోసం కుయుక్తులు పన్నే శక్తులను అణచివేయడం సాధ్యమవుతుంది. ఇదే పార్ల మెంట్‌పై జరిగిన దాడిలో మరణించిన మన యోధులకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది.
– వైస్‌ చీఫ్‌ మార్షల్‌ మన్మోహన్‌ బహదూర్‌ (రిటైర్డ్‌)
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement