న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ‘శివసేన పేరు, విల్లు, బాణం గుర్తును మా వద్ద నుంచి దొంగిలించారు. కానీ, థాకరే పేరును మాత్రం దొంగిలించలేరు’ అని సోమవారం మీడియాతో అన్నారు. ఈసీ అంత హడావుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై తాము వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో బహుశా మంగళవారం విచారణకు రావొచ్చని అన్నారు.
‘‘ఎన్నికల సంఘం ఉత్తర్వులు తప్పు. సుప్రీంకోర్టే మా చివరి ఆశా కిరణం’’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ‘నేడు మాకు జరిగినట్లే రేపు మరొకరికి జరగొచ్చు. ఇలాగే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలూ ఉండవు’ అని హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల నేపథ్యంలో మమతా బెనర్జీ, శరద్ పవార్, నితీశ్ కుమార్, తదితర విపక్ష నేతలు తనకు ఫోన్ చేసి మద్దతు తెలిపారన్నారు.
సుప్రీం తలుపుతట్టిన ఉద్ధవ్ వర్గం
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ, విల్లు, బాణం ఎన్నికల గుర్తు కేటాయించడాన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తిరస్కరించింది. ‘‘నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రండి’’ అని సీజేఐ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment