సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కరణ వ్యవహారాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు వెల్లడించింది.కాగా, పాకిస్తాన్ పార్లమెంట్ (జాతీయ అసెంబ్లీ)లో ఆదివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. ఈ అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందని అభిప్రాయపడ్డారు. సభను ఈ నెల 25 వరకూ వాయిదా వేశారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ తీరుపై విపక్ష పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు.. పాక్ అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు.
(చదవండి: శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు)
దేశ ద్రోహంతో సమానం
జాతీయ అసెంబ్లీ రద్దును పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నేత షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇమ్రాన్ చర్యలు దేశద్రోహంతో సమానమని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.
90 రోజుల్లో ఎన్నికలు
ఇక దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభ సభ్యులను కొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు. పాకిస్థాన్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని కోరారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలన్నారు. ఇమ్రాన్ ఖాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు.
(చదవండి: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన పదవీ గండం)
Comments
Please login to add a commentAdd a comment