ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దుపై విచారణను ఆ దేశ సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈలోపు జాతీయ భద్రతా సమాఖ్య(ఎన్‌ఎస్‌సీ) సమావేశ వివరాలను అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవిశ్వాసం వెనుక విదేశీ కుట్ర ఉందన్న ఆరోపణలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. అసెంబ్లీ రద్దుపై చీఫ్ జస్టిస్ ఉమర్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం విచారించింది.
పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) తరఫున బాబర్ అవాన్, అధ్యక్షుడు ఆల్వి తరఫున అలీ జఫీర్ హాజరయ్యారు. అధికరణ 95ను మీరి డిప్యుటీ స్పీకర్ ఇలాంటి ఆదేశాలివ్వడం సబబేనా అని అవాన్‌ను కోర్టు అడిగింది. డిప్యుటీ స్పీకర్ రూలింగ్‌ను సమర్ధించుకునే గట్టి సాక్ష్యాలు కావాలని అవాన్‌కు కోర్టు సూచించింది. ఎన్‌ఎస్‌సీ మీటింగ్ ఆధారంగా తీర్మానాన్ని తిరస్కరించినందున, ఆ సమావేశ మినిట్స్‌ను సమర్పించాలని ఆదేశించింది. డిప్యుటీ స్పీకర్ రూలింగ్‌పై ఎలాంటి ఆదేశాలిచ్చినా, కోర్టు స్వీయ అధికార పరిధి దాటినట్లవుతుందని అధ్యక్షుడి తరఫున హాజరైన జఫీర్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.
ప్రతిపక్ష పార్టీల తరఫు వాదనను ఇప్పటికే ఆయా పార్టీల న్యాయవాదులు పూర్తి చేశారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు. డిఫ్యూటీ స్పీకర్ తరఫు న్యాయవాది, ప్రభుత్వ తరఫున అటార్నీ జనరల్ ఇంకా తమ వాదనలు వినిపించాల్సిఉంది. బుధవారం అనుకున్న సమయానికి విచారణ పూర్తికానందున గురువారానికి కేసును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విదేశీ కుట్ర జరిగిందన్న ఆరోపణలపై విచారణకు ఒక న్యాయ కమిషన్ ఏర్పాటు చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు ‘మెమో గేట్ కేస్’ తరహాలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని తాజాగా ఇమ్రాన్ కోరారు. 2011లో తమ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోయకుండా సాయం చేయాలని ఒక సీనియర్ అమెరికా అధికారికి యూఎస్‌లో పాక్ రాయబారి హుసేన్ లేఖ రాశారని ఆరోపణలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment